భారత పర్యటనకు రాబోతున్న వైస్ ప్రెసిడెంట్ వాన్స్

ఆయన వెంట భార్య ఉషా వాన్స్, పిల్లలు.. ఢిల్లీ తో పాటు జైపూర్, ఆగ్రా సందర్శన;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-17 11:49 GMT
జేడీ వాన్స్ కుటుంబంతో ప్రధాని మోదీ

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించబోతున్నారు. జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో కొన్ని కీలక చర్చలు జరపబోతున్నారు.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయడం, వాషింగ్టన్- న్యూఢిల్లీ మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.

ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాన్స్ దేశానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లెవీలు, మార్కెట్ యాక్సెస్, సరఫరా గొలుసులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు చర్చించే అవకాశం ఉంది.
విదేశాంగ ప్రకటన
విదేశాంగ మంత్రిత్వశాఖ బుధవారం ఈ పర్యటన వివరాలు బయటకు వెల్లడించింది. వాన్స్ కార్యాలయం కూడా విడిగా ఈ దీనిని ధృవీకరించింది. ‘‘ఉపాధ్యక్షుడు వాన్స్ భారత్ లో చేసే మొదటి పర్యటన. ఆయన ఏప్రిల్ 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు.’’ అని ఎంఈఏ తెలిపింది.
‘‘వైస్ ప్రెసిడెంట్(ఉపరాష్ట్రపతి) ఆయన ప్రతినిధి బృందం ఢిల్లీలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏప్రిల్ 24న వాషింగ్టన్ డీసీకి బయలు దేరే ముందు జైపూర్, ఆగ్రాలను కూడా సందర్శించనున్నారు’’ అని విదేశాంగశాఖ తెలిపింది.
వాన్స్- ఉషా వారి ముగ్గురు చిన్నారులు ఇవాన్, వివేక్, మిరాబెల్ వైట్ హౌజ్ లోని ముఖ్య అధికారులు ఈ పర్యటనకు వస్తున్నారు. ‘‘ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా జారీ చేసిన భారత్- అమెరికా సంయుక్త ప్రకటన ఫలితాల అమలును సమీక్షించడానికి ఇరుపక్షాలకు అవకాశాన్ని కల్పిస్తుంది’’ అని విదేశాంగ శాఖ తెలిపింది.
పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటాయని ఈ ప్రకటన తెలిపింది.
షెడ్యూల్ లో ఢిల్లీ, జైపూర్, ఆగ్రా
ఏప్రిల్ 18 నుంచి 24 వరకూ ఆయన ఇటలీ, భారత్ లను సందర్శించబోతున్నారని వాన్స్ కార్యాలయం తెలిపింది. ‘‘ ప్రతిదేశంలోని నాయకులతో ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలు ఆయన చర్చిస్తారు’’ అని వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం తెలిపింది.
‘‘భారత్ లో వాన్స్ న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారు. ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు’’ అని ఆయన కార్యాలయం వెల్లడించింది. భారత్ లోని సాంస్కృతిక ప్రదేశాలలో జరిగే కార్యక్రమాల్లో వాన్స్, ఆయన కుటుంబం కూడా పాల్గొంటుందని యూఎస్ రీడౌట్ తెలిపింది.
వాన్స్ షెడ్యూల్..
వాన్స్ తన పర్యటనలో భాగంగా ఇండియాలో దిగిన వెంటనే మొదట చారిత్రక ఎర్రకోటను సందర్శించే అవకాశం ఉందని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. మధ్యాహ్నం ఆయన జాతీయ భద్రతా సలహదారు అజిత్ ధోవల్, విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతో కలుస్తారని తెలిపింది.
ప్రధానితో వాన్స్ చర్చలు జరిపిన తరువాత సాయంత్రం వారికి అధికారిక విందు ఇస్తారని మీడియా పేర్కొంది. ఏప్రిల్ 22న జైపూర్ వెళ్లి కీలక పర్యాటక ప్రదేశాలను సందర్శించి, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాత రోజు ఆయన ఆగ్రా వెళ్తారు.
ట్రంప్ సుంకాలు..
ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానం ప్రపంచాన్ని భారీగా షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా ప్రపంచాన్ని మాంద్యం ముందు నిలబెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన భారత్ కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ట్రంప్ ప్రకటించిన సుంకాలను మరో 90 రోజులకు మినహయింపు ఇచ్చారు. కానీ ఇందులో చైనాకు ఎలాంటి మినహయింపు ఇచ్చేది లేదని వైట్ హౌజ్ ప్రకటించింది. 
ఫిబ్రవరిలో మోదీ అమెరికా పర్యటన తరువాత 2025 చివరి నాటికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశపై చర్చలు జరుపుతామని ఇరుదేశాలు ప్రకటించాయి.
అమెరికా ఎన్ఎస్ఏ పర్యటన వాయిదా..
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్ కూడా వచ్చే వారంలో భారత్ పర్యటనకు రావాల్సి ఉండేది. కానీ ఆయన పర్యటన కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
రోమ్ లో వాన్స్- జార్జియో మెలోని తో చర్చలు జరిపి ఈస్టర్ ఆదివారం ముందు జరిగే వేడుకల్లో పాల్గొనడానికి వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్ తో సమావేశమవుతారు.
అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటలిజెన్స్ తులసి గబ్బార్డ్ భారత్ పర్యటనకు వచ్చి వెళ్లిన కొన్ని వారాల తరువాత వాన్స్ భారత పర్యటనకు వస్తున్నారు.
తులసి గబ్బార్డ్ తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ తో వేర్వేరుగా సమావేశం అయ్యారు.
Tags:    

Similar News