కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన యూఎన్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ప్రీజ్ చేయడం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారాయి.

Update: 2024-03-29 08:11 GMT
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ స్పందించారు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను ప్రీజ్ చేయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్‌ అరెస్టుపై ఇప్పటికే జర్మనీ, అమెరికా సైతం స్పందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారాన్నీ అమెరికా ప్రస్తావించింది. దీనిపై భారత్‌ తన వైఖరిని స్పష్టం చేసింది. ఇవి పూర్తిగా దేశ అంతర్గత విషయాలని.. ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని దీటుగానే బదులిచ్చింది. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని ఏమాత్రం ఆమోదించబోమని తేల్చి చెప్పింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇక్కడి చట్టాల ప్రకారమే నడుచుకుంటాయని పేర్కొంటూ అమెరికా దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది.
కేజ్రీవాల్ అరెస్టుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమెరికా దౌత్యవేత్తను భారత్ పిలిపించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) అధికారులు తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను భారత రాజధానిలోని సౌత్ బ్లాక్‌లోని తమ కార్యాలయానికి పిలిపించారు. దాదాపు 30 నిమిషాలకు పైగా సమావేశం కొనసాగింది. కాగా అమెరికా దౌత్యవేత్తను ఢిల్లీలో పిలిపించడంపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ. “నేను ఎలాంటి ప్రైవేట్ దౌత్య సంభాషణల గురించి మాట్లాడబోవడం లేదు. అయితే మేం పబ్లిక్ గా చెప్పినది నేను ఇక్కడ నుండి చెప్పాను. మేం న్యాయమైన, పారదర్శకమైన, సమయానుకూలమైన చట్టపరమైన ప్రక్రియలను ప్రోత్సహిస్తాం. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పకూడదని మేం భావిస్తున్నాం.’’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు చట్టానికి లోబడే నడుచుకుంటాయని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
Tags:    

Similar News