భారతీయ అక్రమ వలసదారులతో అమెరికా మరో విమానం..
"డంకీ రూట్"లో అమెరికాలోకి ప్రవేశించిన భారతీయ అక్రమవలసదారులకు (illegal immigrants) ట్రంప్ ప్రభుత్వం వెనక్కుపంపుతోంది.;
భారతీయ అక్రమ వలసదారులతో అమెరికా(America) నుంచి మరో విమానం రాబోతుంది. 119 మందితో రేపు (ఫిబ్రవరి 15న) పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతుంది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) తో భేటీ అయిన కొన్ని గంటల తర్వాత అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అగ్రరాజ్యం అక్రమవలసదారులను జల్లెడపడుతుంది. ఇప్పటికే మొదటి విమానంలో 104 మంది ఇండియాకు పంపింది. రెండో దఫాగా అమెరికా నుంచి బయలు దేరే విమానం రాత్రి 10 గంటల ప్రాంతంలో అమృత్‌సర్ విమానాశ్రయం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. 119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు కాగా.. 33 మంది హరియాణా, 8 మంది గుజరాత్, ముగ్గురు ఉత్తరప్రదేశ్, ఇద్దరు చొప్పున గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒకరు చొప్పున హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వారు.
ఫిబ్రవరి 16న మరో విమానం?
"డంకీ రూట్" (donkey routes) (అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశించే పద్ధతి)లో రూ. లక్షలు ఖర్చుచేసి వలస వెళ్లిన పంజాబ్, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ప్రస్తుతం అమెరికా నుంచి బహిష్కరణకు గురవుతున్నారు. ఇలా వెళ్లిన వారిని అమెరికా తిరిగి వెనక్కు పంపుతుంది. మూడో దఫాగా ఫిబ్రవరి 16వ తేదీన మరో విమానం ఇండియాకు చేరుకునే అవకాశం ఉంది.
పంజాబ్(Punjab)లోనే ఎందుకు?
అక్రమవలసదారుల విమానం అమృత్‌సర్‌లోనే ల్యాండ్ అవుతుండడంపై పంజాబ్ రాష్ట్ర మంత్రి (AAP) హర్పాల్ సింగ్ చీమా విమర్శలు గుప్పించారు. "బీజేపీ ప్రభుత్వం పంజాబ్‌కు చెడ్డపేరు తేవాలని చూస్తోంది. గుజరాత్, హరియాణా లేదా ఢిల్లీలో విమానం ఎందుకు ల్యాండ్ కావడం లేదు?" అని ఆయన ప్రశ్నించారు. ఇటు పంజాబ్ ప్రభుత్వం మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 10 అక్రమ వలస ముఠాలపై కేసులు నమోదు చేసినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.