రూ. 300 కోట్ల ఆస్తి కోసం మామను చంపించిన కోడలు.. చివరకు..

నాగ్‌పూర్‌లో జరిగిన ఘటనతో లోకంలో ఇలాంటి కోడళ్లు కూడా ఉంటారా? అనే అనుమానం కలుగుతోంది. ఆస్తి కోసం మామను మర్డర్ చేయించిన కోడల్ని పోలీసులు ఎలా కనిపెట్టారు?

Update: 2024-06-13 09:58 GMT

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 82 ఏళ్ల పురుషోత్తం పట్టేవార్ మే 22న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసిన పోలీసులకు విచారణలో వీస్తూపోయే నిజాలు తెలిశాయి. మామ ఆస్తి కోసం కోడలే హత్య చేయించిందని నిర్ధారించారు.

హత్యకు రూ. కోటి కాంట్రాక్టు..

నాగపూర్‌లోని టౌన్ ప్లానింగ్ డిపార్టుమెంట్‌లో అర్చన మనీష్ పట్టేవార్ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె మామ (పురుషోత్తం పట్టేవార్) పేరు మీద సుమారు రూ.300 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. ఆ ఆస్థినంతా కాజేయాలని అర్ఛనకు దుర్భద్ధి పుట్టింది. మామ బతికి ఉండగా అది జరిగే పనికాదనుకుని, ఆయన్నుచంపేయాలని నిర్ణయించుకుంది. కాంట్రాక్టు మర్డర్‌కు ప్లాన్ చేసింది. కిరాయి హంతకులతో రూ. కోటి బేరం కుదుర్చుకుంది. మామను కారుతో గుద్ది చంపేయాలని కిరాయి ముఠాకు చెప్పిన అర్చన.. ఓ సెకండ్ హ్యండ్ కారు కొనేందుకు వారికి కొంత డబ్బు కూడా ఇచ్చింది.

పోలీసుల విచారణలో..

తొలుత సాధారణ యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసిన పోలీసులు..కాస్త లోతుగా ఇన్‌వెస్టిగేషన్ చేశారు. విచారణలో వారికి కొత్త విషయాలు తెలిశాయి. ఈ హత్య కేసుతో మరో నలుగురి ప్రమేయం కూడా ఉందని నిర్ధారించారు. తర్వాత డ్రైవర్ సార్తిక్ బాడ్గే, నీరజ్ ఈశ్వర్ నిమ్జే (30), సచిన్ మోహన్ ధార్మిక్ (29) పాయల్ నాగేశ్వర్ (28)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సార్తిక్ బాడ్గే అర్చన భర్త కారు డ్రైవర్ కాగా, పాయల్ నాగేశ్వర్ అర్చన వ్యక్తిగత సహాయకుడు.

నిందితుల వాంగ్మూలం ఆధారంగా అర్చనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

హత్యలో కీలకంగా వ్యవహరించిన ధర్మిక్‌కు బీర్ బార్ లైసెన్స్ మంజూరు చేయిస్తానని అర్చన హామీ ఇచ్చిందని క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.

ఈ కాంట్రాక్టు హత్య కేసుతో సంబంధం ఉందని 59 ఏళ్ల వయసు ఉన్న మహారాష్ట్ర ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ ప్రశాంత్ పర్లేవార్ ను కూడా అరెస్టు చేశారు.

అర్చనపై పలు ఫిర్యాదులు..

హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు అర్చన పనిచేస్తున్నచోట కూడా ఆమె గురించి విచారించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసిన సమయంలో నూ ఆమెపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఆమెకు రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు వల్ల ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమ లేఅవుట్లను క్లియర్ చేసినట్లు విచారణలో తేలింది.

నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం..

నిందితుల నుంచి ఇప్పటివరకు రెండు కార్లు, ఒక ఎస్‌యూవీ, 140 గ్రాముల బంగారం, రూ.3 లక్షల నగదు, ఏడు మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News