‘కేరళలో బీజేపీని అడుగుపెట్టనివ్వం’

కేరళలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోమని కాంగ్రెస్ ఎంపీ మురళీధరన్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీని మూడో స్థానంలో ఉంచేలా పనిచేస్తామన్నారు.

Update: 2024-03-09 06:16 GMT

తన తండ్రి వారసత్వం పార్టీకి విలువైన ఆస్తి అని, దానిని బీజేపీకి ఇవ్వబోమని కేరళ మాజీ ముఖ్యమంత్రి కే కరుణాకరన్ కుమారుడు కాంగ్రెస్ ఎంపీ కే మురళీధరన్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీని మూడో స్థానానికి నెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.

మురళీధరన్ త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి నటుడు సురేష్ గోపి, ఎల్‌డీఎఫ్ నుంచి వీఎస్ సునీల్ కుమార్‌ పోటీ చేస్తున్నారు.

ఉత్తర కేరళ జిల్లా నిలంబూరులో ఏర్పాటుచేసిన బీజేపీ బ్యానర్‌లో ప్రధాని మోదీ, మాజీ సీఎం కరుణాకర్, పద్మజ ఫోటోలు కనిపించాయి. దీనిపై మురళీధరన్ మాట్లాడుతూ .. తన తండ్రి జీవితాంతం వ్యతిరేకించిన ఒక సంస్థ ఇప్పుడు ఆయన ఇమేజ్‌ను దెబ్బతిస్తోందని విచారం వ్యక్తం చేశారు.

కేరళలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోమని ప్రకటించిన మురళీధరన్.. తాను శనివారం త్రిసూర్‌కు బయలుదేరి వెళ్తున్నానని, పార్టీ అప్పగించిన విధులను నిర్వర్తిస్తానని చెప్పారు.

మురళీధరన్ పోయినసారి వటకర నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే ఈ సారి త్రిస్సూర్‌కు ప్రాతినిధ్యం వహించడానికి కారణం ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు మురళీధరన్ సమాధానం చెప్పడానికి నిరాకరించారు. మురళీధరన్ నిర్ణయమే పద్మజను బీజేపీలో చేరడానికి ప్రభావితం చేసి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఆమె గురువారం కమలం గూటికి చేరిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News