కుర్రాళ్లు నమ్మలేని ప్రదర్శన చేస్తున్నారు: పాండ్యా
ఐపీఎల్ 2024 నిజంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లా సాగుతోంది. ప్రతి సీజన్ లో భారతీయ ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్ల బ్యాటింగ్ మెరుపులు ఎక్కువగా ఈ లీగ్ లో కనిపించేవి.
By : The Federal
Update: 2024-04-19 12:05 GMT
ఈ సీజన్ లో ఇప్పటికే అభిషేక్ శర్మ( హైదరాబాద్), మాయాంక్ యాదవ్(లక్నో), శశాంక్ సింగ్ పేర్లతో పాటు మరో హర్డ్ హిట్టర్ అశుతోష్ శర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా లోయర్ ఆర్డర్ వచ్చి బ్యాటింగ్ ఇరగదీస్తున్న అశుతోష్ తన భుజ బలానికి బుద్దిబలాన్ని ఉపయోగించి కొడుతున్న షాట్లు అభిమానులతో పాటు.. క్రికెట్ పండితులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పంజాబ్ స్టాండ్ ఇన్ కెప్టెన్ సామ్ కర్రాన్ కూడా చేరారు. ఇది నమ్మలేని ప్రదర్శన అంటూ అశుతోష్ ను ఆకాశానికెత్తాశారు.
అశుతోష్, శశాంక్ సింగ్ ఈ ఐపిఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు హీరోలు అవతరించారని చెప్పవచ్చు. చాలా సార్లు జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకోబోతోంది అనే సమయంలో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడారు. జట్టు గెలవకపోవచ్చు కానీ ప్రత్యర్థి జట్లకు హడలు పుట్టించారు.
డేరింగ్ గా షాట్లు ఆడుతూ అలవోకగా బౌండరీలు రాబట్టుకుంటున్నారు. గురువారం, అశుతోష్ 28 బంతుల్లో 61 పరుగులతో సాధించాడు. అందులో ఏకంగా ఏడు సిక్స్ లు బాదేశాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. అశుతోష్ మ్యాచ్ ఆడుతుంటే ముంబై బౌలర్లు దిక్కుతోచనివారైయ్యారు. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంధించిన క్లీన్ యార్కర్ ను స్వీప్ తో సిక్సర్ మలిచే షాట్ ను ఎంత వర్ణించిన తక్కువే. బంతిని బలంగా బాదుతూ ఈ సీజన్ లో రెచ్చిపోతున్నాడు.
" అశుతోష్ అనితర సాధ్యంగా ఆడుతున్నాడు. ప్రతి బాల్ ను మిడిల్ చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అతను భవిష్యత్ లో గొప్ప ఆటగాడు అవుతాడు. మేము ఏమి లూజ్ బాల్స్ వేయలేదు. టైం అవుట్ లో ఇదే మాట్లాడుకున్నాం "అని పాండ్యా మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో చెప్పాడు. అశుతోష్ క్రీజులో ఉన్నంత సేపు నరాలు తెగే ఉత్కంఠ అనుభవించామని ముంబై కెప్టెన్ అన్నారు.
పంజాబ్ కింగ్స్ స్టాండ్-ఇన్ కెప్టెన్ సామ్ కుర్రాన్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో కొన్ని మ్యాచ్‌లలో ఓడిపోయినప్పటికీ, అశుతోష్, శశాంక్ వంటి యువకులు ఈ సందర్భాన్నిఉపయోగించుకుని తమ ఆట తీరును బయటపెట్టారని సంతోషం వ్యక్తం చేశారు.
"ఇది చాలా కఠినమైనది. మేము ప్రారంభంలో చాలా వికెట్లు కోల్పోయాము, అయితే కుర్రాళ్ళు జట్టు కోసం ఆడిన తీరు సంతోషానిస్తోంది. " "వారు నమ్మశక్యం కాని విశ్వాసంతో ఉన్నారు. అశుతోష్ పేసర్ బౌలింగ్ లో స్వీప్‌లు, పెద్ద హిట్‌లు ఆడుతున్నాడు. ఇది చాలా గొప్ప విషయం" అని కుర్రాన్ అన్నాడు.
ఇలాంటి దగ్గరి పరాజయాల నుంచి తీసుకోవాల్సిన సానుకూలతలు చాలా ఉన్నాయని ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ అన్నారు. భూమ్రా అత్యద్బుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నిమార్చేశాడని అన్నారు.
ఆ షాట్ తో థ్రిల్ కు గురయ్యాను: అశుతోష్
బ్యాటింగ్ సంచలనం అశుతోష్ శర్మ ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సంధించిన యార్కర్ ను స్వీప్ షాట్ ద్వారా సిక్సర్‌కి కొట్టినందుకు థ్రిల్ గా ఫీలయినట్లు వివరించాడు.
పంజాబ్ ఛేజింగ్‌లో 13వ ఓవర్‌లో బుమ్రా వేసిన యార్కర్‌ను ఫుల్ టాస్‌గా మార్చేందుకు అశుతోష్ తన ముందుకు వంగి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టాడు.
" స్వీప్ షాట్ కొట్టడం నా కల. నేను ఆ షాట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ అది ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ అయినా భూమ్రాపై వచ్చింది. ఇది ఆటలో ఒక భాగం," అని అశుతోష్ మ్యాచ్ తర్వాత మీడియాతో అన్నారు. పంజాబ్ కచ్చితంగా తరువాత గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆశుతోష్ ను తీర్చిదిద్దిన ఘనత కోచ్ సంజయ్ బంగర్ కు దక్కుతుంది.
"నేను స్లోగర్‌ని కానని, నేను సరైన క్రికెట్ షాట్లు ఆడగలను అని సంజయ్ సార్ నాకు చెప్పారు. ఇది ఒక చిన్న ప్రకటన కానీ నాకు చాలా పెద్ద బలాన్ని ఇచ్చింది. నేను దానిని అనుసరిస్తున్నాను - నేను హార్డ్ హిట్టర్ ని కాదు, నేను నా ఆట ఆడుతున్నాను. సరైన క్రికెట్ షాట్లే నా గేమ్ ప్లాన్. అదే నా ఆటను మార్చింది" అని అశుతోష్ అన్నాడు. ముంబై జట్టులో కొయోట్జి తన పేస్ తో పవర్ ప్లే లో భయపెట్టినట్లు అశుతోష్ అన్నారు. తనకు అవకాశం ఇచ్చిన పంజాబ్ జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.