కెనడా విదేశాంగ మంత్రిగా భారతీయ సంతతి మహిళ నియామకం
భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసిన అనితా ఆనంద్;
By : The Federal
Update: 2025-05-14 12:00 GMT
కెనడాలో తిరిగి అధికారంలోకి వచ్చిన మార్క్ కార్నీ నేతృత్వంలోని పార్టీ, మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరణ చేశారు. అందులో భాగంగా భారత సంతతి నాయకురాలు అనితా ఆనంద్ ను కొత్త విదేశాంగ మంత్రిగా నియమించారు.
న్యాయపండితురాలు, మాజీ జాతీయ రక్షణ మంత్రి అయిన అనితా ఆనంద్, కెనడియన్ చరిత్రలో ఈ పదవిని నిర్వహించిన మొదటి హిందువు అయ్యారు.
కెనడా లిబరల్ పార్టీకి చెందిన సీనియర్ సభ్యురాలు, భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఈ 58 ఏళ్ల నాయకురాలు దేశ రాజకీయ వికాసంలో కీలకమైన మైలురాయికి చేరుకున్నారు.
వ్యక్తిగత జీవితం..
1967 లో నోవా స్కోటియాలోని కెంట్ విల్లేలో జన్మించిన అనిత భారతీయ వలసదారుల కుమార్తె. ఆమె తల్లి పంజాబ్ కు చెందినది కాగా, తండ్రి తమిళనాడుకు చెందినవారు.
ఆమె భారతీయ సంతతికి చెందిన వైద్య తల్లిదండ్రులు నైజీరియా నుంచి నోవా స్కోటియాలోని కెంట్ విల్లేకు వెళ్లారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కెనడాలోని తెల్లజాతి వారు ఎక్కువగా నివసించే ప్రాంతంలో పెరిగినప్పటికీ, అనిత బలమైన సాంస్కృతిక, మతపరమైన సంబంధాలను నిలుపుకుంది. ఆమె శ్వేత జాతి వ్యక్తి జాన్ ను వివాహం చేసుకుంది. వీరికి నలుగురు సంతానం.
రాజకీయ ఎదుగుదల..
అనిత 1985 లో ఒంటారియోకు వెళ్లి అక్కడే క్వీన్స్ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ అధ్యయనాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ లాస్, టోరంటో విశ్వవిద్యాయలం నుంచి మాస్టర్ ఆఫ్ లా పట్టా పొందింది.
1994 నుంచి అంటారియో బార్ సభ్యురాలిగా ఉన్న ఆమె, 2019 లో లిబరల్ పార్టీ తరఫున ఓక్ విల్లే సీటును గెలుచుకున్నారు. అదే ఆమె రాజకీయ తొలి గెలుపు, తిరిగి 2021 లో ఎన్నికయ్యారు. చాలా త్వరగా క్యాబినేట్ ర్యాంకుకు ఎదిగారు.
సేవలు..
అనిత ఇటీవల సైన్స్, పరిశ్రమల మంత్రి, రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రి, ట్రెజరీ బోర్డు అధ్యక్షుడు, జాతీయ రక్షణ మంత్రి, ప్రజా సేవలు, సేకరణ మంత్రితో సహ అనేక ఉన్నత స్థాయి మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో కెనడియన్లకు వ్యాక్సిన్ లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, వేగవంతమైన పరీక్షలు పొందేందుకు ఒప్పందాలు చర్చించడంలో కీలక పాత్ర పోషించారు. రక్షణ మంత్రిగా సాయుధ దళాలలో సంస్కరణలకు ప్రయత్నించారు.
సాంస్కృతిక మూలాలు..
అనితా ఆనంద్ హిందూ విశ్వాసాలు ఆచరిస్తారని, ప్రజలకు తెలుసు. సంవత్సరాలుగా ఆమె తల్లిదండ్రుల తనలో నింపిన విలువలతో విద్య, సమగ్రత, ప్రజాసేవ పట్ల నిబద్దత చాటుకుంది.
2019 లో తొలిసారిగా మంత్రివర్గం నియామకం సమయంలో భగవద్గీత పై చేతిని ఉంచి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంవత్సరం మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓక్ విల్లేలోని స్థానిక వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించి, ఆమె వారసత్వంతో ఆమెకున్న శాశ్వత సంబంధాలను హైలైట్ చేయడంతో తన సాంస్కృతిక పునాది స్పష్టంగా చూపించుకున్నారు.
జాతి వైవిధ్యం..
కొత్త మంత్రివర్గంలో అనిత అస్థిర ప్రపంచ కాలంలో కెనడా విదేశాంగ విధానానికి బాధ్యత వహిస్తుంది. కొత్త ప్రారంభం కోరుతూ ప్రధానమంత్రి కార్నీ ఆమెకు ప్రభుత్వంలోని అత్యంత శక్తివంతమైన పాత్రలలో ఒక దాన్ని అప్పగించారు.
ప్రస్తుతం కెనడా మంత్రివర్గంలో 28 మంత్రులు, విదేశాంగ కార్యదర్శులు ఉణ్నారు. ఇందులో అనుభవం, లింగ సమానత్వం, జాతి వైవిధ్యాన్ని సమతుల్యం చేసుందుకు ప్రాధాన్యం ఇచ్చారు.
మంత్రివర్గంలో సగం మంది మహిళలు, అనితా ఆనంద్ వంటి వారిలో చాలామంది వలస నేపథ్యాల నుంచే ఉన్నారు.