ఢిల్లీ సరిహద్దులో భారీగా స్తంభించిన ట్రాఫిక్ ..

దేశ రాజధానికి రైతుల తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్ దృష్ట్యా సోమవారం ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

Update: 2024-02-26 13:49 GMT

తమ నిరసనలో భాగంగా రైతులు సోమవారం యమునా ఎక్స్‌ప్రెస్‌వే, లుహర్లీ టోల్ ప్లాజా, మహామాయ ఫ్లైఓవర్ మీదుగా ట్రాక్టర్లతో నిరసన కవాతు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ఫలితంగా ఢిల్లీ నుంచి నోయిడా వైపు చిల్లా బోర్డర్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఢిల్లీ-నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద కూడా ట్రాఫిక్‌ పెరిగిపోయింది.

అంతకుముందు దేశ రాజధాని, నోయిడా మధ్య అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఇంటెన్సివ్ చెకింగ్ నిర్వహిస్తామని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు తెలిపారు. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తామని చెప్పారు. కొనసాగుతున్న రైతుల నిరసన ఢిల్లీ, హర్యానా మధ్య సింగు, తిక్రీ సరిహద్దు పాయింట్ల వద్ద ట్రాఫిక్ కదలికను కూడా ప్రభావితం చేసింది. దాదాపు రెండు వారాల తర్వాత అధికారులు సింగు, టిక్రి సరిహద్దు పాయింట్లను పాక్షికంగా తిరిగి తెరిచారు. సింగు సరిహద్దు సర్వీస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉందని ప్రయాణీకుల్లో ఒకరు ఎక్స్‌లో రాశారు.

పంటలకు కనీస మద్దతు ధర (MSP), వ్యవసాయ రుణాల మాఫీతో సహా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రైతులు తమ నిరసన ప్రదర్శనను ఫిబ్రవరి 13న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలోని అంబాలా సమీపంలోని పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతుల మార్చ్‌ను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారంతా అక్కడే ఉండిపోయారు. దీంతో పాటు దేశ రాజధానిలోని ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. సర్దార్ పటేల్ మార్గ్, దేశ రాజధాని నుంచి గుర్గావ్ వైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని ప్రయాణికులు అంటున్నారు.

Tags:    

Similar News