ఆప్ మహిళా ఎంపీపై దాడి ఘటనలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందా?

రోజులు గడిచే కొద్దీ ఆప్ ఎంపీ మలివాల్‌పై దాడి ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు ఈ కేసులో కీలకం కానున్నాయి.

Update: 2024-05-18 10:08 GMT
బిభవ్ కుమార్‌

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు నేపథ్యంలో.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం (మే 18) అరెస్టు చేశారు.

సీఎం నివాసానికి వచ్చిన తనపై బిభవ్ కుమార్‌ దాడికి పాల్పడ్డాడని మలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఛాతీ, కడుపుపై కొట్టాడని, బట్టలు చిరిగిపోయాయని, తల, కాలికి తీవ్ర గాయాలయ్యాయని ఆమె ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

అయితే శనివారం బయటకు వచ్చని CCTV ఫుటేజీని పరిశీలిస్తే.. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని, మహిళా భద్రతా సిబ్బంది ఆమెను బయటకు తీసుకువెళ్లడంతో ఆమె బట్టలు కూడా చిరగలేదని తెలుస్తోంది. కాగా మలివాల్ ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలున్నాయని మెడికల్ రిపోర్టులో తేలింది.

మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ఆయన శుక్రవారం సాయంత్రం మలివాల్‌పై ఫిర్యాదు చేశారు. "అమె అవాస్తవాలు చెబుతోందని, తప్పుడు కథనాన్ని అల్లుతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఢిల్లీ పోలీసు బృందం శనివారం మధ్యాహ్నం సిఎం నివాసం నుండి బిభవ్ కుమార్‌ను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

రాజకీయ రంగు..

మలివాల్‌పై దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. కేజ్రీవాల్, ఆప్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండగా..లోక్‌సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ వెనకుండి ఇదంతా చేయిస్తోందని ఆప్ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News