రాముడికి ఆ ముహూర్తాన్ని ఎందుకు పెట్టారంటే..

శ్రీరామ ఆలయ మహాప్రారంభ ఘట్టం ఈ నెల 22న జరుగుతుంది. మరి బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట చేసే ముహూర్తానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Update: 2024-01-21 02:40 GMT

అంతా రామమయం...ఎటు చూసినా శ్రీరామనామస్మరణమే. ఈ నెల 22న భవ్యరామమందిరం ప్రారంభోత్సవానికి అయోధ్య ముస్తాబవుతోంది. ప్రాణప్రతిష్ట మహాఘట్టాన్ని చూసేందుకు భక్తులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. ఈ నెల 22న మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీరామ ఆలయ మహాప్రారంభ ఘట్టం జరుగుతుంది. అయితే సంక్రాంతి పండుగ సహా ఎన్నో మంచి రోజులు ఉండగా... 22వ తేదీనే ఈ వేడుకను ఎందుకు ఎంచుకున్నారన్నది చర్చనీయంశమైంది. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట చేసే ముహూర్తానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

అయోధ్య ముస్తాబు...

అయోధ్య ముస్తాబైంది. కోదండ రాముడు తన జన్మస్థలంలో కొలువు తీరబోయే సుమూహర్తం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. అందరివాడయిన ఆ రాముడికి.. అయోధ్యలో నిర్మించిన ఆలయం...దేశ ఆధ్యాత్మిక చరిత్ర రూపురేఖలను మార్చబోతోంది. ఈ నెల 22న దివ్యమైన ముహూర్తంలో సకలగుణాభిరాముడికి ప్రాణప్రతిష్ట జరుగుతుంది. మధ్యాహ్నం సరిగ్గా పన్నెండున్నర గంటలకు రామమందిరాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. రామాలయం ప్రారంభోత్సవానికి ఈ తేదీని, ముహూర్తాన్ని నిర్ణయించడానికి ప్రత్యేక కారణం ఉంది.

రాముడు ఏ ముహూర్తంలో జన్మించారు?

పురాణాలప్రకారం శ్రీరామచంద్రుడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. ఈ ముహూర్తం ఈ నెల 22వ తేదీన ఉదయం 11గంటల 51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. రామజన్మభూమిలో రాముడు కొలువుతీరడానికీ.. రాముడు పుట్టిన ముహూర్తాన్నే ఎంచుకున్నారు. అలాగే అభిజిత్ ముహూర్తంలో శివుడు త్రిపురాసుడు అనే రాక్షసుడిని చంపాడని...అందుకే ఈ ముహూర్తం శత్రువుల పతనానికి శుభప్రదమైనదని...విజయాలను అందిస్తుందని నమ్ముతారు. వ్యాపారాలు, ఇతర పనులు, గృహప్రవేశాలు, శుభకార్యాలకు మంచిదిగా భావిస్తారు.

ఆ రోజు మృగశిర నక్షత్రం కూడా...

జనవరి 22 మృగశిర నక్షత్రం ఉండడం కూడా ఆ తేదీ ఎంచుకోవడానికి మంచి కారణం. రాముడు జన్మించిన నక్షత్రం మృగశిర. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి రూపం, ఆకర్షణీయ వ్యక్తిత్వంతో ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. తెలివితేటలతో ఉంటారు. శ్రీరామునికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ నక్షత్రం జనవరి 22వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3గంటల52 నిమిషాలకు ప్రారంభమవుతుంది. జనవరి 23 మంగళవారం ఉదయం 4గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. మృగశిర నక్షత్రాన్ని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అమరత్వం ఉన్న దేవుడిగా పిలిచే సోమదేవతతో ఈ నక్షత్రానికి సంబంధం ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని, అనుభవాన్ని, సాధనను సూచించే మృగశిర నక్షత్రం ఘడియల్లో ఏమైనా పనిచేస్తే అందులో మంచి జరుగుతుందని నమ్ముతారు. మృగశిర నక్షత్రంలో అమృత సిద్ధి యోగం, సవర్త సిద్ధియోగం ఉంటాయి. రెండు యోగాలు ఒకే రోజు ఏర్పడడంతో దీన్ని పవిత్రమైనరోజుగా భావిస్తారు. మృగశిర..27 నక్షత్రాల్లో ఐదవది. నక్షత్రాలను పాలించే గ్రహం సోమగ్రహం. రాక్షసులు అమరత్వం కోసం సోమను అపహరించి, కమలంలో దాచారు. దేవతల కోరిక మేరకు మృగశిర సోమను విడిపించారు.

ఇదీ అసలు ముహూర్తం...

శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12గంటల 20 నిమిసాల 8 సెకన్లు నుంచి 12 గంటల 30నిమిషాల 32సెకన్ల మధ్య 84 సెకన్ల కాలంలో జరుగుతుంది. ఈ సుముహూర్తంలో ప్రాణప్రతిష్ట చేయడం ద్వారా అగ్ని, అకాల మరణం, దొంగతనం, వ్యాధులు వంటివాటి నుంచి రక్షణ లభిస్తుందని, భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోందని..వేద పండితులు చెబుతున్నారు.

అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీరామచంద్రుడు జన్మించారు. జనవరి 22న కూడా ఇవన్నీ న్నాయి. అందుకే ప్రాణప్రతిష్టకు ఇదే సరైన సమయమని పండితులు భావించారు. అలాగే ఈ కాలం జీవితాల నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని హిందువులు నమ్ముతారు. ప్రాణప్రతిష్ట ముహూర్తాన్ని మహంతులు, వేదవిదులైన శ్రేష్టులు కలిసి నిర్ణయించారు. ప్రాణప్రతిష్టకు ముందు గంట పాటు యాగం, హవనం, నాలుగువేదాల పారాయణం ఉంటుంది.

Tags:    

Similar News