నాలుగో దశ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాలివే.. తెలంగాణనే టాప్

నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు దేశంలో 10 రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. ఈ దశలో మొత్తం 96 పార్లమెంటు సీట్లకు ఎంతమంది పోటీ పడనున్నారంటే..

Update: 2024-05-04 05:00 GMT

దేశమంతటా ప్రజాస్వామ్య పండగ ‘ఎన్నికలు’ జోరుగా సాగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. ఇప్పటికే వీటిలో రెండు విడతల పోలింగ్ పూర్తి కాగా మే నెల ఏడో తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. అంటే మే 12న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. వీటిలో లోక్‌సభ స్థానాలకు అత్యధిక నామినేషన్లు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

మొత్తం 10 రాష్ట్రాలు

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో మొత్తం పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తలపడటానికి సిద్ధం అవుతున్నారు. కానీ ఈ 96 స్థానాలకు దాఖలైన నామినేషన్ల సంఖ్య 4264. నామినేషన్ల పరిశీలనలో భాగంగా 1970 నామినేషన్లను అధికారులు రద్దు చేశారు. వాటితో పాటుగా 577 నామినేషన్లు ఉపసంహరించుకోబడ్డాయి. అయితే ఈ నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల బరిలో ఆంధ్రప్రదేశ్ 25 స్థానాలు, బీహార్ 5, జమ్మూకశ్మీర్ 1, ఝార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 8, ఒడిశా 4, తెలంగాణ 17, ఉత్తర్‌ప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 8 స్థానాలకు ఓటింగ్ జరగనుంది.

తెలంగాణనే టాప్

నాలుగో దశ ఎన్నికలకు వెళ్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రకు అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలకు వెళ్తున్న తెలంగాణలో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని దశల్లో కూడా ఆంధ్ర కన్నా తెలంగాణ అధికంగా ఉంది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ తెలంగాణలో 1488 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన తర్వాత అవి 625కు చేరాయి.. ఉపసంహరణ తర్వాత చివరగా ఎన్నికల బరిలో తలపడునున్న అభ్యర్థుల నామినేషన్ల సంఖ్య 525గా ఉంది. ఆంధ్రలో మాత్రం 25 లోక్‌సభ స్థానాలకు 1103 నామినేషన్లు దాఖలు కాగా 503 నామినేషన్లు ఆమోదముద్ర పొందాయి ఉపసంహరణ అనంతరం 454 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిల్చున్నారు.

ఇదిలా ఉంటే అత్యల్ప నామినేషన్లు దాఖలైన రాష్ట్రం జమ్మూకశ్మీర్. ఒక్క ఒకేఒక్క లోక్‌సభ స్థానానికి ఎన్నికల జరుగుతుండగా ఆ స్థానానికి 39 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన అనంతరం 29 నామినేషన్లను అధికారులు ఆమోదం తెలిపారు. ఉపసంహరణ ప్రక్రియ అనంతరం మొత్తం 24 మంది ఈ ఒక్క లోక్‌సభ స్థానానికి పోటీ పడుతున్నారు.

Tags:    

Similar News