క్షమాపణలు అంగీకరించే స్థాయిని దాటేశారు: పతంజలిపై సుప్రీంకోర్టు

వినియోగదారులను తప్పుదోవపట్టించే ప్రకటన విషయంలో పతంజలి క్షమాపణలు చెప్పే స్థాయిని దాటిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది

Update: 2024-04-02 11:33 GMT

వినియోగదారులను తప్పు దోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనలు రూపొందించిన కేసులో పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు పూర్తి అఫిడవిట్ దాఖలు చేయకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తూ కాలయాపన చేస్తున్నారంటూ యోగా గురు రాందేవ్ బాబాపై, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు చివాట్లు పెట్టింది. పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలనే అభ్యర్థనను కోర్టు మన్నించింది. ఇదే చివరి గడువుగా పేర్కొంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ (మ్యాజిక్ రెమెడీస్) చట్టం నిబంధనలను పతంజలి అతిక్రమించిందంది.

'సుప్రీంకోర్టే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాల్సిందే.. లేకపోతే అది కోర్టు ధిక్కారమే' అని న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. "మీరు కోర్టుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి" అని వ్యక్తిగతంగా హాజరైన రామ్‌దేవ్ పతంజలి MDకి ధర్మాసనం తెలిపింది. కోర్టుకు అంతకుముందు చెప్పిన క్షమాపణలు, స్వయంగా వచ్చి చెప్పిన క్షమాపణలను ఆమోదించలేమంది. మీ చర్యలు క్షమాపణల స్థాయి దాటిందని, చర్యకు సిద్ధంగా ఉండాలంది.
రామ్‌దేవ్, బాలకృష్ణ ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టులో క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని యోగా గురువు తరపు న్యాయవాది తెలిపారు. "మేము క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాము మరియు కోర్టు ఏది చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాము" అని వారి లాయర్ చేతులు జోడించి చెప్పాడు.
ఉదాసీనంగా వ్యవహరించిన కేంద్రం
వూహాన్ వైరస్ కాలంలో అల్లోపతిలో దానికి వైద్యం లేదని పతంజలి విపరీతంగా ప్రచారం చేసిందని, ఆ సమయంలో కేంద్రం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే రామ్ దేవ్ బాబా జరిగిన తప్పులకు క్షమాపణ వేడుకుంటున్నారని ఆయన తరఫున న్యాయవాదీ బల్బీర్ సింగ్, చేతులు జోడించి కోర్టును వేడుకున్నారు.ఆ కాలంలో ఇలా జరగాల్సింది కాదని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సమస్యకు పరిష్కారం కనుగొనడానికి కక్షిదారుల న్యాయవాదికి సహాయం చేయాలని కోర్టుకు విన్నవించారు.
ఈ వ్యాజ్యాన్ని తదుపరి విచారణకు ఏప్రిల్ 10న పోస్ట్ చేస్తూ, తర్వాతి తేదీన వారిద్దరూ తమ ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. మార్చి 19 సుప్రీంకోర్టు రామ్ దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ తమ ముందు వ్యక్తిగతం హాజరుకావాలంది. నవంబర్ 21, 2023న కోర్టుకు ఇచ్చిన అండర్‌టేకింగ్‌లో పతంజలి జారీ చేసిన ప్రకటనలు రామ్‌దేవ్ ఆమోదాన్ని ప్రతిబింబిస్తున్నందున అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయడం సముచితమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఫిబ్రవరి 27న, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని అందించే ఔషధాలకు సంబంధించిన అన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని పతంజలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. కంపెనీపై చర్యలు తీసుకోనందుకు కేంద్రాన్ని కూడా నిలదీసింది.
కేసు వేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్..
గత ఏడాది నవంబర్‌లో కోర్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA)ని విచారించినప్పుడు, పతంజలి అల్లోపతిని దాని మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నవారిని కించపరిచే రీతిలో ప్రకటనలు గుప్పించిదని ఆరోపించింది. అయితే పతంజలి సుప్రీంకోర్టులో క్షమాపణ చెప్పిన తరువాత కూడా అదే ప్రకటనలను కొనసాగించింది. దీంతో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని కేసును విచారిస్తున్న బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
Tags:    

Similar News