కర్ణాటకలో కరువు పరిహారం పంపిణీ

కరువు పరిహారం కింద 16 లక్షల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు రూ. 3,000 చొప్పున పరిహారం చెల్లించ నున్నట్లు కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు.

Update: 2024-05-10 07:41 GMT

కరువు పరిహారం కింద 16 లక్షల చిన్న, సన్నకారు రైతు ఒక్కో కుటుంబానికి రూ. 3,000 చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత, SDRF, NDRF నుంచి మరికొంత డబ్బు నష్టపోయిన రైతు కుటుంబాలకు అందుతోందని చెప్పారు. నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 3వేలు జమ చేస్తామని, అందరి ఖాతాల్లో డబ్బు జమ కావడానికి సుమారు 20 రోజుల సమయం పడుతుందన్నారు.

కర్ణాటకలోని 240 తాలూకాల్లో 223 కరువు పీడిత ప్రాంతాలుగా, అందులో 196 తీవ్ర ప్రభావిత తాలుకాలుగా గుర్తించిన విషయం తెలిసిందే.

న్యాయపోరాటంతోనే..

సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసిన తర్వాత ఇప్పటివరకు సుమారు రూ. 3,454 కోట్లు (కేంద్రం నుంచి) కరువు సాయంగా వచ్చిందని మంత్రి చెప్పారు. ఈ డబ్బును ప్రభుత్వం గత సోమవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించిందని చెప్పారు. మొదటి, రెండో విడల్లో ఇప్పటి వరకు రూ. 3వేల కోట్లను డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామని వివరించారు. సాంకేతిక సమస్య కారణంగా రెండో విడతలో దాదాపు 1.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమకాలేదని, దాన్ని త్వరలో క్లియర్ చేస్తామన్నారు. కరువు పరిహారం కిందకు రాని పంటలు వేసి నష్టపోయిన రైతులను కూడా ఆదుకోనున్నట్లు మంత్రి తెలిపారు. అలాంటి వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారని, వారికి రూ. 400 నుంచి 500 కోట్లు కేటాయించామని చెప్పారు.

తాగునీటి కొరత గురించి మంత్రి మాట్లాడుతూ.. 270 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా, 594 గ్రామాలకు ప్రైవేటు బోర్‌వెల్‌ల ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 150 వార్డులకు ట్యాంకర్ల ద్వారా, 29 వార్డుల్లో ప్రైవేట్‌ బోర్‌వెల్‌ల ద్వారా సరఫరా జరుగుతుందని వివరించారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని నివేదికలు చెబుతున్నాయని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌడ చెప్పారు.

ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పిడుగుపాటుకు 17 మంది చనిపోయారు. గతేడాది 68 చనిపోయారు. పిడుగుపాటు నివారణ చర్యలను కూడా రూపొందించామని, అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాన్ని అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు.  

Tags:    

Similar News