రెండు దశాబ్ధాల తరువాత ట్రిపుల్ మర్డర్ కేసును చేధించిన సీబీఐ
17 రోజుల కవల పిల్లలు, తల్లిని హత్య చేసిన నిందితులు;
By : The Federal
Update: 2025-01-05 05:32 GMT
కేరళలోని కొల్లాం జిల్లాలలో ఒక మహిళ ఆమె ఇద్దరు కవల ఆడ పిల్లలను(17 రోజుల వయస్సు) చంపిన కేసును 19 సంవత్సరాల తరువాత సీబీఐ ఛేదించింది. ఇద్దరు నిందితులు సైన్యంలో పని చేశారని, హత్య తరువాత పారిపోయారని తెలిసింది.
ఈ నెల 3న సీబీఐకి అందిన సమాచారం ప్రకారం పుదుచ్చేరికి వచ్చి ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారు హత్య తరువాత నకిలీ గుర్తింపు కార్డులతో జీవిస్తున్నారు. ఇద్దరు టీచర్లను వివాహం చేసుకున్నారు. పిల్లలు, భార్యతో కొత్త జీవితాలను ప్రారంభించారు.
ఈ ఇద్దరి వ్యక్తుల పేర్లు దివిల్ కుమార్, రాజేశ్ పి, వీరు కొల్లాంలోని ఆంచల్ కు చెందిన వారు. వీరిని అదుపులోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ కొచ్చిలోని కోర్టులో హజరు పరచి పోలీస్ కస్టడీకి తరలించింది. సీబీఐ వీరిని విచారించే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
క్రూరమైన హత్యలు..
కవల పిల్లలు, ఆమె తల్లిని అత్యంత క్రూరంగా ఫిబ్రవరి 10, 2006 న నిందితులు హత్య చేశారు. బాధితురాలి పేరు రంజిని(24), ఆమెకు కొన్ని రోజుల క్రితమే ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. వారు అంచల్ సమీపంలో గల యోరం వద్ద అద్దె ఇంట్లో ఉండేవారు.
అక్కడే వారిని ఇద్దరు హత్య చేశారు. కవలల జనన ధృవీకరణ పత్రం కోసం రంజిని తల్లి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి వారు విగతజీవులుగా మారారు. తరువాత దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఆధారాలు లభించకపోవడంతో కేసు సీబీఐకి బదిలీ చేశారు.
ప్రేమ పేరుతో వంచన...
బాధితురాలు రంజినిని ప్రేమ పేరుతో సైన్యంలో పని చేస్తున్న దివిల్ కుమార్ వంచించి శారీరకంగా వాడుకున్నాడు. దానితో రంజిని గర్భం దాల్చి జనవరి 24, 2006న ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే అప్పటికే దివిల్ కుమార్ బాధితురాలిని పట్టించుకోకుండా దూరం జరగడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
తనను పెళ్లి చేసుకోకుండా, కూతుళ్లను పట్టించుకోకుండా, తనకు పుట్టలేదని వాదిస్తుండటంతో బాధితురాలు మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. కమిషన్ పితృత్వ పరీక్షలను ఆదేశించడంతో నిజం బయట పడుతుందనే భయంతో వారిని హత్య చేయడానికి పథకం పన్నాడు.
ఆ సమయంలో దివిల్ కుమార్ పంజాబ్ లోని పఠాన్ కోట్ లోని ఇండియన్ ఆర్మీ 45 ఏడీ రెజిమెంట్ లో పని చేస్తున్నాడు. తన హత్యల కోసం తన స్నేహితుడు రాజేశ్ సాయం తీసుకున్నాడు. అతను అదే రెజిమెంట్ లో పని చేస్తున్నాడు. ఇద్దరు స్నేహితులు పథకం ప్రకారం రంజిని తల్లిని నమ్మించారు.
రంజినిని దివి కుమార్ పెళ్లి చేసుకునేలా చేస్తానని మాటలు చెప్పి ఇంటిలో బాధితురాలు ఒంటరిగా ఉండే సమయం కోసం ఎదురు చూశాడు. ఓ రోజు జనన ధృవీకరణ కోసం బాధితురాలి తల్లి బయటకు వెళ్లగానే ఆమె, ఇద్దరు కవల ఆడ పిల్లలను హత్య చేశాడు.
సైన్యం నుంచి పారిపోయారు..
హత్య జరిగిన వెంటనే ఇద్దరు నిందితులు పారిపోయారు. వీరిని సైన్యం కూడా అధికారికంగా మార్చి 2006 లో పారిపోయిన వ్యక్తులుగా ప్రకటించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యలో ఇద్దరి వ్యక్తుల ప్రమేయం ఉందని తెలుసుకుని వారి కోసం విస్తృతంగా గాలించారు.
నిందితుల జాడ తెలిపితే రూ. 2 లక్షల రివార్డును సైతం ప్రకటించింది. అయితే వీరి జాడ తరువాత దొరకలేదు. చివరగా బాధితులు కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో 2010 లో కేసు సీబీఐకి బదిలీ చేశారు. అయితే ఏళ్లు గడిచిన వారిని దర్యాప్తు సంస్థ పట్టుకోలేకపోయింది.
కొత్త పేర్లు.. కొత్త జీవితాలు..
హత్యల అనంతరం దివిల్,రాజేష్ ఇద్దరు పుదుచ్చేరి పారిపోయారు. అక్కడ దివిల్ తన పేరును విష్ణు గాను, రాజేశ్ .. ప్రవీణ్ కుమార్ గా మార్చుకున్నారు. అక్కడే ఆస్తులను కొనుగోలు చేశారు. స్థానికంగా పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను పెళ్లి చేసుకుని ఇద్దరేసి పిల్లలకు తండ్రులయ్యారు.
ప్రశాంతమైన పట్టణంలో కొత్త జీవితాలను ప్రారంభించారు. వారి నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులను సైతం పొందారని ఇటీవల సీబీఐకి పక్కా సమాచారం అందింది. వారి పై పూర్తి స్థాయిలో నిఘా వేసి, ధృవీకరణ తరువాత సీబీఐ వారిని శుక్రవారం అరెస్ట్ చేసింది.
ఈ రెండు హత్యలను దివిల్ కుమార్, రాజేశ్ చేసినట్లు సీబీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు 2006 నుంచి పరారీలో ఉన్నారని వెల్లడించింది. తాము చార్జీషీటు దాఖలు చేశామని, వీరిద్దరిని నేరస్థులుగా కోర్టు ప్రకటించిందని సీబీఐ పేర్కొంది.