పూరీ జగన్నాథ రథయాత్ర ఎప్పుడంటే..

పూరీ జగన్నాథ రథయాత్రకు ఒడిషా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.భారీగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లును నడపనుంది.

Update: 2024-07-02 12:17 GMT
ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఇటీవల న్యూఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించారు.

పూరీ జగన్నాథ రథయాత్ర జూలై 7, 8 తేదీల్లో జరగనుండడంతో ఆ రెండు రోజులు సెలవుదినాలని ప్రకటించాలని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారులను ఆదేశించారు. రథయాత్ర నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రథయాత్రలో పాల్గొంటారని ముఖ్యమంత్రి చెప్పారు. జూలై 6 సాయంత్రం పూరీకి చేరుకుని జూలై 7న రథోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది.

కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తుంటారు. జులై 7న పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రథయాత్ర ప్రత్యేకతలివే..

పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకెల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న పూరీ జగన్నాథ రథయాత్రోత్సవం ఏటా జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు.

రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుంచి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.

రథయాత్రకు ప్రత్యేక రైళ్లు..

పూరీ జగన్నాథుడి రథయాత్రకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో వారి సౌకర్యార్ధం రైల్వేశాఖ 315 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఒడిశాలోని బాదం పహాడ్‌, రూర్కెలా, బాలేశ్వర్‌, సోనేపుర్‌, దస్‌పల్లా, జునాగఢ్‌ రోడ్‌, సంబల్‌పుర్‌, కేందుజుహర్‌గఢ్‌, పారాదీప్‌, భద్రక్‌, అనుగుల్, గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్‌ మ్యాప్‌‌ను సిద్ధం చేశారు. దక్షిణ మధ్య రైల్వే కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను తిప్పే అవకాశం ఉంది.   

Tags:    

Similar News