ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకలా అపకీర్తి పాలవుతున్నారు?
కేరళలో ఇద్దరు ఐఎఎస్ ల అధికారుల సస్పెన్షన్. ‘ఆనెస్టు, ఇండిపెండెంట్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు’ అనే జాతి అంతరించిపోతున్నదా?
By : Chepyala Praveen
Update: 2024-11-12 07:19 GMT
ఐఏఎస్ (IAS:Indian Administration Service) అంటే ఒకపుడు ప్రజలు ఎంతో గౌరవప్రదంగా చూసేవారు. అది ఉన్నత పదవి అనే కాదు, చాలా తెలివైన వాళ్లని, ప్రభుత్వాలను నడిపించే శక్తి సంపన్నులని ప్రజలు భావించే వాళ్లు. దేశంలో అంతకంటే మరొక పెద్ద ఉద్యోగం లేకపోవడం మరొక కారణం.
ఈ ఉద్యోగాలకు ఎంపికై వచ్చాక ఐఎఎస్ అధికారులు ప్రజలకు మేలు చేసే విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే వారు. రాజకీయనాయకులు అయిదేళ్లుంటారు. పోతారు. కాని ఐఎఎస్ అధికారులు చాలా కాలం (Permanent Executive) ఉంటారు. జిల్లాల్లో ప్రజలకు దగ్గిర పనిచేసేటపుడు చాలా మంది కలెక్టర్లు విశేష ప్రజాభిమానం చూరగొంటారు. అందుకే ఆ తర్వాత ప్రమోషన్ రాజధాని లోని సెక్రేటేరియట్ కు కార్యదర్శులుగా వెళ్లినా ప్రజలు వాళ్లని జిల్లా కలెక్టర్ గానే గుర్తుంచుకుంటారు.
కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ పాపులారిటీ ఐఎఎస్ అధికారులు పొందారు. కొంతమంది ఐఏఎస్ అధికారుల పేరుతో కాలనీల సైతం వెలిశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆ జాతి గౌరవప్రదమయిన జాతి అంతరించిపోతున్నదా అనిపిస్తుంది.
వివిధ రాష్ట్రాలనుంచి ఐఎఎస్ అధికారుల భ్రష్టాచారం చూస్తేఅలాగే అనిపిస్తుంది. వాళ్లు కిందిస్థాయి ప్రభుత్వోద్యోగులకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయనాయకుల కాళ్లు మొక్కతున్నారు. వాళ్లకాళ్లకిందర కింద కూర్చొంటున్నారు. వంగి వంగి ప్రణామాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల సంపాదనకు తోడ్పడుతున్నారు. పార్టీ నాయకులంటే ఎక్కువగా పార్టీ రంగు పూసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలు చాలా మంది ఐఏఎస్ అధికారులు అనధికారికంగా రాజకీయ పార్టీలో సభ్యులనే పేరుంది. అధికార పార్టీ ఎన్నికల్లో ఓడిపోగానే వివాదాల్లో చిక్కకుంటున్నారు. పోస్టింగులు రాకుండా మూలన కూర్చొంటున్నారు. సస్పెండ్ అవుతున్నారు. కొంతమంది జైలుకు కూడా పోయారు. సస్పెండ్ అవుతున్నారు.
తాజాగా కేరళ క్యాడర్ కు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారుల హెడ్ లైన్లకు ఎక్కారు. కారణం వాళ్లిద్దరని కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
కేరళలోని పరిశ్రమలు- వాణిజ్య శాఖ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి కే గోపాల కృష్ణన్ ‘ మల్లు హిందూ ఐఏఎస్ ఆఫీసర్స్ ’ పేరుతో వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. దీనిలో చాలామంది రాష్ట్ర ఐఏఎస్ అధికారులను సభ్యులుగా చేర్చే ప్రయత్నం చేశారు.
దీనిపై కొంతమంది అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసి రాష్ట్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విచారణ అనంతరం సదరు అధికారిని చీఫ్ సెక్రటరీ సస్పెండ్ చేశారు. మరో అధికారి ఎన్ ప్రశాంత్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఓ ఉన్నతాధికారిని సైకోపాత్ గా మీడియా ముందు చెప్పడంతో ఆయనపై కూడా వేటు పడింది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల వివాదాలకు తక్కువేం కాదు. ఆమాటకొస్తే ఎక్కువ కాలం అవినీతి ఆరోపణల కింద జైలు కు వెళ్లిన అధికారులున్న రాష్ట్రాలు కూడ ఇవే. పాత విషయాలు వదిలేసి తాజా ఐఎఎస్ కబుర్లు చెప్పుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లో చీఫ్ సెక్రటరీగా పని చేసిన సోమేష్ కుమార్ అప్పటి ప్రభుత్వం ఏం చెప్పిన గుడ్డిగా ఫాలో అయ్యేవారని అపవాదు పడింది.
అనేక కీలక విధానాలను రూపొందించి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పరిశీలించి వాటికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ హెడ్ అయిన సీఎస్ పైనే ఉంటుంది. కానీ ఉన్నతస్థాయిలో ఉన్న సోమేష్ కుమార్ వీటిని పట్టించుకోలేదని, కొంతమంది కీలక రాజకీయ నాయకులు ఏం చెబితే అదే చేశారని ప్రచారం జరిగింది.
అంతేకాదు, ప్రభువులకోసం చాలా చట్ట వ్యతిరేకమయిన పనులు చేశారని, బాగా వెనకేసుకున్నారని కూడా ఆయన మీద తెలుగు మీడియా విపరీతంగా రాస్తున్నది. ఆంధ్రలో చంద్రబాబు కంటే, తెలంగాణ కెసిఆర్ తనకు చల్లటి నీడనిస్తారని ఆయన ఆంధ్రా క్యాడర్ నుంచి తెలంగాణ మార్పించుకున్నారు.ఇదే ఆయన కొంపముంచింది. ఇక్కడ మంచి పదవులు పొందారు. హోదా వెలగబెట్టారు. అయితే, కోర్టు ఆయన్ని ఆంధ్రాకే పంపించింది.
దీనితో తెలంగాణ వదిలేయాల్సింది. అయితే, ఆంధ్రా ముళ్లబాట అని గమనించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ పదవీ విరమణ తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ సలహదారుడిగా మారారు. అంతకుముందు తెలంగాణ లో సీఎస్, డీజీపీ గా పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా లక్షల రూపాయల ప్రభుత్వ జీతం తీసుకుంటూ సలహదారులుగా ఉన్నారు.
ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉంటే రిటైరయ్యాక సలహాదారులవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు. ఈ దురాశ చాలా మంది ఐఎఎస్ ఆఫీసర్లను బజారు పాలు చేస్తున్నది.
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నా వెంక్రటామిరెడ్డి కూడా ఒకప్పుడు ఐఎఎస్ అధికారిగా పనిచేశారు. ఆయన చివరగా మెదక్ జిల్లాలో పనిచేసి తరువాత రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా, రైతులను ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ లో 2016 లో జరిగిన భూ సమగ్ర సర్వే లో కూడా ఐఏఎస్ అధికారుల పాత్ర మరువలేనిది. రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బందిపెట్టారో మాటల్లో చెప్పలేం. చిన్న తప్పులకు కూడా భూమలను పార్ట్ బీ లో పెట్టి, నరకం చూపించారు. ధరణి మొదలయ్యాక ఈ కష్టాలు ఇంకా పెరిగిపోయాయి.
చాలామంది రైతులకు పట్టాదార్ పాస్ బుక్ లు రాక తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. ఎంతమంది రైతులు ఎన్ని పిటిషన్లు ఇచ్చారో లెక్కే లేదు. అన్ని అధికారాలు కలెక్టర్ల దగ్గరే ఉండటం, అర్జిదారులతో ఒక్క మాట కూడా మాట్లాడానికి కలెక్టర్లు సమయం ఇవ్వకపోవడంతో అన్ని సమస్యలు అలాగే మిగిలిపోయాయి.
ధరణి వల్ల క్షేత్రస్థాయిలో రైతులు ఎట్లా గోసపడుతున్నారో ఫీడ్ బ్యాక్ ను ప్రభుత్వానికి అందించడంలో ఐఏఎస్ అధికారులు విఫలం అయ్యారు. ‘ ఏం చెబితే తమ ఎదుగుదల ఆగిపోతుందో’ అని కిక్కురమనకుండా ఉన్నారు.
గత ప్రభుత్వ సీఎంఓ ఆఫీస్ లో కీలకంగా వ్యవహరించిన స్మిత సభర్వాల్ వ్యవహరశైలి పై అనేక ఆరోపణలు వచ్చాయి. పూర్తిగా ప్రభుత్వానికి సరెండర్ అయ్యారనే అపవాదును తెచ్చుకున్నారు. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎంతమంచి పేరు సంపాదించుకున్నారో, సీఎంఓ ఆఫీస్ లో చేరాక అన్ని అన్ని వివాదాలు చుట్టుముట్టాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కీలక సమావేశాలకు డుమ్మా కొట్టారనే ప్రచారం జరిగింది. తరువాత దివ్యాంగుల పై చేసిన ట్వీట్ తో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతి చిన్న విషయానికి కూడా సీరియస్ గా రియాక్ట్ అవుతారని తెలిసిన వారి మాట. బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం సైతం జరిగింది.
ఈడీ కేసులో అమోయ్ కుమార్..
పూర్వపు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అమోయ్ కుమార్ పై భూదాన్ భూముల బదిలీ వ్యవహరంలో ఏకపక్షంగా వ్యవహరించారని కేసు నమోదు అయింది. ఈ వ్యవహరంలో వందల కోట్లు చేతులు మారాయని, దాని వెనక అమోయ్ కుమార్ ప్రమేయం ఉందని ఈడీ ఆయన ఇప్పటికే గుర్తించి విచారించింది. తాజాగా ఆయనపై కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీ డా. జితేందర్ ను కలిసి కోరింది.
కొన్ని రోజలు క్రితం కూడా ఓ యువ ఐపీఎస్ అధికారిణిని కూడా తన పరిధిలో లేని ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వందల కోట్ల ల్యాండ్ సెటిల్ మెంట్ కు ప్రయత్నించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. స్టేషన్ ఎస్ఐ ఆ సంగతి మన పరిధిలోకి రాదని చెప్పినప్పటి కూడా బెదిరించారని, తన భర్త ఐఎఎస్ అధికారి అని బెదిరించి స్పాట్ కు వెళ్లాలని సూచిందని తెలిసింది. తరువాత ఈ వ్యవహరం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆ అధికారిణికి తలంటారని సమాచారం.
వైఎస్ జగన్ కేసులో..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మీ ఏకంగా జైలు కు వెళ్లారు. రాజకీయ నాయకులు పెట్టమన్న చోట సంతకాలు పెట్టడంతోనే తన భవిష్యత్ ను కోల్పోయారనే ప్రచారం జరిగింది. జైలు కు వెళ్లడంతో ఆరోగ్యం పాడైంది. కాకపోతే ఈ ఐఎఎస్ అధికారిణి జైలుకు వెళ్లడంతో చాలామంది ఉన్నతాధికారులు తరువాత జాగ్రత్తపడ్డారని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన చాలా కేసుల్లో ఐఏఎస్ అధికారులు సంతకం పెట్టిన ఫైళ్లలో సీఎం ఆదేశాల మేరకే తాము అలా చేశామని నోట్ ఫైళ్లలో పేర్కొన్నారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కూడా చంద్రబాబు హాయాంలో అవినీతికి పాల్పడ్డారని, కొన్ని కీలక పరికరాల కొనుగోలు పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే దాదాపు వైఎస్ జగన్ అధికారంలో ఉన్న కాలంలో పోస్టింగ్ లేకుండా కోర్టుల చుట్టూ తిరగుతూనే ఉన్నారు.
తమ ఫోన్లను ట్యాప్ చేశారని, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి కారణంగా ఏబీ వెంకటేశ్వరరావే అని ఆ పార్టీనేతలు విమర్శలు గుప్పించారు. ఎట్టకేలకు చివరి పనిదినం రోజు డీజీగా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి వచ్చిరాగానే ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. ముంబై నటీ జత్వాని అరెస్ట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని విశాల్ గున్ని, కాంతారాణా తాతా, సీతారామాంజనేయులపై వేటు పడింది.
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కీలక సూత్రధారి అని దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు. అనేక మంది ప్రత్యర్థి పార్టీ నాయకులు ఫోన్లను ఆయన ఆదేశాల మేరకే ట్యాప్ చేశామని కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తెలిపారు. దీనితో పాటు హవాలా డబ్బు వ్యాపారుల ఫోన్లను సైతం ట్యాప్ చేసి కోట్లరూపాయలు దారి మళ్లించామని, ఎన్నికల్లో కూడా డబ్బు పంపిణీ చేయడానికి తాము సాయం చేశామని ప్రత్యక్షంగా బీఆర్ఎస్ కు మేలు చేయడానికి ప్రయత్నించామని ఒప్పుకున్నారు.
దేశాన్ని, ప్రజలను కాపాడతామని, రాత్రింబవళ్లు కష్టపడి చదివి రాజకీయ నాయకులకు దాసోహం అంటున్నారు. ఫలితంగా కేసులు ఎదుర్కొని, ఉద్యోగాలు కోల్పోతున్నారు. కానీ వీరి వల్ల ప్రజలు నష్టపోతున్నారు. వారి సమస్యలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగడానికి ఉన్నత స్థాయిలో బ్యూరోక్రసీ రాజకీయ నాయకులకు దాసోహం కావడమే కారణం.