భార్యపై పులి దాడి, కాపాడిన భర్త
భార్యభర్తలిద్దరూ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఎటునుంచి వచ్చిందో తెలీదుకాని..అమాంతంగా పులి దాడిచేసింది. పులి బారినుంచి భార్యను ఎలా కాపాడుకున్నాడు?
మైసూరు జిల్లాలో పులుల సంచారంతో జనం హడలెత్తిపోతున్నారు. నంజన్‌గూడు తాలూకా హల్లారే గ్రామంలో పులి ఓ మహిళపై దాడిచేసింది. భర్త లోకేష్ నాయక్‌తో కలిసి పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా శివమల్లమ్మ(36)పై పులి పంజా విసిరింది. ధైర్యాన్ని కూడగట్టుకుని లోకేష్ గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే గాయపడిన భార్యను లోకేష్ తోటి రైతుల సాయంతో ఆసుపత్రికి తరలించాడు.
చిరుతపులి కాలిముద్రలు కనుగొన్నాం..
‘‘సమాచారం అందిన వెంటనే మేం ఘటనా స్థలానికి చేరుకున్నాం. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించాం. చివరకు చిరుతపులి కాలిముద్రలను కనుగొన్నాం. సమీప ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు అమర్చి, బోన్లు ఏర్పాటు చేశాం. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. గాయపడిన శివమ్మ మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.’’ అని మైసూర్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు మాలతి ప్రియ తెలిపారు.
గతేడాది చివర్లోనూ..
గతేడాది నవంబర్ 14న హెడియాలా ప్రాంతంలో పులి దాడి చేసిన ఘటనలో రత్నమ్మ (56) చనిపోయింది. అంతకుముందు కూడా పశువులపై దాడిచేసిన పులిని అటవీశాఖ అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో అటవీ శాఖ సిబ్బందితో సహా 207 మంది పాల్గొన్నారు. పులి కదలికలను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలతో సహా 50 కెమెరాలను ఉపయోగించారు. బంధించిన పులిని మైసూరులోని కూర్‌గల్లిలోని జంతు పునరావాస కేంద్రానికి తరలించారు.
దడ పుట్టిస్తున్న పులుల సంచారం..
మైసూరు ప్రాంతంలో చిరుతపులి, పులి దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం గ్రామస్థులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇకపై పులులు దాడిచేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.