బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ రెండూ చేసేస్తుంది: కేజ్రీవాల్
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేస్తుందని ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఉద్దేశంతోనే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
"బిజెపి వాళ్లు రిజర్వేషన్లకు వ్యతిరేకం. వాళ్లు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. అధికారంలోకి రాగానే SC / ST / OBC రిజర్వేషన్‌లను రద్దు చేయాలని చూస్తున్నారు" అని గురువారం లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు.
కాషాయ పార్టీ అధికారంలోకి వస్తే హోంమంత్రి అమిత్ షాను తదుపరి ప్రధానిగా చేయడంతో పాటుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదినాథ్‌ను కూడా తొలగిస్తారని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. 75 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వంలో, సంస్థలో ఏ పదవి ఇవ్వరాదని, ఆ వయసు దాటిన వారు రిటైరవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ నిబంధన పెట్టారని గుర్తుచేస్తూ.. ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఈ నియమం ప్రకారం రిటైరయ్యాయని, దాని ప్రకారంగానే పలువురు బిజెపి నాయకులను తొలగించారని, కొందరికి టిక్కెట్ ఇవ్వలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
నెక్ట్స్ పీఎం షా ..
ప్రధాని మోదీకి వచ్చే ఏడాదికి 75 ఏళ్లు పూర్తవుతాయని కేజ్రీవాల్ చెప్పారు. పార్టీ సీనియర్లు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధ్రా రాజే, రమణ్ సింగ్, దేవేంద్ర ఫడ్న్విస్, మనోహర్ లాల్ ఖట్టర్‌ను పక్కన పెట్టి అమిత్ షాను దేశానికి ప్రధానిని చేయాలని మోదీ నిర్ణయించుకున్నారని, అందుకు అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఆదిత్యనాథ్ ఔట్..
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్‌ను తొలగిస్తామని కేజ్రీవాల్ అన్నారు. అమిత్ షాతో పోటీ పడే వ్యక్తి ఒక్కరే ఉన్నారని, ఆయనే ఆదిత్యనాథ్ అని చెప్పారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రెండు నెలల్లో అదిత్యనాథ్‌ను తొలగించబోతుందని కేజ్రీవాల్ చెప్పారు.
బీజేపీకి 220 సీట్లకు మించి రావు..
ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్లకు మించి రావని కేజ్రీవాల్ అన్నారు. హర్యానా, ఢిల్లీ, కర్నాటక, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లలో బీజేపీకి సీట్లు తగ్గుతాయన్నారు. పంజాబ్‌లో ఒక్క సీటు కూడా గెలవలేదని పేర్కొన్నారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు బీజేపీ కేవలం 143 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని ఎస్పీ చీఫ్ అన్నారు. "మొదటి నాలుగు దశల్లో బీజేపీ ఓడిపోయింది. 400 సీట్లు గెలుస్తామన్న ఆ పార్టీ మొత్తం 543 సీట్లలో 143 మాత్రమే గెలుస్తోంది" అని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ అన్నారు.