కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదా?

కర్ణాటకలోని 7 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ మిగిలిన 21 స్థానాలకు ఎంపిక చేయడంలో ఇబ్బందులు పడుతోంది.

Update: 2024-03-18 15:56 GMT

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎన్నికల తేదీని ప్రకటించింది. ఇక పార్టీలు అభ్యర్థులకు ప్రకటించడమే తరువాయి అనుకున్నాం. కర్ణాటకలో హోరాహోరీగా తలపడే రెండు పార్టీలో ఒకటైన బీజేపీ ఇప్పటికే 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. కాని కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది. ఆ పార్టీ ఇప్పటికి ఏడు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఎందుకు జాప్యం..

కొంతమంది మంత్రులు, శాసనసభ్యులు ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకాడుతున్నారు. ఫలితంగా తగిన అభ్యర్థులను వెతకడం కాంగ్రెస్ పార్టీకి కష్టమవుతోంది. ఏడుగురు అభ్యర్థులను ప్రకటించి పది రోజులు గడుస్తున్నా.. మిగిలిన 21 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నారు.

కాగా అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారానికి మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రకటించే అవకాశం ఉంది.

కేబినెట్ మంత్రులను రంగంలోకి దింపాలన్న ఆలోచన పార్టీకి ఉన్నందున అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ఏడెనిమిది మంది మంత్రులను రంగంలోకి దింపేందుకు పార్టీలో చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, హోంమంత్రి జి పరమేశ్వర్ ఇటీవల చెప్పారు.

ఎవరా మంత్రులు?

కోలార్‌ నుంచి కేహెచ్‌ మునియప్ప, చామరాజనగర్‌ నుంచి హెచ్‌సీ మహదేవప్ప, బళ్లారి నుంచి బీ నాగేంద్ర, బెలగావి నుంచి సతీష్‌ జార్కిహోళి, బీదర్‌ నుంచి ఈశ్వర్‌ ఖండ్రే, బెంగళూరు నార్త్‌ నుంచి కృష్ణ బైరేగౌడ, రామలింగారెడ్డి (బెంగళూరు సౌత్‌), బీజెడ్‌ల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మంత్రులు ఈ ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

బరిలోకి..కొడుకులు, కూతుర్లు..

మంత్రులెవరూ పార్లమెంటుకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, మంత్రి పదవిని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.

కొంతమంది మంత్రులు తాము స్వయంగా బరిలో దిగకుండా, తమ కుటుంబ సభ్యులను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌లో వంశపారంపర్య రాజకీయాలు కొనసాగించడంపై పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతోంది.

తమ కుటుంబ సభ్యులకు ఎలాగయినా గెలిపించుకుంటామని మంత్రులు పార్టీలు అగ్రనేతలకు హామీ ఇస్తున్నారని సమాచారం.

2019లో బెంగళూరు నార్త్‌ నుంచి, 2009లో బెంగళూరు సౌత్‌ నుంచి ఓడిపోయిన కృష్ణ బైరేగౌడ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని హైకమాండ్‌కు చెప్పారు. హెచ్‌సీ మహదేవప్ప తన కుమారుడు సునీల్‌బోస్‌ను చామరాజనగర స్థానం నుంచి పోటీకి దింపాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. మరో మంత్రి కేహెచ్‌ మునియప్ప కోలార్‌ సీటుకు తన అల్లుడు శశిధర్‌ జేఈ పేరును ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

రామలింగారెడ్డి తన కుమార్తె సౌమ్యా రెడ్డిని బెంగళూరు సౌత్ సీటుకు సిఫారసు చేస్తున్నారు. జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సౌమ్యారెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి చేతిలో ఓడిపోయారు. బెలగావి, చికోడి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల చుట్టూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. చిక్కోడి నియోజకవర్గం నుంచి తన కూతురు ప్రియాంక జార్కిహోళిని పోటీకి నిలపాలని ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి ప్రయత్నాలు చేస్తున్నారు.

కలబురగి స్థానం నుంచి మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని పోటీకి దింపడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇద్దరూ కలబురగి సీటుపై ఆసక్తి కనపరుస్తున్నారు.

మంత్రులు దూరం..

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యులు నిర్ణయించారు. దాంతో బీజేపీ అభ్యర్థులపై పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులను వెతకడంపై దృష్టి సారించారు. "సాధకబాధకాలను పరిశీలించిన తర్వాత, మంత్రులను రంగంలోకి దింపకుండా పార్టీ నిర్ణయం తీసుకుంది" అని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఒకరు తెలిపారు. సర్వే ఫలితాలు ఎలా ఉన్నా.. డికె శివకుమార్ వంటి నాయకులు కలబురగి సీటుతో 20 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు.

20 స్థానాలు మావే..

ఈసారి కర్ణాటకలో 20 సీట్లు గెలుస్తామని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మార్చి 17 ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మోదీ నాయకత్వంలో భాజపా విసురుతున్న సవాల్‌ను ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. బుధవారం నాటికి పార్టీ రెండో జాబితాను ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు.

రేపు ఢిల్లీలో సమావేశం..

పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం మంగళవారం ఢిల్లీలో జరగనుంది. మిగిలిన 21 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కర్ణాటకలో ప్రధాని మోదీ ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించినందున..కాంగ్రెస్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది.

నేతలకు బాధ్యతలు..

14 జిల్లాల్లో నేతల ప్రచార యాత్రలు, ఇతర వ్యవహారాల నిర్వహణ బాధ్యతలను రాజ్యసభ సభ్యులు జిసి చంద్రశేఖర్‌, సిఎం ఆర్థిక సలహాదారు బసవరాజ్‌ రాయరెడ్డికి శివకుమార్‌ అప్పగించారు. ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్న దక్షిణ కర్ణాటకలోని 14 జిల్లాలకు చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించగా, మే 7న ఎన్నికలు జరగనున్న 14 జిల్లాల బాధ్యతలను రాయరెడ్డి చూసుకుంటారు.

Tags:    

Similar News