‘సుప్రీం’లో కాంగ్రెస్ పిటిషన్‌కు ఐటీ సమాధానమేంటి?

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు ఊరట లభించింది. పన్ను డిమాండ్ నోటీసులకు సంబంధించి ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోమని ఆదాయపు పన్ను శాఖ కోర్టుకు తెలిపింది.

Update: 2024-04-01 11:06 GMT
లోక్‌సభ ఎన్నికల ముందు ఐటీ నోటీసులతో సతమతమవుతన్న కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఊరట లభించింది. దాదాపు రూ.3500 కోట్ల పన్ను డిమాండ్ల నోటీసులకు సంబంధించి ప్రస్తుతానికి ఏ చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను విభాగం సుప్రీంకోర్టుకు తెలిపింది.
పన్ను డిమాండ్ల నోటీసులను సవాల్‌ చేస్తూ గతంలో కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐటీ విభాగం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తన వాదనలు వినిపించారు. ‘‘ప్రస్తుతం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి చర్యలు తీసుకోం. తుది తీర్పు వచ్చేదాకా ముందస్తు చర్యలు చేపట్టం’’ అని తెలిపారు. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జులై 24వ తేదీకి వాయిదా వేసింది.
ఇటీవల ఐటీ విభాగం కాంగ్రెస్‌కు వరుసగా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. 2017-18 నుంచి 2020-21 సంవత్సరాలకు సంబంధించి వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని గత శుక్రవారం నోటీసులిచ్చింది. అనంతరం 2014-15 నుంచి 2016-17 మదింపు సంవత్సరాలకు సంబంధించి మరో రూ.1745 కోట్లు కట్టాలని మరో నోటీసు పంపింది. ఈ నోటీసుల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ మొత్తం రూ.3,567 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదాయపుపన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ అధికారులు రూ.135 కోట్లను రికవరీ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లోక్‌సభ ఎన్నికల వేళ ‘‘పన్ను ఉగ్రవాదం’’తో ప్రధాన ప్రతిపక్షాన్ని ఆర్థికంగా కుంగదీయాలని కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఈ కేసును వాదిస్తున్నారు. 
Tags:    

Similar News