ప్రధాని అభ్యర్థిపై ఖర్గే విముఖత..కారణాలివే..
లోక్‌సభ ఎన్నికల ప్రస్తావన అటుంచితే.. ఇప్పుడంతా చర్చించుకుంటున్నది ఇండియా కూటమి తరుపున పీఎం అభ్యర్థి ఎవరన్న దానిపైనే..
ఇండియా కూటమి ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమైంది. అయితే ఏ సమావేశంలోనూ కూటమి తరుపున పీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై ఎక్కడా చర్చకు రాలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కూటమి సమావేశంలో ఖర్గే పేరు ప్రస్తావనకు వచ్చింది. గత రెండ్రోజులుగా ఇదే విషయంపై కొన్ని పత్రికలు ఫోకస్ చేశాయి. అయితే సమావేశంలో పాల్గొన్న కొందరు ఆ అంశంపై పెద్దగా చర్చ జరగలేదంటున్నారు.
పీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై సమావేశంలో కేవలం 15 నిముషాలే చర్చ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.
‘‘సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై అంత పెద్ద చర్చేమీ జరగలేదు. ముందు ఖర్గే పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దానికి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఇంతలోనే ఖర్గే కలుగజేసుకుని ముందు బీజేపీని గద్దె దింపాక, పీఎం ఎవరన్న దానిపై తర్వాత మాట్లాడదాం’’ అన్నారని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుసేన్ ఫెడరల్‌తో అన్నారు.
ఆర్‌జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ.. ‘‘సమావేశంలో ఖర్గే సమయస్ఫూర్తిగా మాట్లాడారు. రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై తప్పకుండా చర్చించాలి. అయితే అంతకంటే ముందు మనం గెలవాలి. కూటమిలో అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ఆ విషయంపై మాట్లాడదామమన్నారు’’ .
పీఎం అభ్యర్థి పేరును తెరమీదకు తెస్తే.. బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని, అందుకే ఖర్గే ఆ విషయాన్ని దాటవేశారని కొందరు కాంగ్రెస్ నేతలంటున్నారు.
‘‘తన 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఖడ్గే ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యారు. 2024 ఎన్నికలను లీడ్ చేసే సత్తా ఖర్గేకు ఉందని ఆమె చెప్పారు. కూటమిని కూడా లీడ్ చేయగలడని చెప్పడానికి ఆమె సంశయించారు’’ అని ఖర్గేకు సన్నిహితుడైన కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. ఏదేమైనా పీఎం అభ్యర్థి ఎంపిక కూటమి సభ్యులందరి అభిప్రాయ సేకరణ తర్వాత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు..
సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఖర్గే ఏర్పాటు చేశారు. ఇందులో అశోక్ గెహ్లాట్, భూపేష్ బాగల్, ముఖుల్ వాస్నిక్, సల్మాన్ కుర్షిద్, మోహన్ ప్రకాశ్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ ప్రతి రాష్ట్రంలో సీట్ల సర్దుబాటుపై కూటమిలో ఉన్న పార్టీల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటుందన్నారు. విబేధాలు తలెత్తితే నేరుగా తన దృష్టికి తేవాలని ఖర్గే స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటుపై కూటమిలోని అన్ని పార్టీల అధ్యక్షులు చర్చించుకుని జనవరి మాసాంతానికి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం.
ఈవీఎంలపై చర్చ..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై కూటమిలో చర్చకు వచ్చింది. వాటి వినియోగంపై కొందరు కూటమి సభ్యులు అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని ఎలక్షన్ కమిషన్‌కు స్పష్టంగా వివరించాలని అభిప్రాయపడ్డారు. ఈవీఎంల పనితీరును వివరించడానికి ఎలక్షన్ కమిషన్ విముఖత చూపుతున్న నేపథ్యంలో వివిపీఏటీ స్లిప్పులను బ్లాక్స్‌లో వేయడం కంటే వాటిని ఓటర్లకే ఇచ్చి వారే ప్రత్యేక పెట్టేలో వేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూటమిసభ్యులు అన్నారు.
22 నుంచి సామూహిక నిరసనలు..
ఈ నెల 22 నుంచి సామూహిక నిరసనలు చేపట్టాలని కూటమి సభ్యులు నిర్ణయించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలను సస్పెండ్ చేయడం, డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి యువకుల చొరబాటుపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా నోరు మెదపకపోవడంపై కూటమి సభ్యులు ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.
బాలు, నితీష్‌కుమార్ వాగ్వాదం..
సమావేశంలో డీఎంకేకు చెందిన టీఆర్‌బాలుకు, జేడీయూ చీఫ్ నితీష్‌కుమార్‌కు మధ్య స్వల్వ వాగ్వాదం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యలను ఇంగ్లీషులోకి మార్చాలని డీఎంకేకు చెందిన టీఆర్ బాలు కోరడమే అందుకు కారణం. (ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తన మాటలను ఇంగ్లీష్‌లోకి అనువదించడం ఆపేశాడని తెలుసుకున్న నితీష్ జాతీయ భాష హిందీ నేర్చుకోమని టీఆర్ బాలుకు సూచించారట)