ఆంధ్రా క్రికెట్: ఆడేవాళ్లది కాదు, ఆడించే వాళ్లదే ఆట

ఆంధ్ర క్రికెట్ లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందా? మాజీ కెప్టెన్ హనుమ విహారి తప్పేది లేకున్నా వేధించారా? దీనిపై మాజీ సీఎం చంద్రబాబు ఏమంటున్నారు..

Update: 2024-02-27 09:33 GMT
హనుమ విహారి, క్రికెటర్

ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారులు అధికార వైసీపీ రాజకీయ నాయకుల చేతిలో నలిగి పోతున్నాయని, మేము క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా కూడా ఏపీలోకి క్రీడాకారులపై వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఘూటుగా స్పందించారు.

ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేసిన అధికార పార్టీ నాయకులు, క్రీడలపై కూడా వారి అధికార దర్పాన్ని చూపుతున్నారని, రాష్ట్ర ప్రతిష్టను అన్ని రకాలుగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒక్కసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం వేడెక్కడానికి కారణం ఏంటీ.. హనుమ విహారి చేసిన పోస్ట్ లో ఏ విషయాలు ఉన్నాయి..

Full View


టీమిండియా తరఫున పలు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన హనుమ విహారి, నిన్న సాయంత్రం ఆంధ్రా క్రికెట్ జట్టులో జరగుతున్న పలు విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. తనను అవమానకరంగా జట్టు కెప్టెన్ గా తొలగించారని, ఇక జన్మలో ఆంధ్రా జట్టు తరఫున ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు ఆడనని అందులో వివరించారు. జట్టులో రాజకీయ నాయకుల ఆధిపత్యం ఎక్కువైందని, అందుకే తాను వెళ్లిపోతున్నానని పోస్ట్ లో పేర్కొన్నాడు.

అసలేం జరిగింది..
ఈ సీజన్ తొలి మ్యాచ్ లో ఆంధ్రా జట్టు, బెంగాల్ తో ఆడింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన టీం మీటింగ్ లో 17 వ ఆటగాడు అయిన పృథ్వీరాజ్ అనే చిత్తూరుకు చెందిన క్రికెటర్ ను కెప్టెన్ అయిన విహారి దూషించాడని తెలిసింది. అయితే సదరు ఆటగాడు తిరుపతికి చెందిన ఓ కౌన్సిలర్ కుమారుడు కావడం, ఆయనకు మరో రాజకీయ నేతకు దగ్గరి సంబంధం ఉండడంతో అదికాస్త ఆ రాష్ట్ర పెద్ద నాయకుడికి చేరిందని, ఆ తరువాత వెంటనే హనుమ విహారిని జట్టు కెప్టెన్ గా తప్పించారని అందుతున్న సమాచారం.
అయితే సాధారణంగా టీమ్ సమావేశంలో యంగ్ క్రికెటర్లపై అప్పుడప్పుడు సీనియర్ క్రికెటర్లు ఇలా మందలిస్తుంటారని, క్రికెట్ లో అనుభవం ఉన్నవారు అంటున్నారు. అయితే ఇది నాలుగు గోడల మధ్యే ఉండిపోతుందని, ఎవరు బయటకు చెప్పరని వివరిస్తున్నారు. క్వార్టర్ ఫైనల్ లో మధ్య ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆంధ్ర జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఈ సీజన్ ముగిసింది. కావునా హనుమ విహారి తనకు జరిగిన సంఘటనలను సామాజిక మాధ్యమంలో పంచుకున్నాడని అంటున్నారు.
ఈ వివాదంపై ఆంధ్ర క్రికెటర్, ఎవరైతే వివాదానికి కేంద్ర బిందువుగా మారారో.. పృథ్వీరాజ్ కూడా సామాజిక మాధ్యమంలో స్పందించాడు. ఆ రోజు జరిగిన వివాదంలో తన తప్పు లేకున్నా చాలా నీచమైన బాషలో కెప్టెన్ నిందించాడని, ఇప్పుడు సానుభూతి కోసం విహారి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. దీనిపై విచారణ జరుగుతోందని కూడా చెప్పుకొచ్చాడు. ఇదే సంఘటనపై కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. జట్టులో గ్రూపులు ఉన్నాయని, జరుగుతున్న వివాదంపై విచారణ చేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు మీడియా మేనేజర్ డి గోపాల్ పేరిట ఓ లేఖ విడుదల చేశారు. 
సీనియర్ సెలక్షన కమిటి నుంచి వచ్చిన సమాచారం మేరకే గత జనవరిలో హనుమ విహారిని ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్ గా పక్కన పెట్టాలని నిర్ణయించామని, జాతీయ జట్టుకు హనుమ విహారి ఎంపికయ్యే అవకాశాలు ఉండడంతో, కొత్త కెప్టెన్ రికి భుయ్ ను చేయాలని అనుకున్నామని, ఈ నిర్ణయాన్ని కూడా విహారి సమర్థించాడని అందులో వివరించారు. తమకు ఏ క్రికెటర్ ఎక్కువ, తక్కువ కాదని అందులో పేర్కొన్నారు. ఓ ఆటగాడు అధికారికంగా విహారి ప్రవర్తనపై ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నామని లేఖలో తెలియజేశారు. 


 


కొంతమంది క్రికెట్ నిఫుణుల చెబుతున్న సమాచారం ప్రకారం.. ఆంధ్రా క్రికెట్ జట్టు ఎంపికలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువైందని, దానికి తోడు కొంతకాలంగా జట్టులోని సీనియర్ సభ్యులు గ్రూపులు కట్టారని చెబుతున్నారు. తమకు ఇష్టమైన వారినే జట్టులోకి తీసుకుంటున్నారని, అందువల్ల ప్రతిభ గల యువకులకు చోటు దక్కడం లేదని ఓ యూట్యూబర్ ఈ రోజు తన ఛానెల్ లో విశ్లేషించాడు. అయితే హనుమ విహారి తన పాటికి తాను వెళ్లిపోయి ఉంటే బాగుండేదని, ఇలా వివాదాలకు తెరతీయడంతో తన భవిష్యత్ ను తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నాడని విశ్లేషించాడు.
ఎవరీ హనుమ విహారీ?
యువ భారత్ 2021/22 లో చేసిన ఆస్ట్రేలియా పర్యటన గుర్తుందా? ముఖ్యంగా మూడో టెస్ట్ లో టీమిండియా ఓటమి కోరల్లో చిక్కుకున్న సందర్భంలో స్పిన్నర్ అశ్విన్ తో కలిసి మ్యాచ్ ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారి గుర్తున్నాడా? 161 బంతులు ఆడి, 23 పరుగులతో అజేయంగా నిలిచిన అప్పటి సూపర్ హీరో మరోసారి నేడు వార్తల్లో నిలిచాడు.
హనుమ విహారీ.. మాజీ ఆంధ్ర జట్టు రంజీ కెప్టెన్. పూర్తి పేరు గాదె హనుమ విహారి. పుట్టింది కాకినాడలో. కానీ తండ్రి ఉద్యోగరీత్యా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో పెరిగాడు. చిన్నప్పుడే క్రికెట్ పై మక్కువ పెంచుకుని హైదరాబాద్ వచ్చి ఫ్రొపెషనల్ క్రికెట్ కోచింగ్ సంస్థలో జాయిన్ అయ్యాడు.
12 ఏళ్ల వయస్సులోనే తండ్రి చనిపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డా ఎన్నడూ క్రికెట్ ను విడిచిపెట్టలేదు. అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో వీవీఎస్ లక్ష్మణ్ పేరు మారుమోగుతుండడంతో ఆయననే స్ఫూర్తిగా తీసుకుని సాధన చేసేవాడు. ఉత్తమ ప్రతిభ కనపరచడంతో 2012 లో ఆస్ట్రేలియా లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలో యువ భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి మరీ వరల్డ్ కప్ ను గెలుచుకుంది.స్టిరంగా ఆడడంతో 2010 లో హైదరాబాద్ జట్టు తరఫును తొలి రంజీ మ్యాచ్ ఆడాడు.
రంజీ, లిస్ట్ ఏ క్రికెట్ లో కూడా ప్రతిభ కనపరచడంతో 2018 లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు హనుమ విహరీ భారత జట్టుకు ఎంపికైయ్యాడు. అలా తన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే అర్థ సెంచరీ సాధించాడు. కానీ హనుమ విహారి పేరు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది 2021-22 సిడ్నీ టెస్ట్ తరువాతనే. నిజంగా ఆరోజు హనుమ అత్యద్భుతంగా ఆడాడు.
ఆ రోజు క్రీజులో ది వాల్ గా పిలుచుకునే రాహూల్ ద్రావిడ్ ఉన్న కూడా ఇంత ఓపిక, సమన్వయంతో బ్యాటింగ్ చేసే వాడు కాదెమో. మరో వైపు అశ్విన్ అప్పడప్పుడు ఓపిక నశించి కొన్ని అగ్రెసివ్ షాట్లు ఆడిన, విహరీ మాత్రం తొందరపడలేదు. తన తరువాత వచ్చే బ్యాట్స్ మెన్ స్పెషలిస్ట్ కాకపోవడం ఒక అంశమయితే.. తన ఆటతీరే పొందికగా ఉండడం మరో కారణం.
ఆంధ్రాకే వరమయ్యాడు.. కానీ నేడు..


 


హైదరాబాద్ తరఫును బాగానే ఆడుతున్నా.. ఎందుకో కానీ హనుమ విహారీ ఆంధ్ర జట్టు తరఫును క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అలా 2016 లో ఆంధ్ర జట్టు తరఫున రంజీ, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో బరిలోకి దిగాడు. ఆ జట్టు తరఫునే 2017 లో ట్రిఫుల్ సెంచరీ సాధించాడు. మంచి సగటుతో పరుగులు సాధిస్తూ ఏకంగా భారత జట్టుకే ఎంపికయ్యాడు.
తన హయాంలోనే ఆంధ్రా జట్టు ఐదు సార్లు రంజీ మ్యాచ్ లో నాకౌట్ దశకు చేరింది. కానీ మొన్న బెంగాల్ తో జరిగిన మ్యాచ్ తరువాత అనుహ్యంగా కెప్టెన్ గా తొలగించబడ్డాడు. అది కూడా అవమానకరంగా.. ఏడేళ్లుగా రంజీ జట్టుకు కెప్టెన్ గా పని చేస్తే.. 17 వ ఆటగాడిని మందలించారనే కారణంతో తనను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని విహారి ఆవేదనగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తన బాధను వెళ్లగక్కాడు. ఐదు సార్లు తన జట్టును నాకౌట్ కు తీసుకెళ్తే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తనకు మంచి బహుమతి అందించిందని తన ఆవేదనను పంచుకున్నాడు.
ఇలా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలను బహిర్గతం చేశాడు. కానీ ఇంతకుముందు అంబటి రాయుడు కూడా ఇలాంటి పరిస్థితిలోనే తన క్రికెట్ కెరీర్ ను అనుకున్నంత ఉన్నతంగా ముగించలేకపోయాడు. ఇప్పుడు విహారీ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడని క్రీడా పండితులు అంటున్నారు. క్రీజులో ఎంత ఓపిక ముఖ్యమే.. బయట కూడా అంతే ఓపికగా ఉండాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News