ఎయిడ్స్ ఉన్నా, 65 ఏళ్లు దాటినా ఆరోగ్య బీమా ఇవ్వాల్సిందే!

బీమా పాలసీ విషయంలో ఐఆర్డీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఐఆర్డీఏఐ తెచ్చిన మార్పులేంటంటే..

Update: 2024-04-22 05:27 GMT

వైద్యం బాగా ఖరీదైన నేపథ్యంలో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. వయసు మీరిన వారికి అంటే 65 ఏళ్లు దాటిన వారికి కూడా ఆరోగ్య బీమాను కల్పించారు. ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ శ్రీకారం చుట్టింది. 65 ఏళ్ల నిబంధనను ఐఆర్డీఏఐ తొలగించింది. ఆరోగ్య బీమా పాలసీ కొత్తగా కొనుగోలు చేసేందుకు, ఇప్పటివరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేసింది.

దీంతో ఇకపై ఏ వయసువారైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయంతో ఆరోగ్య సంరక్షణ వ్యయాల నుంచి పాలసీదార్లకు రక్షణ లభిస్తుంది. బీమా మార్కెట్‌ విస్తరిస్తుందని ఐఆర్‌డీఏఐ భావిస్తోంది. ‘అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమా పాలసీలను కంపెనీలు తీసుకురావాలి. వయోవృద్ధులు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణీలు, ఇతర వర్గాల వారి కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలను రూపొందించాలి’ అని ఐఆర్‌డీఏఐ తన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. క్యాన్సర్, ఎయిడ్స్ సహా అన్నిరకాల దీర్ఘకాలిక వ్యాధులున్నా ఆరోగ్య బీమా తీసుకోవచ్చనని ప్రకటించింది.

ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారికీ, ఆరోగ్య బీమా పాలసీలను అందించాలని సంస్థలను ఆదేశించింది. క్యాన్సర్‌, గుండె జబ్బు, ఎయిడ్స్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్నారనే సాకుతో ఆరోగ్య బీమా పాలసీలను నిరాకరించడం ఇక కంపెనీలకు కుదరదు. పాలసీదార్ల సౌకర్యార్థం బీమా ప్రీమియం మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించేందుకు కంపెనీలు అనుమతి ఇవ్వొచ్చు. ప్రయాణ పాలసీలను సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు మాత్రమే అందించాలి.

ఆయుష్‌ చికిత్స కవరేజీకి పరిమితి లేదు. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి చికిత్సలకు కూడా బీమా మొత్తం లభిస్తుంది. స్పాన్సర్డ్ పాలసీలు కలిగిన పాలసీదార్లు పలు సంస్థల వద్ద క్లెయిమ్‌లు దాఖలు చేసుకోవచ్చు. వయోవృద్ధుల క్లెయిమ్‌లు, ఫిర్యాదులను ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటవుతుంది. నూతన విధానంలోని ముఖ్యాంశాలు... వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ అలివిమాలిన వైద్య ఖర్చుల నుంచి రక్షణ కల్పించడం ఈ విధానంలోని ముఖ్య లక్ష్యం.

గతంలో ఉన్న 65 ఏళ్ల నిబంధన తొలగింపు

బీమా సంస్థలు తప్పనిసరిగా అన్ని వయసుల వారికి ప్లాన్‌లను అందించాలి. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా బీమా సంస్థలు కవర్ చేయాలి. ఆయుర్వేదం, యోగా, ఆయుష్ చికిత్సలను కవర్ చేయడానికి ఎటువంటి పరిమితులు లేవు. కొత్త రెగ్యులేషన్ ప్రకారం సీనియర్ సిటిజన్ల ఫిర్యాదులు, క్లెయిమ్‌ల పరిష్కారానికి ప్రత్యేక ఛానెల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ కొత్త విధానం 65 ఏళ్లు దాటిన వారికి బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు బీమా వ్యాపారంలో ఉన్న నరసింహారావు యడ్ల. ఇప్పటి వరకు వృద్ధులకు బీమా పాలసీలు అమ్మాలంటే చాలా కంపెనీలు ముందుకు వచ్చేవి కావని, ఒకవేళ ఇచ్చినా చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేవని, ఈ నిబంధన తొలగింపుతో చాలా మేలు జరుగుతుందని అన్నారు నరసింహారావు.

Tags:    

Similar News