అంగన్‌వాడీ భోజనం ప్యాకెట్‌లో చనిపోయిన పాముపిల్ల..

అంగన్‌వాడీ భోజనం ప్యాకెట్‌లో చనిపోయిన పాముపిల్లను చూసిన చిన్నారి తల్లిదండ్రులు బిత్తరపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది.

Update: 2024-07-04 09:45 GMT

ఆహార పదార్థాల్లో ఏమోస్తాయో ప్యాకెట్ విప్పేదాకా తెలీదు. మొన్న ఐస్ క్రీమ్‌లో మనిషి వేలు దర్శనమిస్తే.. ఇవాళ భోజనం ప్యాకెట్‌లో ఏకంగా చచ్చిన పాముపిల్ల కనిపించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలని మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టుబట్టారు.

మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని ప్యాకెట్లలో పంపిణీ చేస్తున్నారు. ఒక చిన్నారికి ఇచ్చిన ప్యాకెట్‌లో చనిపోయిన చిన్న పాముపిల్ల కనిపించింది. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులు సాంగ్లీలోని రాష్ట్ర అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే దృష్టికి తీసుకెళ్లారు.

కాగా చచ్చిపోయిన పాముపిల్లను ఫోటో తీసిన తర్వాత చిన్నారి తల్లిదండ్రులు దాన్ని విసిరివేసినట్లు అధికారులు చెబుతున్నారు.

అసెంబ్లీలో విచారణకు డిమాండ్..

ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు, పలుస్-కడేగావ్ ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్ మహారాష్ట్ర శాసనసభలో లేవనెత్తారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గోడౌన్‌ సీజ్..

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న మహిళా శిశు సంక్షేమం, అంగన్‌వాడీ విభాగం అధిపతి సందీప్‌ యాదవ్‌ భోజన ప్యాకెట్లు నిల్వ ఉంచిన గోడౌన్‌ను సీల్‌ చేశారు. ప్యాకెట్‌లోని ఆహార నమూనాను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.

ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు..

ఇలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఓ కస్టమర్‌‌కు అనుభవమైంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు ఉండడం చూసి షాకయ్యాడు. విషయం పోలీసులకు చెప్పడంతో వేలిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి.. వేలు ఎవరిదో కనుక్కునే పనిలో పడ్డారు.

ఈ తరహా ఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బయట ఏది తిన్నాలన్నా అనుమానించాల్సిన వస్తుంది. నిశితంగా పరిశీలించి తినడం తప్ప మరో మార్గం లేదు.

Tags:    

Similar News