కర్ణాటకలో అబార్షన్ రాకెట్..
కర్ణాటకలో భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయా? అధికారిక లెక్కలు ఏం చెబుతున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి ఏమంటున్నారు?
కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో ఇటీవల ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు పాండవపుర ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు కావడం ఆశ్చర్యకరం. పాండవపుర నివాసితులు తమ ప్రాంతంలోని ఆరోగ్యశాఖ అతిథి గృహం వద్ద ఓ గర్భిణి వేచి ఉండడాన్నిగమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమయిన పోలీసులు మే 5వ తేదీన అతిథి గృహంపై దాడి చేశారు. అబార్షన్ చేయడానికి వినియోగించే మందులు, సిరంజిలు, ఇతర వస్తువులు వారి కంటపడ్డాయి.
ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిన ఓ మహిళ.. తన మూడో సంతానం కూడా ఆడపిల్లేనని తెలియడంతో పిండాన్ని తొలగించేందుకు ఆరోగ్య శాఖ అతిథి గృహానికి వచ్చిందని పోలీసులు విచారణలో తేలింది.
గర్భిణికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన తర్వాత, పాండవపుర తాలూకా ఆసుపత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో పాటు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.
“ఈ ప్రాంతంలో భ్రూణహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. వాటిని ప్రోత్సహించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.’' అని మాండ్య సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ యతీష్ మీడియాకు తెలిపారు.
కఠిన శిక్షలతోనే..
ఆడపిల్లల భ్రూణహత్యల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తున్నా అక్కడక్కడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని
మాండ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్.చలువరాయస్వామి అంగీకరించారు. పూర్తిగా అరికట్టడానికి కఠిన శిక్షలు, చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన ఫెడరల్‌తో అన్నారు.
లింగ నిర్దారణ చట్టవిరుద్ధం. మగ పిల్లవాడి కోసం అబార్షన్లు కొనసాగుతున్నాయి. 2000-2019 మధ్య కాలంలో దేశంలో దాదాపు తొమ్మిది మిలియన్ల మంది గర్భిణులు చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
పిల్లల లింగ నిష్పత్తిలో తగ్గుదల..
గుజరాత్, రాజస్థాన్, బీహార్, పంజాబ్‌లో లాగా కర్ణాటకలోనూ ఆడపిల్లల భ్రూణహత్యలు జరుగుతుండడంపై రచయిత-జర్నలిస్ట్ మంజునాథ అడ్డే ఆందోళన వ్యక్తం చేశారు. మాండ్య జిల్లాలో పాండవపుర, మద్దూరు, మాండ్య, శ్రీరంగపట్నం, నాగమంగళ, మలవల్లి, KR పేట్ తాలూకాలు భ్రూణహత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
అధికారిక సమాచారం ప్రకారం.. కర్ణాటకలో పిల్లల లింగ నిష్పత్తి 2021లో 947 కాగా 2022లో 929కి క్షీణించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ నిష్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో 950, పట్టణ ప్రాంతాల్లో 946గా నమోదైంది.
కర్ణాటకలోని 31 జిల్లాల్లో 22 జిల్లాల్లో లింగ నిష్పత్తి తగ్గుముఖం పట్టింది. నవంబర్ 2023లో భ్రూణహత్యల రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఇద్దరు వైద్యులతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు ఈ ముఠా కేవలం మూడు నెలల్లో 242 అబార్షన్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. గర్భస్రావం అనంతరం ఆడ పిండాన్ని కవర్‌లో చుట్టి బెంగళూరు శివార్లలోని డస్ట్‌బిన్‌లో పడేయడంతో ఓ ఆసుపత్రి యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. లోతుగా విచారిస్తే
ఆ ఆసుపత్రిలో రెండు సంవత్సరాలుగా లింగ నిర్ధారణ పరీక్షలు, చట్టవిరుద్ధమైన అబార్షన్లు జరుగుతున్నాయని తెలిసింది. అబార్షన్ చేయించుకుంటున్న వారిలో ఎక్కువ మంది టీనేజర్లు, పెళ్లికి ముందే గర్భం దాల్చిన కాలేజీ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు.
గతంలోనూ బెంగళూరులో భ్రూణహత్యల రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, ఏజెంట్లతో సహా 13 మందిని అరెస్టు చేశారు. ఆడపిల్లల భ్రూణహత్యల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం.. ఆడపిల్లల భ్రూణహత్యలకు సంబంధించిన కేసుల దర్యాప్తును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కి అప్పగించింది.
మైసూరు, మాండ్య, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఆడ భ్రూణహత్యల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముగ్గురు వైద్యులు సహా 19 మంది అనుమానితుల పేర్లతో సీఐడీ నివేదిక దాఖలు చేసింది. దాడుల సమయంలో ఆసుపత్రులు, వైద్య కేంద్రాల నుండి పోర్టబుల్ స్కానింగ్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలోని గ్రామాల్లో లింగనిర్ధారణ గురించి కొందరు అనుమానితులు దొంగచాటుగా వ్యవహరించి ప్రచారం చేసినట్లు గుర్తించారు.
కర్నాటకలో ఆడ భ్రూణహత్యల నిరోధానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు అమలు కావడం లేదని, కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు అభిప్రాయపడ్డారు.