అమానవీయం: మైనర్‌ను వ్యభిచార గృహాలకు అమ్మేసిన తల్లి
కన్న కూతుర్ని రెండు సార్లు వేర్వేరు వ్యభిచార గృహాలకు అమ్మేసింది. లైంగిక హింసకు గురైన బాలిక అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూసింది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లో జరిగింది.
పేగు తెంచుకు పుట్టిన కన్నబిడ్డను వ్యభిచార గృహానికి అమ్మేసిందో తల్లి. ఆరోగ్యం క్షీణించడంతో వ్యభిచార గృహ యజమాని మైనర్ బాలికను తల్లి ఇంటి వద్ద వదిలేసి వెళ్లింది. ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు బాధితురాలిని ఆసుపత్రిలో తరలించినా వైద్యులు కాపాడలేకపోయారు. ఈ హృదయ విదారక ఘటన కోల్‌కతాలో జరిగింది.
కోల్‌కతా నగరానికి చెందిన ఓ మైనర్ అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో విస్తూపోయే నిజాలు వారికి తెలిశాయి. కన్నతల్లే రెండు సార్లు వేర్వేరు వ్యభిచార గృహాలకు అమ్మేసినట్లు నిర్ధారించారు.
పోలీసుల ముందు పశ్చాత్తాప నటన..
2021లో తన కూతురిని బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్‌లోని వ్యభిచార గృహానికి మొదట విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌జీవో నిర్వాహకులు కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ముజఫర్‌పూర్ చేరుకుని వ్యభిచార ముఠా నుంచి రక్షించి బాలికను తల్లికి అప్పగించారు. తన కూతురిని తీసుకొచ్చి అప్పగించడంతో పోలీసుల ముందు పశ్చాత్తాప పడినట్లు నటించింది తల్లి. 2022లో రెండో సారి తన కూతురిని ఓ ఏజెంట్ ద్వారా ఉత్తర కోల్‌కతాలోని సోనాగచికి అమ్మేసింది. ఆసియాలో ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఉన్న రెడ్-లైట్ ఏరియాలో ఇదొకటి. ఈ క్రమంలో లైంగిక దాడికి గురై బాలికఅనారోగ్యానికి గురవడంతో వ్యభిచార గృహ యజమాని ఆమెను తల్లి ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఎన్‌జీవో సభ్యులు బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ కన్నుమూసింది.