20 లక్షల ఎకరాల పంట నేలపాలు

మిగ్‌జామ్‌ తుపాను రైతుల కంట కన్నీరు పెట్టించింది. అపార నష్టాన్ని మిగిల్చింది.

Byline :  The Federal
Update: 2023-12-08 03:49 GMT
నేలపాలైన చేతికొచ్చిన వరి పంట

మిగ్‌జామ్‌ తుపాను రైతుల కంట కన్నీరు పెట్టించింది. అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంట నేలపాలైంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా రైతులు అల్లాడిపోతున్నాయి. రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తుపాను తీరం దాటి మూడు రోజులవుతున్నా వరద తగ్గలేదు. పొలాల్లో నీరు బయటకు పోలేదు. వరి, మిరప, శనగ, కంది, మినుము, పొగాకు తదితర పైర్లు నీటిలో నానుతున్నాయి. ధాన్యంలో మొలకలు వస్తున్నాయి. సుమారు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఉంటుందని అంచనా.

అచ్చంగా వరే 12 లక్షల ఎకరాలు
ఇందులో వరి సుమారు 12 లక్షల ఎకరాలు, మిరప 2.5 లక్షల ఎకరాలు, శనగ, కంది, మినుము 5.50 లక్షల ఎకరాల వరకు ఉంటాయి. ఎకరాకు సగటున రూ. 20 వేల లెక్కన చూసినా.. పంటనష్టం రూ. 4 వేల కోట్ల పైనే ఉంటుంది. పండ్లు, పూలతోటలు సుమారు 2.50 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని అంచనా. అరటి, బొప్పాయి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టం రూ. 1,250 కోట్ల వరకు ఉంటుంది. తడిసిన ధాన్యంతో నష్టపోయిన మొత్తాన్ని కూడా కలిపితే.. ఇది రూ. 7 వేల కోట్లకు పైగా చేరుతుందని అంచనా. పంటలు దెబ్బతిన్న వారిలో 80% మంది రైతులకు పెట్టుబడిలో పైసా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు.
అన్ని జిల్లాల్లో నష్టమే...
కోత కోయించడం కంటే ట్రాక్టర్లతో దమ్ము తొక్కించేయడమే మేలని వరి రైతులు ఆలోచిస్తున్నారంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. తుపాను హెచ్చరికలు మొదలైన నాటి నుంచి.. 8 జిల్లాల్లోనే ప్రభావమంటూ.. వాటిపైనే దృష్టి పెట్టింది. మిగిలిన జిల్లాల్లోనూ పంట నష్టం తీవ్రంగా ఉందని.. అక్కడి రైతులు కుదేలయ్యారని గుర్తించడం లేదు. తుపాను తీరం దాటే ముందురోజు కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. 8 జిల్లాల కలెక్టర్లు, అధికారులతోనే సమీక్షించారు. ప్రత్యేకాధికారులను కూడా ఈ జిల్లాలకే నియమించారు.
మెట్టపొలాలోనూ ఇదే తీరు
మెట్ట పొలాల్లోనూ ఇంకా నీరు నిలిచే ఉంది. ఇప్పటికే చాలాచోట్ల వరిలో మొలకలు వస్తున్నాయి. కోత కోసినా ప్రయోజనం ఉండదు. మిరప అయితే మొక్కలు తలలు వాల్చేశాయి. దాదాపు ఆశలు వదులుకోవడమే. జెమిని వైరస్‌ కారణంగా ఒకటికి రెండుసార్లు నారు తెచ్చి నాటిన రైతులు.. తెగుళ్ల నివారణకు ఎంతో ఖర్చు పెట్టారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు పంటకూ తీరని నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల నేల కరిచాయి. కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో శనగ, కంది, మినుము పంటలు నీటిలోనే తేలుతున్నాయి. పొలం నుంచి నీటిని బయటకు పంపేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈలోగా పైరు మొత్తం దెబ్బతింటోంది.


Tags:    

Similar News