ఇరాన్- అమెరికా మధ్య మరోసారి మాటల యుద్ధం

మర్యాదగా మాతో ఒప్పందం కుదుర్చోవాలన్నా ట్రంప్.. తిరస్కరించిన ఇరాన్;

Update: 2025-03-31 10:15 GMT
ఇరాన్ రాష్ట్రపతి మసూద్ పెజెష్కియాన్

కొత్త నిబంధనల ప్రకారం అణు ఒప్పందానికి టెహ్రాన్ అంగీకరించకపోతే సైనిక చర్య తీసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ సైతం తన సన్నద్దతను తెలియజేసే వీడియోను విడుదల చేసింది. తమపై దాడికి దిగితే పశ్చిమాసియాలో ఉన్న అన్ని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.

ఇరాన్ తయారు చేసిన క్షిపణులను భద్రంగా భూగర్భ గృహంలో దాచినట్లు, వాటిని ఏ క్షణమైనా ప్రయోగించడానికి సిద్దంగా ఉంచినట్లు ఈ నివేదిక తెలియజేసింది. ఈ బంకర్ వైమానిక దాడులు తట్టుకునే విధంగా నిర్మాణం చేసుకుందని టెహ్రాన్ టైమ్స్ ఒక నివేదికలో తెలిపింది.
ట్రంప్ హెచ్చరిక..
టెహ్రాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించకపోతే ఇరాన్ పై దాడి చేయడం తమకున్న లక్ష్యాల్లో ఒకటని ట్రంప్ ఆదివారం హెచ్చరికలు పంపారు.
‘‘వారు ఒప్పందం కుదుర్చుకోలేకపోతే బాంబు దాడి జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నడూ జరగని వాటిపై కూడా బాంబు దాడి జరుగుతుంది’’ అని ట్రంప్ ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆయన ఆదివారం సొంత రాష్ట్రం ఫ్లోరిడా కు వెళ్తూ ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇరాన్ చర్చలకు రావాలని నేను కోరుతున్నాను. లేకుంటే పరిస్థితి విషమిస్తుంది. నాలుగు సంవత్సరాల క్రితం చేసినట్లుగా ఇరాన్ ను సుంకాలతో దెబ్బతీస్తా’’ అని ట్రంప్ తనదైన శైలిలో మాట్లాడారు.
నిరాకరించిన ఇరాన్..
అయితే ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ను ఇరాన్ తిరస్కరించింది. తమపై ఏదైనా దురాక్రమణ జరిగితే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరికలు పంపింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ.. వారు చర్చలకు దూరంగా ఉండరు కానీ అమెరికా తరుచు ఇచ్చిన వాగ్థానాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
ఇచ్చిన హామీలపై ఉంటామనే నిరూపించుకోవాలి. కానీ ఇరాన్ ప్రత్యక్షంగా అమెరికాతో చర్చలు నిరాకరించినప్పటికీ, ఒమన్ వంటి దేశాలతో పరోక్ష చర్చలకు సిద్దంగా ఉన్నామని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
85 సెకన్ల వీడియో..
ఇరాన్ అధ్యక్షుడు తన ఇంటర్వ్యూ ఇచ్చిన కాసేపటికే తన భూగర్భ గృహ వీడియోనే టెహ్రాన్ విడుదల చేసింది. ఇందులో దాడి చేయడానికి సిద్దంగా ఉన్న క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దీనిని క్షిపణి నగరంగా పిలుస్తారని వీడియోలో పేర్కొన్నారు.
ఈ మిస్సైల్స్ ను పశ్చిమాసియాలో ఉన్న అన్ని అమెరికా స్థావరాలను నాశనం చేయగలదని అందులో హెచ్చరించారు. ఈ వీడియోలోనే ఇజ్రాయెల్ జెండా నేలపై పెయింట్ చేయబడి ఉన్నట్లు కూడా స్పష్టంగా చూపించారు.
అమెరికా స్వరంలో..
ఇరాన్ తన స్పందన తెలిపి, వీడియో విడుదల తరువాత అగ్రరాజ్యం అమెరికా తన వైఖరిని తెలియజేసింది. ఇరాన్ అణు కార్యక్రమం చేపట్టడానికి, అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించదని స్పష్టం చేసింది. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా నేతృత్వంలో ఇరాన్ తో పీ5 ప్లస్ వన్ దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కానీ వీటిని తరువాత ట్రంప్ రద్దు చేశారు.
చర్చలు లేవు..
ఇరాన్ సుప్రీంనాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ వాషింగ్టన్ తో ప్రత్యక్ష చర్చలు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఇంతకుముందు ఫిబ్రవరిలో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపకూడదని అన్నారు. 2015 నాటి అమెరికా ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడాన్ని ఆయన విమర్శించారు.
ఇదే అంశంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాగర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ.. అమెరికా సైనిక చర్యకు దిగితే ఈ ప్రాంతంలో విస్తృతమైన ఘర్షణకు దారి తీస్తుందని హెచ్చరించారు. ‘‘ఇరాన్ సార్వభౌమత్వాన్ని నాశనం చేయలని చూస్తే.. అది గన్ పౌడర్ డిపోలో నిప్పురవ్వ వేయడం లాంటిది’’ అని ఖలీబా అన్నారు.


Tags:    

Similar News