లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ సుడిగాలి పర్యటన..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర దక్షిణాదిన ఉన్న తమిళనాడు, కేరళ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు.

Update: 2024-02-24 13:43 GMT

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. దక్షిణాదిన ఉన్న తమిళనాడు, కేరళ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు.

రెండు రోజుల పాటు కేరళ, తమిళనాడులో..

ప్రధాని మోదీ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. 27న తిరువనంతపురంలో మొదట దిగి, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచే పర్యటన మొదలవుతుంది. పలు అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు. రాష్ట్ర రాజధానిలో జరిగే మెగా బహిరంగ సభలోనూ మోదీ ప్రసంగించనున్నారు.

తదనంతరం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై చేపట్టిన 'పాదయాత్ర' ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. MSME రంగానికి సంబంధించిన డిజిటల్ మొబిలిటీ ఈవెంట్ కోసం ఆయన మధురైని కూడా సందర్శిస్తారు.

ఫిబ్రవరి 28న ప్రధాని తమిళనాడులో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కె కరుణానిధి కుమార్తె తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోదరి కె కనిమొళి నియోజకవర్గం తూత్తుకుడి (టుటికోరిన్)లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

దక్షిణాదిపైనే గురి..

ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులో మోదీ పర్యటించడం ఇది మూడోసారి. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ బాగా పుంజుకుంటోన్న క్రమంలో.. దక్షిణాదిపై కూడా పట్టు సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టారు.

59 లోక్ సభ స్థానాల్లో (తమిళనాడులోని 39, కేరళలోని 20 ) బీజేపీ తరుపున ఒక్క ఎంపీ కూడా లేరు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఘోరమైన పనితీరును ప్రదర్శించింది. మొత్తం 25 లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తెలంగాణాలో 17 లోక్ సభ స్థానాలకు నాలుగింటిని గెలుచుకోగలిగింది.

పొరుగున ఉన్న కర్ణాటకలో 29 స్థానాలకు 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే, గత ఏడాది అధికారానికి దూరంగా ఉన్నందున ఈసారి అదే పనితీరు కనపర్చడం అంత సులభం కాదు. జేడీ(ఎస్)తో బీజేపీ పొత్తు పెట్టుకున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఎంత వరకు కోలుకుంటుందో కాలమే చెప్పాలి.

మహారాష్ట్ర..

ప్రధాని మోదీ ఫిబ్రవరి 28 వతేదీ మహారాష్ట్ర చేరుకుంటారు. అక్కడి యావత్వాల్ లో పలు అభి..వద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మహారాష్ట్ర నుంచి సాధ్యమయినన్ని ఎంపీ స్థానాలలో విజయం సాధించుకోవాలని బీజేపీ చూస్తుంది. అయితే అక్కడ పార్టీల పరంగా ఇటీవల జరిగిన పరిణామాలు ఏ మేరకు బీజేపీ కలిసివస్తాయో చూడాలి.

పశ్చిమ బెంగాల్..

వచ్చే నెల ప్రారంభంలో ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. మార్చి 1న ఆరాంబాగ్లో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. మార్చి 2న కృష్ణానగర్ లో జరిగే కార్యక్రమాలు, బహిరంగ ర్యాలీలో పాల్గొంటారని సమాచారం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2019 ఎన్నికల్లో మహువా మొయిత్రా గెలిచిన నియోజకవర్గం కృష్ణ నగర్. క్యాష్ ఫర్ క్వరీ కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉన్నందున ఇటీవల ఆమెను లోక్ సభ సభ్యత్వం నుండి తొలగించిన విషయం తెలిసిందే.

అయితే అందరి చూపు మార్చి 6న బరాసత్ లో జరిగే బహిరంగ ర్యాలీపైనే ఉండబోతుంది. సందేశాఖాలీ జిల్లాలోనే జరగనున్న ఈ ర్యాలీకి దాదాపు 2 లక్షల మంది మహిళలను హాజరయ్యేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది.

Tags:    

Similar News