ఈ స్టాప్ క్లాక్, క్రికెట్ ను ఎలా మారుస్తుంది
వైట్ బాల్ క్రికెట్ లో ఇక నుంచి స్టాప్ క్లాక్ విధానం శాశ్వతంగా అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. జూన్ లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగబోయే..
By : The Federal
Update: 2024-03-16 11:51 GMT
ఇక నుంచి అంతర్జాతీయంగా వైట్ బాల్ మ్యాచ్ లకు ఓవర్ల మధ్య స్టాప్ క్లాక్ లను ఉపయోగించాలని ఆదేశించింది. జూన్ 2024 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తరువాత అన్ని వన్డేలు, టీ20 ల్లో స్టాప్ క్లాక్ విధానం శాశ్వతం కానుంది. శుక్రవారం జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో దీనిని ప్రవేశపెట్టాలని అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాది భారత్ లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఈ స్టాప్ క్లాక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇందులో మంచి ఫలితాలు రావడంతో 2024 లో దీనిని ప్రవేశపెట్టాలని ఐసీసీ అప్పట్లోనే నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఐసీసీ కి సమర్పించిన నివేదిక లో ఒక్కో మ్యాచ్ కు 20 నిమిషాలు ఆదా అయినట్లు తెలిపింది. దీంతో జూన్ 1 నుంచి జరగబోయే అన్ని వైట్ బాల్ క్రికెట్ లో ఈ స్టాప్ క్లాక్ విధానాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించుకుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
స్టాప్ క్లాక్ విధానం అంటే..
స్టాప్ క్లాక్ విధానం అంటే.. ఫీల్డింగ్ జట్టు ఓవర్ పూర్తి అయిన తరవాత 60 సెకన్ల లోపు కొత్త ఓవర్ ప్రారంభించాలి. ఇందుకోసం 60 నుంచి సున్న వరకూ లెక్కించే ఎలక్ట్రానిక్ గడియారం నేలపై కనిపిస్తుంది. ఈ నియమాన్ని అమలు చేసే బాధ్యత అంపైర్ లపై ఉంటుంది. థర్డ్ అంపైర్ టైమర్ ను ఆన్ చేస్తారు. ఒకవేళ ఫీల్డింగ్ జట్టు సమయంలోపు బంతి వేయకపోతే రెండు సార్లు హెచ్చరికలు జారీ చేస్తుంది. అయినప్పటికీ ఓవర్ ప్రారంభించకపోతే ప్రత్యర్థికి ఐదు పరుగుల పెనాల్టీ ఇస్తారు.
మినహాయింపులు
1. కొత్త బ్యాట్స్ మెన్ ఓవర్ల మధ్య క్రీజులోకి వచ్చినప్పుడు,
2. అధికారిక డ్రింక్స్ బ్రేక్
3. బ్యాట్స్ మెన్ లేదా ఫీల్డర్ కు గాయమైనప్పుడు మైదానంలో చికిత్స తీసుకుంటున్న సమయంలో
4. ఫీల్డింగ్ జట్టు వైపు ఏదైన పరిస్థితుల్లో సమయం కోల్పోతే..
ఇప్పటికే ఐసీసీ స్లో ఓవర్ రేట్ ను నియంత్రించడానికి పెనాల్టీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనిప్రకారం ఫీల్డింగ్ జట్టు నిర్ణిత సమయంలోపు ఓవర్ ప్రారంభించడంలో విఫలం అయితే 30 గజాల సర్కిల్ వెలుపల నుంచి ఒక ఫీల్డర్ ను వెనక్కి పిలుస్తారు. ఇది ఒక ఇన్సింగ్ ఆఖరి ఓవర్ మొదటి బాల్ వేసే సమయం వరకు ఆటను నియంత్రించడానికి తీసుకొచ్చిన నిబంధన. దీనిని అమలు చేసే బాధ్యత థర్డ్ అంపైర్ కు ఉంటుంది.
అసలు క్రికెట్ లో ఓవర్ రేట్ ఎంత?
ఓవర్ రేట్ అనేది ఒక గంట ఆటలో ఫీల్డింగ్ సైడ్ బౌలింగ్ చేసే సగటు ఓవర్ల సంఖ్య. ఐసీసీ రూల్స్ ప్రకారం టెస్ట్ క్రికెట్ లో సగటు ఓవర్ల రేటు గంటకు 15 ఓవర్లు, వన్డేల్లో 14.28 ఓవర్లు, టీ20 ల్లో 14.11 ఓవర్లు పడతాయి. ముఖ్యంగా వన్డేల్లో 50 ఓవర్ల కోటాను 3.5 గంటల్లో పూర్తి చేయాలి. టీ 20 ల్లో గంట ఇరవై అయిదు నిమిషాల్లో బౌలింగ్ పూర్తి చేయాలి. ఇరు జట్లు ఈ మార్క్ ను మించి ఫీల్డ్ లో ఉంటే స్లో ఓవర్ రేట్ ఉందని అర్థం. దాని ప్రకారం జరిమానా, నిషేధాలు ఉంటాయి.