నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
By : The Federal
Update: 2024-05-11 06:03 GMT
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటీషన్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది. ఆ మరుసటి రోజే (జూన్ 2న) తీహార్ జైలుకు వెళ్లి లొంగిపోవాలని ఆదేశించింది.
దాంతో శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఢిల్లీలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి దక్షిణ ఢిల్లీలో జరిగే రోడ్‌షోలో మాట్లాడారని తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సాహి రామ్ పహల్వాన్ పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం ప్రకారం.. ఢిల్లీలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్, మిగిలిన నాలుగు స్థానాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.