కోడికత్తి కేసు నిందితుని నిరవధిక దీక్ష ఎందుకు?
కోడికత్తి కేసులో నిందితునిగా ఉన్న శ్రీనివాస్ నిరాహారదీక్షకు దిగుతానంటున్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని లేదా సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలన్నది ఆయన డిమాండ్.
2019 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన 'కోడికత్తి' కేసు 2024 వచ్చినా ఇంతవరకు కొలిక్కిరాలేదు. నిందితుడికి బెయిల్ రాలేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య వాదోపవాదాలు ఆగలేదు. జగన్ పై దాడి అంటూ అప్పట్లో వైసీపీ నాయకత్వం సహా రాష్ట్రప్రజలందరూ భావించారు. కోడికత్తి కేసు అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసి ఆ మాటే జనం నోళ్లలో నానేలా చేసింది. ఆ కేసులో నిందితుడు శ్రీనివాస్‌కి బెయిల్ రాకపోవడం, ఇప్పటి వరకు శిక్ష ఖరారు కాకపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. విశాఖపట్నం విమానాశ్రయంలో 2019 నవంబర్‌లో వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి జరగడం, ఆ కేసును NIAకి అప్పగించడం జరిగింది.
నిరవధిక నిరాహార దీక్ష చేస్తా..
కోడికత్తి కేసులో నిందితునిగా ఉన్న శ్రీనివాస్ నిరాహారదీక్షకు దిగుతానంటున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీనివాస్ నిరాహార దీక్ష చేయనున్నారు. కోడికత్తి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని లేదా సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. ఈ డిమాండ్‌కు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా మద్దతు పలికారు. శ్రీనివాస్‌కు మద్దతుగా విజయవాడలో రేపట్నుంచి నిరవధిక దీక్షకు దిగుతామని ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు.
జగన్‌కు సావిత్రమ్మ మొర...
'సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. అప్పుడైనా మా అబ్బాయికి బెయిల్ వస్తుందేమో' అన్నారు కోడికత్తి కేసులో నిందితునిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ. 'ఐదేళ్లుగా తన కొడుకు జైల్లో మగ్గుతున్నాడు. సీఎం జగన్ సాక్ష్యం చెప్పకపోతే కనీసం ఎన్‌వోసీ ఇచ్చి కేసును వాపస్ చేసుకోవాలని ప్రార్ధిస్తున్నా' అని సావిత్రమ్మ ఇవాళ విజయవాడ ప్రెస్‌క్లబ్ వద్ద వాపోయారు. జైలులో ఉన్న తన కుమారుని పరిస్థితి బాగోలేదని ఆమె చెబుతున్నా పోలీసులు మాత్రం అంతా బాగానే ఉందని, ఆయనకు ఏదైనా కావాల్సి వస్తే అందించడానికి సిద్ధంగా ఉన్నామని జైళ్ల అధికారులు చెబుతున్నారు. ఏ తల్లికైనా చేతికొచ్చిన కొడుకు జైలు పాలైతే ఎంతటి క్షోభను అనుభవించాల్సి వస్తోందో ఊహించవచ్చు. తన కుమారుడు శ్రీనివాస్‌కి బెయిల్ ఇప్పించమని సావిత్రమ్మ.. కనబడిన ప్రతి ఒక్కర్నీ వేడుకుంటున్న తీరు హృదయ విదారకంగా ఉంది. కొడుక్కి బెయిల్ రాకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని కూడా ఆమె చెబుతున్నారు.
నిందితుడి సోదరుడు సుబ్బరాజు, తల్లి సావిత్రమ్మ,
జగన్ లబ్ధిపొందారా?
'నా సోదరుడిని అడ్డుపెట్టుకొని జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందారు. ముఖ్యమంత్రి సీఎం అయ్యారు' అంటున్నారు నిందితుడు శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు. దళితుడైన తన సోదరుడికి ఐదేళ్లుగా అన్యాయం జరుగుతోందన్న ఆక్రోశంలో సుబ్బరాజు ఈ మాటలని ఉండవచ్చు. నా సోదరుడిని జైలు నుంచి విడుదల చేయకుంటే తాము కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్నారు సుబ్బరాజు. మరో అడుగుముందుకేసి తన తమ్ముడికి ఏం జరిగినా అందుకు కారణం సీఎం జగనే అంటున్నారు. నిందితుడు దళితుడు కాబట్టే ఇప్పటివరకు న్యాయం జరగలేదని అతడి సోదరుడు సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యం చెప్పేందుకు సీఎం జగన్ కోర్టుకు రావడం లేదన్నారు. ‘‘సీఎం మా జిల్లాకు వస్తే ఒక రోజు ముందే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. శ్రీను ఫోన్ చేసి జైలులో నిరాహారదీక్ష చేపడుతున్నట్లు చెప్పాడు. మా కుటుంబం కూడా విజయవాడలో దీక్ష చేపడుతుంది. గురువారం దుర్గమ్మ దర్శనం చేసుకుని దీక్షకు కూర్చుంటాం’’ అని చెప్పారు సుబ్బరాజు.
ఎందుకిలా జరుగుతోంది?
జగన్ పై దాడి జరిగింది వాస్తవం. ఆయనకు గాయం కావడం, చొక్కాకు రక్తపు మరక అంటుకోవడం నిజం. దాడి చేసిన జనపల్లి శ్రీనివాసరావు కూడా దాన్ని ఒప్పుకున్నారు. కానీ కేసు మాత్రం ఎడతెగకుండా సాగిపోతోంది. ఇప్పటికీ ఇంకా అది ఓ కొలిక్కి రాలేదు. కోడికత్తి దాడిలో కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని ఈ నెల 10న జగన్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ NIA లోతైన దర్యాప్తు అవసరం లేదని చెప్పింది. ఆ పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ క్రమంలోనే గతంలో NIA కి నిందితుడు శ్రీనినాసరావు ఇచ్చిన వాంగ్మూలం బయటకు వచ్చింది. జగన్ కి మేలు చేసేందుకే తాను ఆ పని చేసినట్టు శ్రీనివాసరావు NIA కి వాంగ్మూలం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో కుట్రకోణం లేదని NIA తేల్చి చెప్పడం కూడా విశేషం. ఒకరకంగా ఇది జగన్ కి, వైసీపీకి ఇబ్బందికర పరిణామమే. కోడికత్తిని సింపతీకోసం వాడుకున్నారని ఇప్పుడు టీడీపీ విమర్శల డోసు పెంచింది. కోడికత్తి కేసులో నిందితుడికి శిక్ష ఎప్పుడు వేస్తారనేది తేలాల్సి ఉంది. ఈలోగా దీనిపై రాజకీయ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో కోడికత్తి వ్యవహారం హైలెట్. 2024 ఏపీ ఎన్నికల్లో కూడా కోడికత్తి రాజకీయ అంశంగా మారే అవకాశముంది.