మన్మోహన్ సింగ్ @ 92.. ప్రధానిగా పదేళ్లు, రాజ్యసభలో 33 సంవత్సరాలు
‘చరిత్ర దయతో తనను అంచనా వేస్తుందన్న విశ్వాసమే’ డాక్టర్ సాబ్‌కు బలం
(నాంచారయ్య మెరుగుమాల)
భారతదేశంలో ఇంకా జీవించి ఉన్న ఇద్దరు మాజీ ప్రధానమంత్రుల్లో వయసులో, ఇంకా అనేక విషయాల్లో పెద్ద, గొప్పవారని దేశ ప్రజలు గౌరవించే నేత డాక్టర్ మన్మోహన్‌సింగ్. (మరో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ 1933 మే 18న జన్మించారు) 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగమైన పంజాబ్ ప్రావిన్స్‌లో పుట్టారు డాక్టర్ సింగ్. కాంగ్రెస్ ప్రధానమంత్రుల్లో పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత వరుసగా పది సంవత్సరాలు పదవిలో కొనసాగిన మూడో నాయకుడు ఆయన. సిక్కు మత పదో, చివరి మానవ గురువు గురు గోబింద్‌సింగ్ ఆదేశానుశారం పేరు చివర సింగ్ మాత్రమే ఉండాలన్న నియమాన్ని, సిక్కు ధర్మంలోకి రాక ముందు ఉన్న హిందువుల ఇంటి పేర్లు వారి కులాలు, ప్రాంతాలను సూచించేలా ఉంటాయి.
కాబట్టి సింగ్‌తోనే పేరు ముగియాలనే సూత్రాన్ని మన్మోహన్ పాటించారు. ఆయన సోదరులు తమ ఇంటిపేరు లేదా కుటుంబ నామం ‘కోహ్లీ’ని తమ పేర్ల చివర పెట్టుకున్నాగాని డాక్టర్ సాబ్ ఆ పనిచేయలేదు. ముగ్గురు ఆడపిల్లల తండ్రి అయిన మన్మోహన్ జీ అల్లుళ్లలో ఇద్దరు హిందువులు, ఒకరు అమెరికాకు చెందిన శ్వేత జాతి క్రైస్తవుడు. కోహ్లీ అనే ఇంటి పేరు ఉన్నవారు ఖత్రీలు (క్షత్రియులు) అనే విషయం సూచిస్తుంది. భారత్, పాకిస్తాన్‌లోని పంజాబీల్లో ముస్లింలు కొందరు, హిందువులు దాదాపు అందరు, సిక్కులు కొందరు కోహ్లీ అనే ఇంటిపేరుతో నమోదయి ఉంటున్నారు.
సోషలిస్టు భావాలున్న ప్రముఖ పంజాబీ నేత, ఉమ్మడి ఏపీ గవర్నర్, మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ అధికార రికార్డుల్లో తన పేరును కె.కృష్ణకాంత్‌గా నమోదు చేయించుకున్నారు. ఆయన కుటుంబనామం కూడా కోహ్లీయే. ఈ మధ్య పాకిస్తాన్ పంజాబ్‌లో ఇస్లాం తీసుకోవడానికి ముందున్న హిందూ ఇంటిపేరును తమ పేరు చివర పెట్టుకోవడం ముస్లింలకు ఫ్యాషన్‌గా లేదా ఆనవాయితీగా మారిపోయింది. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీప్ ఖమర్ జావేద్ బాజ్వా ఇంటిపేరు బాజ్వా ఇప్పుడు మూడు మతాల (హిందూ, ముస్లిం, సిక్కు పంజాబీల్లో) పంజాబీల్లో కనిపిస్తుంది.
యాక్సిడెంటల్ కాదు వాంఛనీయ ప్రధాని మన్మోహన్ సింగ్
మళ్లీ భారత జాతీయ కాంగ్రెస్ చివరి ప్రధాని లేదా బతికి ఉన్న చివరి మాజీ ప్రధాని డా.మన్మోహన్ జీ విషయానికి వస్తే ...ఆర్థిక మంత్రిగా ఐదేళ్లు, ప్రధానిగా పదేళ్లు ఏకబిగిన పదవీబాధ్యతలు నిర్వర్తించిన ఈ ఆర్థికవేత్త వరుసగా 27 సంవత్సరాల తొమిదిన్నర నెలలు (1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకూ) అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసేనాటికి అస్సాం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం బాగా తగ్గిపోయిన కారణంగా రెండు నెలల విరామం తర్వాత మన్మోహన్ సింగ్‌ను పార్టీ నాయకురాలు సోనియాగాంధీ రాజస్తాన్ నుంచి 2019 అక్టోబర్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యేలా చేశారు.
అలా ఆయన 2024 ఏప్రిల్ 3 వరకూ భారత పార్లమెంటు ఎగువసభలో తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కొనసాగించారు. 33 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఆయనది వినూత్న రికార్డు. మన్మోహన్ హయాంలో నాలుగేళ్లు (2004 మే నుంచి 2008 ఆగస్ట్) ప్రధానమంత్రి మీడియా సలహాదారుగా పనిచేసిన ఆర్థికవేత్త సంజయ్ బారు ( తెలుగు ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ కొడుకు) 2014 పార్లమెంటు ఎన్నికల ముందు ఏదో కొత్త విషయం కనుగొన్నట్టు డాక్టర్ సింగ్‌పై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ అనే వివాదాస్పద పుస్తకం రాశారు.
డాక్టర్ సింగ్ ప్రధాని పీఠంపై ఉండగా పెత్తనమంతా సోనియాగాంధీదేనని, ఆమెకు లొంగి, అణగిమణిగి మన్మోహన్ పనిచేశారని సంజయ్ బారు ఈ గ్రంథంలో రాశారు. అయితే, అంతకు ముందు తనకు అత్యంత ఇష్టుడు, తోటి ఆర్థికవేత్త అయిన తెలుగు బ్రాహ్మణ మేధావి సంజయ్ బారు అలా రాయడాన్ని మన్మోహన్ నొచ్చుకోవడంతోపాటు అందులోని అంశాలను ఖండించారు. ఆయన ప్రధానిగా ఉండగా ఈ పుస్తకం విడుదల కావడంతో ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ పుస్తకంలోని విషయాలు సత్యదూరమని వివరణ ఇచ్చింది.
ఆర్థిక విధానాలు, ఇతర కీలక విధానాల విషయంలో కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలిదే చివరి మాటే అవుతుందన్న ముందస్తు అంచనా నిజమని తేలింది. డాక్టర్ సింగ్ ప్రధానిగా ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచే కేబినెట్ ఏర్పాటు నుంచి అన్ని నియామకాల విషయంలో సోనియా మాట ప్రకారమే అంతా జరిగిందని వేరే చెప్పాల్సిన పనిలేదు. సక్రమ మార్గంలో నడవని అశ్వనీకుమార్, పవన్‌కుమార్ బన్సల్ వంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన కేబినెట్ మంత్రులను తనకు ఇష్టం లేకున్నా డాక్టర్ సింగ్ వారితో రాజీనామా చేయించారు. అశ్వనీకుమార్, కపిల్ సిబ్బల్ వంటి పంజాబీ నేపథ్యం ఉన్న నేతలంటే ఆయనకు కాస్త ‘మెత్తని దృష్టి’ ఉందనే విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు.
యూపీఏ కేబినెట్ జారీ చేయించిన ఆర్డినెన్స్ కాపీని రాహుల్‌గాంధీ చింపిపారేసినా...
యూపీఏ–1 పాలనా కాలంలో సమర్ధ రైల్వేమంత్రిగా పేరు తెచ్చుకున్న బిహార్ బడా నేత, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్లమెంటు సభ్యత్వం కాపాడే లక్ష్యంతోనే నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో 2013 సెప్టెంబర్‌లో జారీ చేయించారనే ప్రచారం జరిగిన ఆర్డినెన్స్ మన్మోహన్ చివరి హయాంలో పెద్ద దుమారం సృష్టించింది. చట్టసభల సభ్యులైన రాజకీయనాయకులు క్రిమినల్ కేసుల్లో ట్రయల్ కోర్టులో దోషులుగా (రెండేళ్లకు పైగా జైలు శిక్షతో) తేలిన వెంటనే వారి సభ్యత్వం దానంతట అదే రద్దవకుండా నివారించే ఆర్డినెన్స్ ఇది. అది అప్పటికి పార్లమెంటు ఆమోదం పొందలేదు. దేశవ్యాప్తంగా దీనిపై విమర్శలు వెల్లువెత్తగా రాహుల్ గాందీ చాలా తెలివిగా వ్యవహరించిన తీరు మన్మోహన్ మనస్సును చివుక్కుమనేలా చేసింది.
విమర్శలను తిప్పికొట్టి ఈ ఆర్డినెన్స్‌ను సమర్ధిస్తూ వివరణ ఇవ్వడానికి కొత్తగా అప్పుడే నియమితుడైన కాంగ్రెస్ ముఖ్య మీడియా మేనేజర్ అజయ్ మాకెన్ ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా రాహుల్ హఠాత్తుగా అక్కడికి ఒక రోజున ఊడిపడ్డారు. అజయ్ ప్రసంగాన్ని అర్ధంతరంగా ఆపించి, ఆర్డినెన్స్ కాపీని రాహుల్ ముక్కలుముక్కలుగా చింపి కిందపడేశారు. ఒక్క ఉదుటున పార్టీ వైఖరిని తలకిందులుగా మార్చి, చింపి పారేయాల్సిన ఆర్డినెన్స్ ఇది అంటూ సమావేశం ముగించారు. ఈ ఘటన జరిగినప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని సింగ్‌కు అక్కడి మీడియా ముందు ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది.
తన సర్కారు జారీచేయించి, సమర్ధించిన ఈ ఆర్డినెన్స్ ప్రతిని తన పార్టీ అగ్రనేత రాహుల్ చింపివేయడం ప్రధానికి దిగ్భ్రాంతి కలిగించింది. ఒక దశలో అక్కడి నుంచే మన్మోహన్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపుదామనుకున్నారనే రీతిలో వదంతులు వ్యాపించాయి. అయితే, సోనియా తన సొంత కారణాలతో 2004 మే నెలలో ప్రధాని పదవి వద్దనుకున్నప్పుడు తనను నమ్మి ఆ పదవి ఇవ్వడమేగాక అందులో పదేళ్లు కొనసాగడానికి అనుమతించిన కారణంగా నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఇరుకున పడేయకూడదనే మన్మోహన్‌లోని కృతజ్ఞతాభావమే ఆ పనిచేయకుండా నివారించింది.
అలాగే, పది సంవత్సరాల పాలనలో అంచనాకు మించిన అవినీతి కుంభకోణాలు, ఆరోపణలు వెలుగు చూడడంతో (అవన్నీ తర్వాత కోర్టుల్లో రుజువుకాకపోవడం వేరే విషయం) ‘దోపిడీ దొంగలకు అత్యంత నిజాయితీపరుడైన నాయకుడు డా.సింగ్’ అనే ఎత్తిపొడుపు ప్రచారం జరిగినా ఆయన తట్టుకుని నిలబడ్డారు. చివరికి, ప్రధానమంత్రిగా తన పదవీకాలంలో జరిగిన పరిణామాలను, తన పాత్రను భవిష్యత్తులో ‘ చరిత్ర సక్రమంగా, దయతో అంచనావేసి, తీర్పు ఇస్తుందని (హిస్టరీ విల్ బీ కైండ్ టూ మీ)’ అని మన్మోహన్ సింగ్ ఎంతో బాధతో, ఆత్మవిశ్వాసంతో ప్రకటించాల్సి వచ్చింది.
2016 నవంబర్‌లో బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయం, అమలు చేసిన తీరు ప్రఖ్యాత ఆర్థికవేత్త కూడా అయిన డా.సింగ్‌ను కలచివేసింది. రాజ్యసభలో నోట్ల రద్దు నిర్ణయంపై చర్చజరుగుతున్నప్పుడు దాన్ని చీల్చిచెండాడుతూ మాజీ ప్రధాని చేసిన ప్రసంగంలోని కొన్ని వాక్యాలు ఇప్పటికీ దేశ ప్రజలకు గుర్తున్నాయి. నోట్ల రద్దు పల్ల ప్రజలంతా తీవ్ర ఇక్కట్ల పాలవుతారని చెబుతూ, ‘‘ దీర్ఘకాలంలో పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) రద్దు నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని చెబుతున్నవారందరూ, ‘దీర్ఘకాలంలో మనమంతా మరణిస్తాం’ అనే వాస్తవాన్ని ఎప్పుడో చెప్పిన సూక్తిని గుర్తుచేసుకోవాలి,’’ అని మన్మోహన్ సింగ్ గట్టిగా వాదించారు.
అలాగే తాను రాజ్యసభలో మాజీ ప్రధాని హోదాలో సభ్యుడిగా ఉన్న రోజుల్లో ప్రధాని నరేంద్రమోదీ ఆయనను అవినీతి విషయంలో ఉదాసీన వైఖరి అవలంబించిన ప్రధానిగా చూపించడానికి ప్రయత్నిస్తూ, ‘‘ బాత్‌రూములో రెయిన్ కోట్ ధరించి స్నానం ఎలా చేయాలో డాక్టర్ సాబ్ (డాక్టర్ మన్మోహన్ సింగ్ అనే అర్ధంతో) నుంచి మనం నేర్చుకావాలి,’’ అన్న మోదీ మాటలు సభలో, దేశంలో హాస్యాన్ని పండించినాగాని మన్మోహన్ సింగ్‌ను మాత్రం అంతగా కదిలించలేకపోయాయి. ఇండియా వంటి పెద్ద దేశంలో ప్రధానులు, ముఖ్యమంత్రులు తమ మంత్రివర్గ సహచరుల అవినీతి గురించి తెలిసి కూడా కొన్ని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో కొంత కాలం దాన్ని సహించడం అనేది అన్ని పార్టీలకు అలవాటేననే స్పృహ డాక్టర్ సింగ్‌కు ఉంది.
స్వయంగా సత్పురుషుడు, నిజాయితీపరుడు అయిన మన్మోహన్ సింగ్ తాను పదవిలో ఉండగా, తర్వాత అధికారం కోల్పోయాక కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కాని, అదే సమయంలో ఆయన ఇతర పార్టీల నాయకుల నుంచి పొందిన గౌరవ మర్యాదలు ఏ కాంగ్రెస్ మాజీ ప్రధానికి లభించలేదనేది వాస్తవం. 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిరాగాంధీని ఇద్దరు సిక్కులు కాల్చిచంపారనే సాకుతో సిక్కులపై రాజధాని ఢిల్లీలో దాడులు, ఊచకోత సాగిన సమయంలో నగరంలోనే ఉన్న మన్మోహన్ సింగ్ తన కుమార్తె ఇంట్లో తలదాచుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయాన్ని ఏనాడూ ఎక్కడా చెప్పకపోవడం మాజీ ప్రధాని మనోబలానికి, సచ్ఛీలతకూ అద్దంపడుతోంది. ప్రతి విషయాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునే బడాబడా రాజకీయనేతలున్న దేశంలో మన్మోహన్ సింగ్ వంటి నేత మళ్లీ కనిపిస్తారా? అంటే అనుమానమే. తొలి కాంగ్రెసేత భారత ప్రధానిగా చరిత్రకెక్కిన మొదటి గుజరాతీ ప్రధాని మొరార్జీ దేశాయి నూరేళ్లు నిండడానికి దాదాపు పది మాసాల ముందు కన్నుమూశారు. డాక్టర్ సింగ్ మరో 8 ఏళ్లలో మొరార్జీ రికార్డును బ్రేక్ చేసి వందో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుందాం.