‘‘బీజేపీ హటావో..బేటీ బచావో’’ అన్నదెవరు?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Update: 2024-03-08 09:23 GMT

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా (మార్చి 8) మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రధాని మోదీ మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదు ? మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తుంది.

అంతకుమించి ఆశించడం లేదు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు గౌరవప్రదంగా నివాళులు అర్పించడం కంటే ప్రధాని ఇంకా ఏదో ఎక్కువ చేస్తారని తాము ఊహించడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు.


'మణిపూర్‌లో డబుల్ అన్యాయ్ పాలన'

మణిపూర్‌లో ఏడాదికాలంగా అల్లర్లు కొనసాగుతున్నాయి. డబుల్ ఇంజన్ బిజెపి పాలనలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. నగ్నంగా ఊరేగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయినప్పటికీ మణిపూర్‌ను ఎందుకు సందర్శించరు? ఎందుకు పట్టించుకోలేదు? ”అని మోదీని ప్రశ్నించారు జైరాం.

మహిళా రేజ్లర్ల ఆరోపణలు..

బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన తీవ్ర ఆరోపణలపై ప్రధాని మౌనంగా ఉండడానికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను మోదీ “మోదీ కా పరివార్” సభ్యుడిగా భావిస్తున్నారా? అని జైరాం ప్రశ్నించారు.

ధరల పెరుగుదల.. సామూహిక నిరుద్యోగం

నిత్యావసర వస్తువుల ధరల, నిరుద్యోగ సమస్యకు మోదీ పాలనే కారణమని జైరాం ఆరోపించారు. ధరల నియంత్రణకు ప్రధాన మంత్రి దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించారు. సామూహిక నిరుద్యోగ సంక్షోభం "అన్యాయ్ కాల్" ముఖ్య లక్షణం అని పేర్కొన్నారు. పురుషులతో పోలిస్తే 20% కంటే తక్కువ మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని, ఫలితంగా ఉద్యోగాల కోసం వెతుకుతున్న మహిళలు నిరుత్సాహానికి గురవుతున్నారని, చివరికి శ్రామిక శక్తిని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం కంటే ఇప్పుడు శ్రామిక శక్తిలో మహిళల శాతం 20 శాతం తక్కువగా ఉందని, ఇది ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని రమేష్ అభిప్రాయపడ్డారు. మహిళలను మళ్లీ ఆర్థిక స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రధాని వద్ద పరిష్కారం ఉందా? అని ప్రశ్నించారు.

ప్రకటనల కోసమే..

2014లో ప్రధానమంత్రి "బేటీ బచావో బేటీ పఢావో" పథకాన్ని చాలా ఉత్సాహంగా ప్రారంభించారని రమేష్ అన్నారు. అయితే, వాస్తవానికి ఈ పథకం బడ్జెట్‌లో దాదాపు 80% నిధులు ప్రకటనలకే వెచ్చిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఆడశిశువుల హత్యలను అరికట్టడానికి, మహిళా విద్యను ప్రోత్సహించడానికి ప్రధాని కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించారు. భారతదేశ మహిళలు మోదీ సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. బీజేపీని తరిమికొట్టండి, మీ కూతుర్ని కాపాడుకోండి! అని కోట్ చేస్తూ రమేష్ తన పోస్టును ముగించారు.  

Tags:    

Similar News