అయోధ్యకు రామ్‌లల్లా దర్శనానికి భారీ క్యూ
అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా కొలువుదీరాడు. ఇక బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తజనం భారీగా తరలివస్తున్నారు.
అయోధ్య రాముడికి సోమవారం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. అంగరంగ వైభవంగా ప్రధాని మోదీ చేతులమీదుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేశారు. ఈ వేడుక గురించి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రచారం చేయడంతో బాలరాముడి (రామ్‌లల్లా)ను తప్పక దర్శించుకోవాల్సిందేనని భక్తులు భారీ సంఖ్యలో అయోధ్యకు చేరుకున్నారు.
‘‘జై శ్రీరాం’’..‘‘జై జై శ్రీరాం’’ అంటూ జెండాలను చేతపట్టి తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో నిలుచుకున్నారు.
రద్దీ దృష్ట్యా ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ ట్రస్టు అధికారులు ప్రకటించారు.
రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.
‘‘చాలా ఆనందంగా ఉంది, నా జీవిత లక్ష్యం నెరవేరింది. శతాబ్దాల పోరాటం ఫలించింది. శ్రీరాముడి పేరు యుగయుగాలు నిలిచిపోవాలి’’ అని పంజాబ్‌కు చెందిన మనీష్ వర్మ అనే భక్తుడు పేర్కొన్నారు.
బీహార్‌లోని మాధేపురా జిల్లాకు చెందిన నితీష్ కుమార్ 600 కిలోవిూటర్లకు పైగా సైకిల్‌పై ప్రయాణించి అయోధ్య చేరుకున్నారు.
‘‘విపరీతమైన రద్దీ ఉంది. కానీ నాకు ఈ రోజు దర్శన భాగ్యం లభిస్తుందని భావిస్తున్నాను. నా కోరిక నెరవేరిన తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభిస్తా. సోమవారం స్వామిని దర్శించుకోలేకపోయా. బాలరాముడిని దర్శించుకునే దాకా అయోధ్యలో ఉంటా’’ అని నితీష్ చెప్పారు.
రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన అనురాగ్ శర్మ పవిత్రోత్సవం రోజున ఆలయ నమూనాతో తిరుగుతూ కనిపించాడు.
అయోధ్య ఆలయ నమూనాను చూపుతూ ‘‘నేను నా స్వస్థలం నుంచి దీన్ని తీసుకువచ్చాను. అయోధ్యకు విమానంలో వచ్చాను. సోమవారం నుంచి ఇక్కడే ఉన్నాను. రామ్‌లల్లాను దర్శించుకున్న తర్వాత మాత్రమే తిరిగి వెళ్తాను’’ అని అనురాగ్ చెప్పాడు.
‘‘రామ్‌లల్లా మాకు చత్తీస్‌గఢ్ నుంచి నడవడానికి శక్తినిచ్చాడు. ఆయనను దర్శించుకున్నాకే తిరిగి ప్రయాణమవుతాం.’’ అని ‘పాదయాత్ర’గా వచ్చిన ఎనిమిది మంది సభ్యుల్లో ఒకరైన సునీల్ మాధో చెప్పారు.
‘‘రాముడు పిలవడం వల్ల మేము కొద్ది రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. హోటల్‌లో గదులు దొరకవు. అయోధ్యకు వెళ్లకండి అని మా ఊరి జనం చెప్పారు. కాని ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో ఉన్నాం. రామ్‌లల్లా దర్శనం కోసం ఇంకా ఎన్ని రోజులయిన వేచి చూస్తాం’’ అని ఓ భక్తుడు చెప్పాడు.
సెల్ఫీ స్పాట్లుగా ఆలయ దార్వాలు..
సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన ఆలయ కొలతలను ఒక్క సారి పరిశీలిస్తే..తూర్పు నుంచి పడమర వరకు 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగులు ఎత్తు ఉంటుంది అయోధ్య రామాలయం. 392 స్తంభాలతో నిర్మించిన ఆలయంలో మొత్తం 44 తలుపులు ఉన్నాయి. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సుందరంగా అలంకరించిన ఆలయ స్థంబాలు, ద్వారాలు భక్తులకు సెల్ఫీ స్పాట్‌లుగా మారాయి.
శాస్త్రోతంగా ప్రాణప్రతిష్ఠ..
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
4`సెకన్ల పాటు ‘అభిజీత్ ముహూర్తాన మధ్యాహ్నం 12.29 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 51 అంగుళాల బాలరాముడి విగ్రహం ముందు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు.
ప్రధాని భావోద్వేగ ప్రసంగం..
‘‘జనవరి 22, 2024 క్యాలెండర్‌లో కేవలం తేదీ మాత్రమే కాదు, కొత్త శకం ఆవిర్భావానికి నాంది. చాలాకాలం నిరీక్షణ తర్వాత రాముడు వచ్చాడు. రామ్‌లల్లా ఇకపై డేరాలో నివసించడు. ఆలయంలో ఉంటాడు’’ అని ఆహ్వానితులను ఉద్దేశించి మోడీ భావోద్వేగంగా ప్రసంగించారు.