బెయిల్‌ రావడానికి ఐదేళ్లు

2018 అక్టోబర్‌ 15.. 2024 ఫిబ్రవరి 8.. ఈ రెండు తేదీల మధ్య కాలం 5 ఏళ్ల 1 నెలా 2 రోజులు.. అంటే దాదాపు 1857 రోజులు. ఓ హైప్రొఫైల్‌ హత్యాయత్నం కేసులో నిందితునికి బెయిల్‌ దక్కడానికి పట్టిన కాలం ఇది.

Update: 2024-02-08 12:19 GMT

2018 అక్టోబర్‌ 15.. 2024 ఫిబ్రవరి 8.. ఈ రెండు తేదీల మధ్య కాలం 5 ఏళ్ల 1 నెలా 2 రోజులు.. అంటే దాదాపు 1857 రోజులు. ఓ హైప్రొఫైల్‌ హత్యాయత్నం కేసులో నిందితునికి బెయిల్‌ దక్కడానికి పట్టిన కాలం ఇది. 2018 అక్టోబర్‌ 15 గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయనగరం జిల్లాలో పాదయాత్ర ముగించి విశాఖపట్నం విమానాశ్రయానికి మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత వైఎస్‌ జగన్‌ వెళతారు. సీబీఐ కేసులకు సంబంధించి హైదరాబాద్‌ కోర్టులో హాజరయ్యేందుకు పాదయాత్ర ముగించుకుని విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌పై మధ్యాహ్నం వేళ దాడి జరిగింది. ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో పనిచేస్తున్న శీను.. వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే నెపంతో జగన్‌పై దాడి చేశాడని దర్యాప్తులో తేలింది. అక్కడి భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి... శీనును అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిన జగన్... సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ దాడిలో జగన్‌ మెడకు గాయమవుతుంది. రక్తం కారుతుంది. ఆ కేసే కోడికత్తి కేసుగా పేరుగాంచింది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామం. ఆరోజు అరెస్ట్‌ అయిన జనిపల్లి శ్రీనివాస్‌ ఆ తర్వాత కాలంలో కోడికత్తి శ్రీనుగా పేరుమోశారు.

బెయిల్‌ రావడానికి ఐదేళ్లు...

కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్‌కు ఐదేళ్ల తర్వాత బెయిల్‌ లభించింది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను శ్రీనుకు మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని ఆదేశించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని శ్రీనివాస్‌ను ఆదేశించింది.

2018 అక్టోబర్‌ 25న అరెస్ట్‌..

2018 అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై దాడి కేసులో శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్దిరోజుల కిందట ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని.. దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సామాన్యుడే సమిధ?

అధికార పీఠం దక్కించుకునే కుట్రపూరిత ప్రణాళికలో సామాన్యుడే సమిధ అనే విషయం చరిత్ర చెప్తోంది. అదే విషయాన్ని వర్తమానంలోనూ పలు సందర్భాలు రుజువు చేస్తున్నాయి. తమ నాయకుడు సీఎం కావాలన్న వెర్రి అభిమానం, తానొకటి తలిస్తే, దైవం మరోటి తలచినట్లు కథ అడ్డం తిరిగింది. ఐదేళ్లు ఊచల వెనక్కి నెట్టింది. ఇంటికి దూరమై, నా అనే వాళ్లకు కొండంత దుఃఖాన్ని మిగిల్చింది.

కోడికత్తి కేసుగా పేరొందిన ఈ రాజకీయ చదరంగంలో బలమైన ప్రత్యర్థులకు చెక్​పెట్టే క్రమంలో పావుగా మారిన దళిత బిడ్డ జనుపల్లి శ్రీనివాసరావు కథ తుది అంకానికి చేరింది. ఎట్టకేలకు పోరాటం ఫలించింది. ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది. వృద్ధులైన తల్లిదండ్రులు, తన సోదరుడి ఎదురుచూపులు ఫలించాయి. ఓ వైపు న్యాయవాదుల పోరాటం, ప్రజా సంఘాల సహకారం వెరసి న్యాయదేవత దిగివచ్చింది. శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైంది.

ఆనాడు ఈకేసు ఓ సంచలనం...

ఏపీ ఎన్నికలకు కొన్నినెలల ముందు జరిగిన ఆ దాడి రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఐదేళ్ల నుంచి శీను జైల్లోనే ఉంటున్నాడు. విశాఖపట్టణంతో పాటు విజయవాడ NIA కోర్టు, ఏపీ హైకోర్టుల్లో ఈ కేసుపై విచారణ జరిగింది. శీను బెయిల్ పిటిషన్ పలుమార్లు తిరస్కరణకు గురయింది. చివరకు ఇవాళ ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌరసంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. శీనును బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు కొన్నేళ్లగా ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌కు అభ్యంతరం లేదని NOC ఇవ్వమని కోరుతూ శీను తల్లిదండ్రులు జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కేసులో ఐదేళ్లపాటు జైల్లో ఉన్న శ్రీనివాస్‌కు ఇప్పుడు బెయిల్ మంజూరయింది.

ఐదేళ్ల కాలంలో అనేక మలుపులు...

ఐదేళ్ల కాలంలో కోడికత్తి కేసు అనేక మలుపులు తిరిగింది. కేసుపై మొదట విజయవాడ NIA కోర్టులో విచారణ జరిగింది. NIA.. విజయవాడ NIA కోర్టులో గత ఏడాది చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చింది. దీనిని సవాల్ చేస్తూ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. మరింత లోతయిన దర్యాప్తు జరిపించాలని కోరారు. గత ఏడాది విచారణ విశాఖ NIA కోర్టుకు బదిలీ అయింది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శీను NIA కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను విశాఖ NIA కోర్టు తోసిపుచ్చింది. దీంతో శీను ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు. పిటిషన్ విచారణ పలుమార్లు వాయిదాపడి చివరకు ఇవాళ బెయిల్ లభించింది.

ఎన్‌ఐఎకి బదిలీ...

దాడి జరిగిన వెంటనే శీనును భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 2019 జనవరిలో ఈ కేసును NIAకి బదిలీ అయింది. ఏపీ ఎన్నికలు పూర్తయిన కొన్నిరోజులకే 2019 మే 28న శీనుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ రద్దు చేయాలని కోరుతూ NIA కోరడంతో శీను బెయిల్ రద్దయింది. రెండు నెలల తర్వాత 2019 ఆగస్టులో శీను మళ్లీ జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి గత ఏడాది ఆగస్టు వరకు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు శీను. 2023 సెప్టెంబరు 6న శీనును విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ఢిల్లీలో ధర్నా చేసిన శ్రీనివాస్‌ కుటుంబం...

కోడికత్తి కేసులో న్యాయం చేయాలని కోరుతూ శ్రీనివాసరావు తల్లి, ప్రజాసంఘాలు ఢిల్లీలోని ఏపీ భవన్​లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. శ్రీనుకు మద్దతుగా పలు ప్రజాసంఘాల నాయకులు, సమతా సైనిక్‌ దళ్‌, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నిరసనలో పాల్గొన్నాయి.

కేసు మొత్తం కొట్టేయాలి...

"నా కుమారుడికి బెయిల్‌ రావడం సంతోషంగా ఉందని" శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా నా కుమారుడి పరిస్థితి చూసి బాధపడని రోజంటూ లేదని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమైంది. 'నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు.. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. జైలులో నా కుమారుడి ఆరోగ్యం పాడైపోయింది' అంటూ సావిత్రి వాపోయారు. ఇప్పటికైనా జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని నిందితుడి సోదరుడు సుబ్బరాజు పేర్కొన్నారు. కేసు మొత్తం కొట్టేస్తేనే న్యాయం జరిగినట్లుగా భావిస్తామని చెప్తూ.. నా తమ్ముడు హత్యా ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు.


హర్షాతిరేకాలు...

నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌ రావడంపై దళిత, పౌరసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇప్పటికైనా సీఎం జగన్‌ కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీనివాస్‌ను ఐదేళ్లు జైలులో మగ్గిపోయేలా చేసిందని మాజీ ఎంపీ హర్షకుమార్‌ మండిపడ్డారు.

టీడీపీ అచ్చెన్నాయుడు ఏమన్నారంటే...

కోడి కత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ రావటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దళిత బిడ్డ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారని, కోడి కత్తి కేసు ద్వారా జగన్ అబద్దాలతో లబ్ధి పొంది సీఎం అయ్యారని విమర్శించారు. శ్రీనుకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వటాన్ని తెలుగుదేశం స్వాగతిస్తోందన్నారు అచ్చెన్నాయుడు.

ఈ కేసుకు సంబంధించి శ్రీను కుటుంబసభ్యులు అనేకమార్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జైలులోనే దీక్ష చేశాడు. ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు జైలులోని అతనికి చికిత్సను అందించే ఏర్పాట్లు చేశారు. మరోవైపు కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు సైతం నిరాహార దీక్ష చేశారు. న్యాయం కోసం ఎంతగానో పోరాడారు.

Tags:    

Similar News