కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలి: రైతు సంఘాల నాయకులు

పంటలకు కనీస మద్దతు ధరకి చట్టపర హామీ ఇవ్వడంపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Update: 2024-02-18 05:34 GMT

పంటలకు కనీస మద్దతు ధరకి చట్టపర హామీ ఇవ్వడంపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రుల కమిటీతో వారు ఆదివారం మరోసారి భేటీ కానున్న ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతు సంఘాల నాయకులతో ఆదివారం ప్రభుత్వం తరుపున కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ సమావేశం కానున్నారు. వారితో సమావేశం కావడం ఇది నాలుగో సారి. అంతకుముందు ఫిబ్రవరి 8, 12,15 తేదీల్లో మూడు దఫాలుగా చర్చలు జరిగినా అవి అసంపూర్తిగా ముగిశాయి.

ఐదో రోజుకు చేరిన ‘‘ఢిల్లీ చలో’’ కార్యక్రమం..

ఇటు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపుమేరకు 'ఢిల్లీ చలో' మార్చ్ ఐదో రోజుకు చేరుకుంది. శంభు సరిహద్దు వద్ద విలేఖరులతో రైతు సంఘం నాయకుడు పంధేర్ మాట్లాడుతూ .."రాజకీయ" నిర్ణయాలు తీసుకునే హక్కు కేంద్రానికి ఉంటుందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనుకుంటే ఆర్డినెన్స్ తేవచ్చని.. అనుకుంటే రాత్రికి రాత్రే దాన్ని కేంద్రం తీసుకురాగలదని పేర్కొన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు "సి2 ప్లస్ 50 శాతం" డిమాండ్ మేరకు, ప్రభుత్వం "ఎ2 ప్లస్ ఎఫ్ఎల్" ఫార్ములా కింద ఆర్డినెన్స్ తేవాలని కోరారు.

19వరకు నిషేధం..

పంధేర్‌తో కలిసి 'ఢిల్లీ చలో' మార్చ్‌కు నాయకత్వం వహిస్తున్న మరో రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ కూడా ఆర్డినెన్స్ తీసుకురావాలని అన్నారు. హర్యానా ప్రభుత్వం శనివారం ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ , బల్క్ SMS సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 వరకు పొడిగించింది.

బీజేపీ నేతల ఇళ్ల వద్ద ధర్నాలు..

ఇదిలా ఉండగా భారతీయ కిసాన్ యూనియన్ (చారుణి) హర్యానాలో ట్రాక్టర్ మార్చ్ చేపట్టింది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా BKU (ఏక్తా ఉగ్రహన్) నాయకులు ముగ్గురు సీనియర్ బీజేపీ నాయకుల వద్ద ధర్నా చేశారు. పాటియాలాలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అబోహర్‌లో బీజేపీ పంజాబ్ యూనిట్ చీఫ్ సునీల్ జాఖర్, బర్నాలాలో పార్టీ సీనియర్ నాయకుడు కేవల్ సింగ్ ధిల్లాన్ నివాసాల వద్ద తన నిరసన తెలిపారు.

రైతులకు మద్ధతుగా ట్రాక్టర్ మార్చ్..

హర్యానాలో ఉన్న గుర్నామ్ సింగ్ చారుణి నేతృత్వంలోని వర్గం, కురుక్షేత్ర, యమునానగర్, సిర్సాతో సహా అనేక ప్రాంతాల్లో ట్రాక్టర్ మార్చ్‌లు నిర్వహించారు. పంజాబ్‌లో ఆందోళన చేస్తున్న రైతులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

టోల్ ప్లాజాల వద్ద నిరసనలు..

రైతుల 'ఢిల్లీ చలో' పిలుపుకు మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 21 టోల్ ప్లాజాల వద్ద కొంతమంది రైతులు నిరసన తెలిపారు. BKU (ఏక్తా ఉగ్రహన్) ఆధ్వర్యంలో ఆదివారం కూడా రైతులు నిరసనను కొనసాగించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ కేంద్రంపై ఒత్తిడి చేయడానికి ఫిబ్రవరి 21న యుపి, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో రైతులు ధర్నాలు చేస్తారని ప్రకటించారు. సిసౌలీలో విలేకరులతో టికైత్ మాట్లాడుతూ.. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే ఫిబ్రవరి చివరి వారంలో ఢిల్లీకి ట్రాక్టర్ మార్చ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

తమిళనాడులో రైల్ రోకో..

పంజాబ్ సరిహద్దుల్లో రైతులపై పోలీసుల చర్యకు నిరసనగా.. తమిళనాడులో శనివారం తంజావూరు రైల్వే స్టేషన్‌లో వివిధ రైతు సంఘాలకు చెందిన 100 మంది రైతులు చోళన్ ఎక్స్‌ప్రెస్ ముందు 'రైల్ రోకో'కు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది మహిళలు కూడా శంభు సరిహద్దుకు చేరుకున్నారు. సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉండాలని ఆందోళనకారులను రైతు నాయకులు కోరారు. శనివారం హర్యానా భద్రతా సిబ్బందికి, ఆందోళనకారులకు మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తలేదు.

ఎంఎస్‌పికి చట్టపర హామీతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు, రైతు కూలీలకు పింఛను, వ్యవసాయ రుణమాఫీ, పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  

Tags:    

Similar News