మావోయిస్ట్‌లకు భారీ ఎదురుదెబ్బ.. ఇద్దరు కీలక నేతలు హతం..
ఛత్తీస్‌గడ్‌లో-ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్‌లు, పోలీసుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులో దాదాపు 20 మంది మరణించారు.;
ఛత్తీస్‌గడ్‌లో-ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్‌లు, పోలీసుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో భారీ సంఖ్యలో మావోలు మరణించారు. ఈ మేరకు విషయాలను పోలీసులు వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌లో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. జనవరి 19వ తేదీని చేపట్లు పలు ఎన్‌కౌంటర్లో మరణించిన మావోల మొత్తం సంఖ్య 20కి చేరిందని పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్‌లు తమ కీలక నేతలు పలువురిని కోల్పోయారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు సహా బోడెమ్ బాలకృష్ణ కూడా ఉన్నారు. అయితే వీరిలో చిత్తూరు జిల్లావాసి అయిన చలపతిపై గతంలో ప్రభుత్వం రూ.కోటి రూపాయల రివార్డు కూడా ప్రకటించింది.
దేశంలో మావోయిస్టుల ఏరివేతే ధ్యేయంగా సరిహద్దు ప్రాంతాలైన గరియాబంద్, నౌపాడలో స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నడిపిస్తున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో సోమవారం రాత్రి ఇద్దరు మరణించగా, మంగళవారం తెల్లవారుజామున జరిపిన గాలింపు చర్యల్లో మరో 12మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మధ్యాహ్నానికి మరో ఆరుగురి మృతదేహాలు దొరికాయి. దీంతో మరణించిన మావోయిస్టుల సంఖ్య 20కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో దాదాపు వెయ్యిమంది భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించారు.
అమిత్ షా ప్రశంసలు
పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ ఆపరేషన్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. నక్సలిజం చివరి దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోలీసులను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నక్సలిజానికి మరో గట్టి దెబ్బ. నక్సల్స్ రహిత భారత్ నిర్మాణంలో మన భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లను మట్టుబెట్టారు. నక్సల్స్ రహిత భారతదేశం కోసం మన సంకల్పం మరియు మన భద్రతా దళాల ఉమ్మడి ప్రయత్నాలతో, నక్సలిజం ఈ రోజు తుది శ్వాస విడిచింది’’ అని ఆయన రాసుకొచ్చారు.