ఆ పార్టీ గెలిస్తే ప్రతిపక్ష నేతలంతా జైల్లోనే: కేజ్రీవాల్
బీజేపీ అధికారంలోకి వస్తే.. బెంగాల్ సీఎం మమత, శివసేన (యూబీటీ) చీఫ్ ఠాక్రే, ఆర్జేడీ నేత తేజశ్వితో సహా ప్రతిపక్ష నేతలంతా జైల్లో ఉంటారని అన్నారు కేజ్రీవాల్.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తే.. బెంగాల్ సీఎం మమత, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌తో సహా ప్రతిపక్ష నేతలంతా జైల్లో ఉంటారని అన్నారు. మద్యం కుంభంకోణంతో ముడిపడిని మనీలాండరింగ్ కేసులో నిన్న మధ్యంతర బెయిల్ పొందిన కేజ్రీవాల్..రోజు కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
‘‘జైలు నుంచి విడుదయ్యాక నేను ఎన్నికల నిపుణులు, కొంతమంది ప్రజలతో మాట్లాడాను. వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే..బీజేపీ తిరిగి అధికారంలోని రాదని తెలుస్తుంది. ఇక కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ఆప్ భాగం అవుతుంది. ఇక మేం ఢిల్లీకి పూర్తి రాష్ట్ర స్థాయి హోదా పొందుతాం’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అమిత్ షా కోసమే..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోసం ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నేను బిజెపి నాయకులను అడుగుతున్నాను. వారి ప్రధాని అభ్యర్థి ఎవరని? వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోడీ జీ 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. 75 ఏళ్ల వయస్సు ఉన్నవారు పదవీ విరమణ చేస్తారని నియమం పెట్టారు. గతంలో ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ రిటైర్మెంట్ ప్రకటించారు.’’ అని కేజ్రీవాల్ గుర్తు చేశారు.
కేజ్రీవాల్ జైల్లో ఉండగానే ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తాను రాజీనామా చేయకపోవడంపై కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. ‘నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు.ఫేక్ కేసుతో రాజీనామా చేయించాలని కుట్ర పన్నారు. అందుకే సీఎం పీఠం నుంచి తప్పుకోలేదు.’’ అని పేర్కొన్నారు.
దొంగలు దోపిడీ దొంగలను చేర్చుకుంటున్నారని బీజేపీపై తీవ్ర స్థాయిలో కేజ్రీవాల్ విరుచుకుపడ్దారు. ప్రధాని అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం గురించి నేర్చుకోవాలనుకుంటే..తనను చూసి నేర్చుకోవాలన్నారు. అవినీతిపరుల విషయంలో ఎవరిని ఉపేక్షించమని, చివరకు తమ మంత్రులను సైతం జైలుకు పంపుతామన్నారు. తమ పార్టీ నలుగురు అగ్రనేతలను జైలుకు పంపి మోదీ లబ్ది పొందాలని చూశారని, కాని ఆయన ఆశించినంతగా ఏమి జరగలేదన్నారు కేజ్రీవాల్.