‘మోదీ లాంటి బలమైన నాయకుడు ప్రతి పార్టీకి అవసరం’

ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్‌కు లేరని బీజేపీలో చేరిన పద్మజా వేణుగోపాల్ అన్నారు.

Update: 2024-03-08 14:23 GMT

కేరళ మాజీ ముఖ్యమంత్రి కూతురు పద్మజ నిన్నటి రోజున బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పద్మజ అధికారికంగా బీజేపీలో చేరారు. ఢిల్లీ నుంచి కేరళకు చేరుకున్న పద్మజకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

కాంగ్రెస్ ను ఎందుకు వీడాల్సి వచ్చిందని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు పద్మజ.. ‘‘ కాంగ్రెస్‌ను వీడడం బాధగా ఉందని, అయితే తన పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్న తీరే తనను పార్టీ మారేలా చేసింది.’’ అని చెప్పారు.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ సభ్యులతో కలవలేని స్థితిలో ఉన్నారన్నారు పద్మజ. ‘‘నేను ఇటీవల ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లినప్పుడు.. సోనియా గాంధీ ఎవరినీ కలవడం లేదని, రాహుల్ గాంధీకి సమయం లేదని నాకు చెప్పారు. ఆ రోజే నేను ఇక ఉండాల్సిన అవసరం లేదని గ్రహించాను.’’ అని చెప్పారు.

"ఎన్నికల సమయంలో నన్ను కమిటీల నుంచి మినహాయించారు. త్రిసూర్ నుంచి నన్ను బలవంతంగా వెళ్లగొట్టడానికి ప్రయత్నించారు. నేను ఫిర్యాదు చేసినా పార్టీ నాయకత్వం దానిని సీరియస్‌గా తీసుకోలేదు. ఇది నాకు బాధ కలిగించింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ కొంతకాలంగా తన మనసులో మెదులుతున్నా.. ఎవరితోనూ పంచుకోలేదని చెప్పారు.

“నా ఆకస్మిక నిర్ణయంతో వారు (కాంగ్రెస్) షాక్ అయ్యారు. నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని వాళ్లు అనుకోలేదు.’’అని పద్మజ చెప్పారు.

తన తల్లితండ్రులపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ మమకూటథిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. తన తల్లిని అవమానించిన రాహుల్ పై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

తన సోదరుడు మురళీధరన్ విమర్శలపై స్పందిస్తూ.. “నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదు. ఆయన గతంలో కొన్నిపార్టీలలో చేరాడు. నా సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడే ఉద్దేశ్యం నాకు లేదు. మన రాజకీయ, వ్యక్తిగత జీవితాలను వేరుగా ఉంచుకోవాలి. నా రాజకీయ జీవితం వేరు’’ అని అన్నారు పద్మజ.

పద్మజ పార్టీ మారడాన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీ పతనంగా చూస్తుండగా, కేరళలో అధికార సీపీఎం కాంగ్రెస్‌పై నమ్మకాన్ని వమ్ము చేయడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోంది. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతలు తమతోనే ఉంటారని, బీజేపీలో చేరరని గ్యారెంటీ ఏమైనా ఉందా అని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశ్నించారు.

పద్మజ నిర్ణయం నమ్మకద్రోహమని, దానికి తమ తండ్రి ఆత్మ క్షమించదని, తన సోదరితో ఉన్న సంబంధాన్ని ఇంతటితో తెంచుకుంటున్నట్లు ఆమె అన్న మురళీధరన్ తెలిపారు.

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) చీఫ్ కె సుధాకరన్ పద్మజ నిర్ణయాన్ని విశ్వాస ఘాతుకం అని అభివర్ణించారు.

Tags:    

Similar News