ఎర్రకోట మాదే.. దాన్ని స్వాధీనం చేయండి: ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

బహదూర్ షా జాఫర్ -2 మునిమనవడి, మునిమనవడి భార్య పిటిషన్

Update: 2024-12-13 12:36 GMT

ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోట తమదే అని, దాన్ని చట్టబద్దంగా స్వాధీనం చేయాలని కోరుతూ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ -2 ముని మనవడి, మునిమనవడి భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం దీన్ని తోసిపుచ్చింది.

సుల్తానా బేగం 2021 లో ఈ పిటిషన్ దాఖలు చేయగా అప్పట్లో సింగిల్ బెంచ్ ఈ కేసును కొట్టివేసింది. తాజాగా ఈకేసును తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ తుషార్ రావు గేదెల ధర్మాసనం తోసిపుచ్చింది. రెండున్నర సంవత్సరాల తరువాత రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం ఏంటనీ ప్రశ్నించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితి విషమించడం, తన కుమార్తె మరణించడంతో సరైన సమయంలో పిటిషన్ దాఖలు చేయలేకపోయామని పిటిషన్ దారు వివరించారు.
మీరు చెప్పిన కారణం సహేతుకంగా ఉన్నప్పటికీ చాలా ఆలస్యం అయిన కారణంగా పిటిషన్ విచారించలేమని కోర్టు తెలియజేస్తూ కేసును మూసివేసింది.
బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ అక్రమంగా తీసుకున్న ఎర్రకోటను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ బేగం వేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి తోసిపుచ్చారు, 150 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడంలో జరిగిన విపరీతమైన జాప్యానికి ఎటువంటి సమర్థన లేదని అప్పట్లో న్యాయస్థానం పేర్కొంది.
న్యాయవాది వివేక్ మోర్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్, 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య యుద్ధం తరువాత బ్రిటీష్ వారికి ఎర్రకోటను కోల్పోయారని, ఆ తర్వాత చక్రవర్తిని దేశం నుంచి బహిష్కరించారని తెలిపారు. ఈ సందర్భంలో ఎర్రకోట బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు.
1862 నవంబరు 11న 82వ ఏట మరణించిన తన పూర్వీకుడైన బహదూర్ షా జఫర్-II నుంచి ఎర్రకోటను సంక్రమించినందున బేగం ఎర్రకోటకు యజమాని అని మరియు భారత ప్రభుత్వం ఆ ఆస్తిని అక్రమంగా ఆక్రమించిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎర్రకోటను పిటిషనర్‌కు అప్పగించాలని లేదా 1857 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం అక్రమంగా వాడుకున్నందుకు పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ కోరారు.


Tags:    

Similar News