ఉపాధి కూలీల వేతనాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
By : The Federal
Update: 2024-03-28 11:32 GMT
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాలకు ఈ పథకం కింద 4 నుంచి 10 శాతం వరకు పెంచనున్నారు. ఈ పథకం కింద నైపుణ్యం లేని కార్మికులకు హర్యానాలో అత్యధికంగా రోజుకు రూ.374 , అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో అత్యల్పంగా రూ.234 వేతనం అందనుంది. సిక్కింలోని మూడు పంచాయితీలు గ్నాతంగ్, లాచుంగ్, లాచెన్ ప్రజలు రోజుకు సగటు వేతనం రూ. 374 వేతనం పొందనున్నారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.
నైపుణ్యం లేని కార్మికులు వారు నివసిస్తున్న గ్రామంలో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం ద్వారా కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంపొందించే ఈ పథకం ముఖ్య లక్ష్యం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చాక తర్వాత ఈ పథకం పెంచిన వేతనాలు అమల్లోకి రానున్నాయి.
ఏపీ, తెలంగాణలో ఇక నుంచి రోజుకు రూ. 300
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుత వేతనం రోజుకు రూ.272. 10.3 శాతం పెంపుతో ఇక నుంచి రూ.300 అందుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.250 (రూ.13 పెరుగుదల), తమిళనాడులో రూ.319 (రూ.25 పెరుగుదల), బీహార్‌లో రూ.228 (రూ.17 పెరుగుదల)గా ఉంది. వేతన రేటు పరంగా హర్యానా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, పెరుగుదల కేవలం నాలుగు శాతంగానే ఉంది. మొత్తంమీద పెంపుదల 4 నుంచి 10 శాతం మధ్య ఉంది. తెలంగాణ, ఏపీ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 10 శాతం పెరుగుదల నమోదైందని నోటిఫికేషన్ డేటా వెల్లడిస్తోంది.