L.K.ADVANI | అద్వానీకి తీవ్ర అస్వస్థత, అపోలోకి తరలింపు
బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని లాల్ కిషన్ అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు.
By : The Federal
Update: 2024-12-14 17:11 GMT
బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని లాల్ కిషన్ అద్వానీ (L.K.ADVANI) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ గతంలోనూ అస్వస్థతకు లోనయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన తర్వాత కొన్నిరోజులకు కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 98 ఏళ్లు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు డిసెంబర్ 14వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపారు.
‘వార్తా సంస్థ ANI ప్రకారం.. అద్వానీని ICUలో చేర్చారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తీసుకెళ్లారు. ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం మరుసటి రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత.. ఆగస్టు 6న కూడా ఆసుపత్రిలో చేరాడు. అయితే, రొటీన్ చెకప్ కోసం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆయన కుమార్తె ప్రతిభా అద్వానీ తెలిపారు. అద్వానీ 1927లో కరాచీలో (ప్రస్తుతం పాకిస్థాన్) జన్మించారు. 2002 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నారు. అద్వానీ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వాలంటీర్‌గా ప్రారంభించారు. 2015లో అద్వానీకి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ లభించింది. 2024లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.
క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాక అద్వానీ మీడియా ముందు కనిపించలేదు. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్వానీ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు. రామమందిర ప్రారంభానికి ఆహ్వానం అందినప్పటికీ.. వయసురిత్యా ఇబ్బందులతో ఆయన వెళ్లలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆశిస్సులు పొంది వచ్చారు.