నీ ధాటికి అడ్డులేదు నీ త్యాగం వృధా కాదు పవన్ కల్యాణ్!

'నీ ధాటికి అడ్డులేదు నీ త్యాగం వృధా కాదు! వంటి నినాదాలే ఈవేళ (జూన్ 9న) టెక్సాస్ (అమెరికా)లోని డల్లాస్ నగరంలో మార్మోగాయి. ఎందుకంటే..

Update: 2024-06-10 05:21 GMT

'నీ ధాటికి అడ్డులేదు నీ త్యాగం వృధా కాదు!

నీ ఆదర్శం ఎప్పుడూ నీతోనే ఆగిపోదు!

ఇది ప్రపంచ పర్యాప్తం జనశక్తికి పరమాప్తం!

ఈ పోరాటం అంతిమ విజయంతోనే సమాప్తం!' అంటారు మహాకవి శ్రీ.శ్రీ.

సరిగ్గా ఈ తరహా నినాదాలే ఈవేళ (జూన్ 9న) టెక్సాస్ (అమెరికా)లోని డల్లాస్ నగరంలో మార్మోగాయి. 'అభిమానానికి అవధులు ఉంటాయా?' 'వలసొస్తే బాధ్యతలు మరుస్తామా!' అంటూ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి డల్లాస్ లో ఉంటున్న ప్రవాసులు గర్జించారు. మూడు గంటల పాటు లూయిస్ విల్లీలోని కాకతీయ ఫంక్షన్ హాలులో జరిగిన చిత్రవిచిత్రాలనేకం వందలాది ప్రేక్షకుల్ని అలరించాయి. ఆలోచింపజేశాయి. డల్లాస్ జనసైన్యం బ్యానర్ కింద ఓ రేంజ్ లో జరిగిన జనసేన విజయోత్సవ సభకు పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా వందలాది మంది హాజరై ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి విజయాన్ని మనసారా ఆస్వాదించారు. మహాకూటమి నేతలను ప్రత్యేకించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆకానికెత్తుతూ హోరెత్తించారు. గేమ్ ఛేంజరంటూ పొగడ్తలతో ముంచెత్తారు.


తెలుగు రాష్ట్రాలను తలపించేలా మండిపోతున్న ఎండలు ఓపక్క.. ఆలింగనాలు ఆప్యాయతలు మరోపక్క.. ఇలా వందలాది మంది సభా ప్రాంగణానికి చేరుకుని ఒకర్ని ఒకరు అభినందించుకుంటూ మహాకూటమి విజయోత్సవ సంబరాలను మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం కావొస్తున్నా అందరి నోటా జగన్ ఓటమి మాటే. 'అంత ఘోరంగా ఓడారేమిటి బ్రో' అని ఒకరంటే 'జగన్ పై కోపం ఆ స్థాయిలో ఉందన్న మాటంటూ' మరొకరు.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు.. ఎవరికి తోచిన రీతిలో వాళ్ల విశ్లేషణలు.. పేరుకే కూటమి విజయోత్సవ సభ అయినా వ్యవహారమంతా పవన్ కల్యాణ్, ఆయన పార్టీ చుట్టూనే సాగింది. గెలుపులో ఉండే కిక్కే వేరుగా ఉంటుంది కదా సరిగ్గా అలాగే సాగింది. వచ్చిపోయే వాళ్లకూ జనసేన స్టిక్కర్లు అంటించడం, జనసేన జెండాలు మెడలో వేయడం... నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అనే స్టిక్కర్లను ఇవ్వడం వంటివి సైడ్ లైట్స్ కాగా పవన్ కల్యాణ్ ప్రస్థానం సూపర్ హిట్.

సభ ప్రారంభంలో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన 2014 నుంచి ఇప్పటి వరకు సాగిన జనసేన పదేళ్ల ప్రస్థానాన్ని దృశ్య రూపంలో తెరపై ప్రదర్శించినప్పుడు మీటింగ్ హాలు హాలంతా చప్పట్లు, ఈలలు, కేకలతో మార్మోగింది. పవన్ కల్యాణ్ డైలాగులు వినిపించినప్పుడల్లా జై జనసేన అంటూ నినాదాలతో హెరెత్తించారు. ఆయన బొమ్మలపై పూలవర్షం కురిపించారు. 2019లో ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ డల్లాస్ వచ్చినపుడు ఆయన చేసిన ప్రసంగాల వీడియోలకు పెద్ద స్పందన లేకున్నా పలువురు వీరాభిమానులు తమ అభిమానాన్ని చాటుకుని బోలెడంత సంబరపడ్డారు. తెగిడిన నోళ్లే పొగిడాయని ఊరడిల్లారు. పవన్ కల్యాణ్ ఎన్నడూ ఎన్.ఆర్.ఐ.లను చందాలు అడగలేదని చెబుతూ ఓ వీరమహిళ జనసేన ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. మరో కార్యకర్త వీరావేశంతో 'బాబులకే బాబు కల్యాణ్ బాబు, డల్లాస్ గడ్డ.. జనసేన అడ్డా' వంటి నినాదాలకు లంకించుకున్నారు. దీంతో సభా ప్రాంగణం యావత్తు నినాదాలతో హోరెత్తింది.

ఇదంతా జరుగుతుండగానే జూమ్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యే జనసేన ఎమ్మెల్యేలు తెరపై ప్రత్యక్షమయ్యారు. జూమ్ ద్వారా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, నాగబాబు (జనసేన జాయింట్ సెక్రటరీ), తుమ్మలబాబు (పెద్దాపురం జేఎస్పీ ఇంచార్జి), దర్శి ఇంచార్జి ఎన్.ఆర్.ఐ. వెంకట్ మీటింగ్ లో జాయిన్ అయి తమ సందేశాలను వినిపించినపుడు చప్పట్లకు కొదువ లేదు. మాట్లాడిన ప్రతి ఎమ్మెల్యే తమ గుండెల్లో కొలువైంది ఒక్క పవన్ కల్యాణేనని, ఆయన ఏమి చెబితే అది చేస్తామని చెబుతుండగానే గతంలో అంటే 2019లో జనసేన టికెట్ పై గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక పార్టీ మారిన విషయాన్నీ చెప్పుకుంటూ చెవులు కొరుక్కున్నారు.

ముందుగా మాట్లాడిన లోకం మాధవి కూడా ఎన్ఆర్ఐ కావడంతో ఆమెకు డల్లాస్ లో ఎక్కువ ఫాలోయింగే ఉన్నట్టు కనిపించింది. అవినీతికి తావు లేకుండా తన ఆస్తులన్నింటిని ప్రకటించానని, పవన్ కల్యాణ్ విధానాలే ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దుతానని మాటిచ్చానన్నారు. అందుకు ఎన్.ఆర్.ఐల సహకారాన్ని కోరారు. నియోజకవర్గానికి వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి చూపించమని ఆమె కోరినప్పుడు చాలా మంది సానుకూలంగా స్పందించారు. చప్పట్లతో తమ హర్షామోదాలను తెలిపారు. మండలి బుద్ద ప్రసాద్ మరో అడుగు ముందుకేసి ఎన్ఆర్ఐలతో తనకున్న సంబంధాలను సోదాహరణంగా వివరించారు. డల్లాస్ లో గాంధీ విగ్రహం ఏర్పాటు సమయంలో తాను చేసిన కృషిని వివరించారు. పనిలో పనిగా జగన్ పాలనను, పవన్ కల్యాణ్ ఔదార్యాన్ని వివరించినపుడు కింది నుంచి సెటైర్లు పేలాయి. ఒకవేళ జనసేన టికెట్ ఇవ్వకపోతే పవన్ ను ఇలాగే పొగిడేవారా అంటూ జోకులు వేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కాస్తంత భావోద్వేగానికి లోనయినట్టు కనిపించింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాత్రం తన గుండెల నిండా పవన్ కల్యాణేనని, ఆయన చేసిన త్యాగం ముందు ఎవరెన్ని మాటలు చెప్పినా దిగదుడుపేనని చెప్పుకొచ్చారు. అవినీతి రహిత పాలనకు పెద్ద పీట వేస్తామన్నారు.


ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరూ పవన్ ను కీర్తించిన వారే. పొగడ్తలతో ముంచెత్తిన వారే. పనిలో పని కొందరు- ఎన్.ఆర్.ఐల సేవల్ని కొనియాడారు. ఎన్నికల సంగ్రామంలో ఎన్నారైల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ప్రవాసాంధ్రులు ఎంతో సహకారాన్ని అందించారన్నారు. విదేశాల్లో ఉండి కూడా జనసేనకి ఓట్లు వేసేలా తమ తల్లిదండ్రుల్ని ఒప్పించిన ఘనత పిల్లలకు దక్కిందన్నారు. పవన్ పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్ల భీష్మప్రతిజ్ఞలు వంటివనేక సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

ఈ మీటింగ్ నిర్వాహకులు 'డల్లాస్' బాబీ , సురేష్ లింగినేని , రాజేష్ కళ్ళేపల్లి (ఎంటర్ ప్రెన్యూర్, ఫిలిం ప్రొడ్యూసర్), కిశోరె అనిశెట్టి లాంటి వాళ్లయితే పవన్ కల్యాణ్ ను వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా ఎలా తిట్టారా, పవన్ వ్యక్తిగత జీవితంపై ఎలా దాడి చేశారో వివరిస్తూనే బోలెడన్ని చురకలు అంటించారు. కాపుల్ని ఏకం చేసిందే జగన్ అని చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో రాష్ట్రాభివృద్ధితో పాటు కాపులకు రావాల్సిన రిజర్వేషన్ల సంగతిని కూడా అన్యాపదేశంగా ప్రస్తావించారు. మహాకూటమి తరఫున ప్రాతినిధ్యం వహించిన ఒకరిద్దరు డల్లాస్ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ త్యాగనిరతిని పొగడ్తలతో ముంచెత్తారు.

విజయోత్సవ సభ సందర్భంగా భారీ కేకులు కోశారు. టీలు పలహారాలు సరేసరి. అప్పటికే సమయం ఒంటి గంట దాటింది. రాజేష్ కళ్లేపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనంతో సభ ముగిసింది.

Tags:    

Similar News