‘రాజ్ కోట్’ టెస్ట్ లో ఇంగ్లండ్ ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్

ఇక ముందు ఇంగ్లండ్, భారత్ లో బజ్ బాల్ వ్యూహాన్ని మార్చుకుంటుంది కావచ్చు. ఎందుకంటే రాజ్ కోట్ టెస్ట్ లో భారత్, ఇంగ్లండ్ టీమ్ కు అంతలా షాకిచ్చింది.

Update: 2024-02-18 12:51 GMT

కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి వైదొలిగాడు. షమీకి గాయం, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న శ్రేయస్.. దీనికి తోడు హైదరాబాద్ టెస్ట్ లో అనూహ్యంగా ఓటమి. విశాఖ టెస్ట్ లో బ్యాటింగ్ లో యశస్వి, బౌలింగ్ లో భూమ్రా లేకపోతే ఇండియా పని అవుట్ అయ్యేది. మూడో టెస్ట్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ ఆటగాళ్లు మరోసారి దుబాయ్ వెళ్లారు. నిజానికి సేదతీరారా లేక మరోసారి అక్కడి ఐసీసీ ట్రాక్ పై సాధన చేశారో తెలియదు.

ఈ నేపథ్యంలో రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం. అభిమానుల గుండెల్లో ఒక రకమైన దడ. అనుకున్నట్లు గానే మ్యాచ్ ప్రారంభం లోనే టపా టపా మూడు వికెట్లు.. ఇంకేం ఉంది. భారత్ ఈ మ్యాచ్ లో ఎంత తేడా తో ఓడిపోతుందో అన్న లెక్కలు మొదలయ్యాయి.

కానీ అందరీ అంచనాలు తలకిందులు చేసి రాజ్ కోట్ టెస్ట్ లో  టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. మొదటి ఇన్సింగ్స్ లో కెప్టెన్ రోహిత్, జడేజా కీలక సెంచరీల తో జట్టును నిలబెట్టగా తరువాత బౌలర్లు కాస్త పట్టు తప్పిన కీలక సమయంలో రాణించి ప్రత్యర్థిని కట్టడి చేశారు. రెండో ఇన్సింగ్స్ లో యువ భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. దాంతో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం సాధించింది. ప్రత్యర్థి ని ఏకంగా 434 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సిరీస్ లో 2-1 తో అధిక్యంలో నిలిచింది.

ఇంతకుముందు భారత్, న్యూజిలాండ్ పై 2021 లో 372 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయంగా ఉండేది. తాజాగా రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ 434 పరుగుల తేడాతో మట్టికరిపించడంతో పాత రికార్డ్ తెరమరుగైంది.

నాలుగో రోజు ఉదయం ఆట ప్రారంభం కాగానే భారత్ నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించింది. నైట్ వాచ్ మెన్ కుల్దీప్ యాదవ్, శుభ్ మన్ గిల్ నిదానంగా ఆడారు. తరువాత గిల్, కుల్దీప్ కారణంగా సమన్వయ లోపంతో సెంచరీ ముందు రనౌట్ గా వెనుదిరిగాడు. తరువాత కొద్దిసేపటికే కుల్దీప్ సైతం 27 పరుగులు చేసి వెనుదిరిగాడు.

అనంతరం జైశ్వాల్- సర్పరాజ్ జోడి ఇంగ్లండ్ ఆడే బజ్ బాల్ వ్యూహాన్ని వారిపైనే ప్రయోగించారు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదీ ఇంగ్లండ్ లైనప్ ను కకావికలు చేశారు. ఈ నేపథ్యంలో యశస్వీ తన కెరీలో రెండో డబుల్ సెంచరీ బాదేశాడు. ఇందులో ఏకంగా 12 సిక్స్ లు ఉండడం విశేషం. సర్పరాజ్ ఖాన్ కూడా రెండో ఇన్సింగ్స్ లో హఫ్ సెంచరీ సాధించాడు. భారత్ ఆధిక్యం 550 దాటగానే కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లెర్ చేశారు. అప్పుడు జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 445 పరుగులు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ..

ఎదుట కొండంత లక్ష్యం.. ఇప్పటి వరకూ భారత్ లో నే కాదు.. టెస్ట్ క్రికెట్ లోనే ఇంతటి లక్ష్యాన్ని ఎవరూ చేధించలేరు. కానీ బజ్ బాల్ వ్యూహంతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్న ఇంగ్లండ్.. కనీసం గౌరవప్రదంగా అయినా పోరాడి డ్రా చేసుకుంటుందని, అందరూ అనుకున్నారు.

కానీ ఆ జట్టు ఏ దశలోనూ పోరాడటం సరికదా.. క్రీజులో నిలదొక్కు కోవడానికి కూడా బ్యాట్స్ మెన్ ఇంట్రెస్ట్ చూపలేదు. నేను ముందంటే..నేను ముందని బ్యాట్స్ మెన్ పెవిలియన్ కి క్యూ కట్టారు. ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ 33 మినహ ఎవరూ 20 పరుగులు చేయలేదు. 39.4 ఓవర్లలోనే 122 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల లో రవీంద్ర జడేజా 5/41 తో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. కుల్దీప్ రెండు వికెట్లు సాధించాడు. కాగా అశ్విన్ తిరిగి జట్టుతో జాయిన్ అయ్యాడు. ఫిబ్రవరి 23న రాంఛీ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది.

Tags:    

Similar News