‘ఈసీపై బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు’
ఈసీ, ఈసీ కమిషనర్లు, బీజేపీ కుమ్మక్కయారన్న లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ;
బీహార్(Bihar)లో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’లో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ఆరోపణలకు పదునుపెట్టారు. భారతీయ జనతా పార్టీ (BJP), ఎలక్షన్ కమిషన్(EC)పై విరుచుకుపడ్డారు. ఈసీతో కుమ్మకై ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR)ను తీసుకొచ్చి.. ప్రతిపక్ష ఓటర్లను తొలగించడం ద్వారా బీహార్‌లో ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు.
యాత్రలో భాగంగా అరారియాలో భాగస్వామ్య ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖేష్ సాహ్ని, సీపీఐ-ఎంఎల్‌ఎల్‌కు చెందిన దీపాంకర్ భట్టాచార్యతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోక్‌సభా ప్రతిపక్ష నేత మాట్లాడారు. "ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్లు, బీజేపీకి మధ్య లోపాయికారీ ఒప్పందం" ఉందని ఆరోపించారు. బీహార్‌లో SIR తర్వాత సుమారు 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినా.. బీజేపీ ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. "చనిపోయిన వ్యక్తుల కుటుంబసభ్యులు, ఇప్పటికే నాలుగైదు సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న వారు యాత్రలో నన్ను కలుస్తున్నారు. తమ పేర్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. బీజేపీ ఓట్ల దొంగతనంపై బీహార్‌లో ఉంటున్న ప్రతి ఒక్క ఓటరుకు తెలుసు’’ అని పేర్కొ్న్నారు. విలేఖరుల సమావేశానికి ముందు రాహుల్, తేజస్వి బైక్‌లపై ప్రయాణించారు. వీద్దరినికి చూసేందుకు జనం భారీగా రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు.
‘‘ప్రధాని పెద్ద అబద్దాలకోరు’’
ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తూ తేజస్వి ఇలా అన్నారు.. “ఈ రోజు దేశంలో ప్రధాని కంటే అబద్ధాలకోరు మరొకరు ఉండరు. మొన్న గయలో ఆయన చొరబాటుదారుల పేర్లను మాత్రమే తొలగిస్తున్నారని చెప్పడం ద్వారా SIRను వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో EC చొరబాటుదారుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.’’ అని పేర్కొన్నారు.
ఓటర్ అధికార్ యాత్ర ఆగస్టు 17న ససారాం నుంచి మొదలైన విషయం తెలిసిందే. SIRకు వ్యతిరేకంగా 20కి పైగా జిల్లాలను కలుపుతూ జరిగే 1300 కి.మీ రాహుల్ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో మెగా ర్యాలీతో ముగుస్తుంది.