కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ట్రక్కు.. బస్సును ఢీ కొట్టింది.;
కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ట్రక్కు.. బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో మంగళవారం ఉదయం 9:15 గంటలకు జరిగింది. జాతీయ రహదారి నెం.30పై సిమోరా వద్ద వంతెనపై టెంపో ట్రావెల్ బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే జబల్‌పూర్ ఎస్పీ, కలెక్టర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికు ఆసుపత్రలుకు తరలించారు. మృతదేశాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం మృతుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసుల వర్గాలు తెలుపుతున్నాయి. కాగా ట్రక్కు రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తోందని స్థానికులు చెప్పినట్లు తెలుస్తోంది.
మృతులు ఎవరు..?
అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారు ఎవరు? ఏ రాష్ట్రానికి చెందిన వారు? బస్సు ఎక్కడి నుంచి వచ్చింది? వంటి ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు. కొందరు ఈ బస్సు తెలంగాణ నాచారం నుంచి వెళ్లిందని, భక్తులు తెలంగాణ వాసులు అని అంటున్నారు. మరికొందరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్సు అని, మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని అంటున్నారు. దీంతో ప్రమాదానికి గురైన బస్సు, మృతుల అంశాలపై తీవ్ర సందిగ్దత నెలకొంది. కాగా తాజాగా వీటిపై పోలీసులు స్పష్టత నిచ్చారు. మృతులను నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డిగా గుర్తించామని, వారంతా కూడా హైదరాబాద్ నాచారంకు చెందిన వారేనని చెప్పారు.
మృతులు, క్షతగాత్రులు హైదరాబాద్ కార్తికేయ నగర్ కు చెందిన వారు. నాచారం నుండి మిని బస్ మాట్లాడుకుని కుంభమేళాకు ప్రయాణం. ప్రమాదానికి గురైన మినీ బస్ నెంబర్ AP29 W1525 గా గుర్తింపు. నెంబర్ ద్వారా నాచారం పోలీస్ కు సమాచారం ఇచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు. రాంగ్ రూట్ లో వచ్చి మినీ బస్ ను డీ కొట్టిన ట్రక్. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న భారీ ట్రక్. మృతులు నాచారం లోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్ కు చెందినవారు. అంతేకాకుండా భక్తులు మూడు మినీ బస్సుల్లో కుంభమేళాకు వెళ్లారని, తిరిగి వస్తున్న క్రమంలో ఒక బస్సుకు ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ బస్సులో 14 మంది ఉండగా వారిలో ఏడుగురు మరణించగా, మిగిలినవారికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి: సీఎం రేవంత్
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలో (నాగపూర్ - ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై) జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మృతులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: బీఆర్ఎస్
ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించింది. ‘‘కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తున్న ఏడుగురు హైదరాబాద్ వాసులు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం అత్యంత బాధాకరం. మినీ బస్సును ట్రక్కు ఢీకొన్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి. మన రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల భద్రత విషయంలో, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడాలి. కుంభమేళాకు వెళ్లి వచ్చే భక్తులు జాగ్రత్తగా ప్రయాణం చేసి, క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని బీఆర్ఎల్ వెల్లడించింది.