'భారత్ బంద్'కు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా

సంయుక్త కిసాన్ మోర్చా (SKM) 'భారత్ బంద్'కు పిలుపునిచ్చింది. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టపర హామీతో పాటు తమ డిమాండ్లను ఆమోదించాలని రైతులు ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Update: 2024-02-16 07:40 GMT

సంయుక్త కిసాన్ మోర్చా (SKM) 'భారత్ బంద్'కు పిలుపునిచ్చింది. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టపర హామీతో పాటు తమ డిమాండ్లను ఆమోదించాలని రైతులు ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పంజాబ్‌కు చెందిన రైతులు మంగళవారం మార్చ్‌ను ప్రారంభించారు. అయితే ఢిల్లీ, హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అప్పటి నుంచి రైతులు అక్కడే మకాం వేశారు. రైతుల ఆందోళన శుక్రవారానికి నాలుగో రోజుకు చేరుకుంది.

బార్డర్ల వద్ద స్తంభించిన ట్రాఫిక్..

రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీ, హర్యానా మధ్య రెండు సరిహద్దు పాయింట్లు వద్ద ట్రాఫిక్ స్తంభించింది. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఘాజీపూర్ సరిహద్దు వద్ద మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. ఇటు దేశ రాజధానిలో కూడా చాలా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

అప్రమత్తమైన పోలీసులు..

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా 'భారత్ బంద్'కు పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా పెంచారు. పార్లమెంట్‌తో పాటు ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంద్ కారణంగా నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

అసంపూర్ణిగా ముగిసిన చర్చలు..

ముగ్గురు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య గురువారం రాత్రి జరిగిన సమావేశం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఆదివారం నాల్గవ సారి చర్చల కోసం ఇరుపక్షాలు సమావేశం కానున్నాయి.

బార్డర్ల వద్ద బైఠాయించిన రైతులు..

పంజాబ్, హర్యానా మధ్య ఉన్న రెండు సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు, రైతు సంఘాల నాయకులు బైఠాయించారు. దీంతో సింగూ, తిక్రీ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. దేశ రాజధానిలోకి రైతులు రాకుండా అడ్డుకునేందుకు బారికేడ్లు, ముళ్ల తీగలు, కాంక్రీట్ బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. సింగు సరిహద్దు వద్ద డ్రోన్‌లతో పరిస్థితిని పోలీసులు అంచనా వేస్తున్నారు.

రైతుల డిమాండ్లివి..

ఎంఎస్‌పికి చట్టపరమైన హామీతో పాటు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, వ్యవసాయ రుణమాఫీ, పోలీసు కేసుల ఉపసంహరణ , 2021 బాధితులకు "న్యాయం" చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లఖింపూర్ ఖేరీ హింస, భూసేకరణ చట్టం, 2013 పునఃస్థాపన, 2020-21లో గతంలో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News