హత్రాస్ దుర్ఘటనలో 121 మంది మరణానికి కారణం అదే..

యూపీ హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం తన నివేదికలో ఏమని పేర్కొంది. ఎంతమంది అధికారులను సస్పెండ్ చేశారు?

Update: 2024-07-09 08:23 GMT
తొక్కిసలాటలో మరణించిన ముగ్గురి కుటుంబసభ్యలకు అంత్యక్రియలు చేసిన వ్యక్తి, ఆయన కుమారులు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రద్దీ కారణంగానే తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. జూలై 2న హత్రాస్ జిల్లా ఫుల్రాయ్ గ్రామంలో మతపర సమావేశం (సత్సంగ్)లో 121 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

సిట్ అధికారులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆగ్రా) అనుపమ్ కులశ్రేష్ఠ, అలీఘర్ డివిజనల్ కమిషనర్ చైత్ర రాష్ట్ర ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించారు. దుర్ఘటనపై కొంతమంది పోలీసులతో సహా 128 మంది సాక్షులను విచారించామని, తొక్కిసలాటకు 'సత్సంగ్' నిర్వాహకులే బాధ్యులని, స్థానిక పోలీసులు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట వెనుక కుట్ర లేదని, అయితే సమగ్ర విచారణకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం), సర్కిల్ అధికారితో పాటు మరో నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.

తొమ్మిది మంది అరెస్టు..

'భోలే బాబా'గా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సకర్ హరి 'సత్సంగం' కోసం దాదాపు 2.5 లక్షల మంది వచ్చారు. అయితే 80 వేల మందికి మాత్రమే ఈవెంట్ నిర్వాహకులు అనుమతి తీసుకున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు దేవప్రకాష్ మధుకర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఘటన తర్వాత భోలే బాబా కనిపించకుండా పోయారు. ఆయన పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. కాగా ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల ముందు హాజరయ్యేందుకు బాబా సిద్ధంగా ఉన్నారని ఆయన న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. బాబా ఆదరణకు ఓర్వలేని కొందరు కుట్రకు పాల్పడ్డారని, అందులో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విష వాయువు ప్రయోగించడంతో తొక్కిసలాట జరిగిందని, అందుకు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సింగ్ ఇప్పటికే పేర్కొన్నారు.

ఘటనపై భిన్నాభిప్రాయాలు ..

తొక్కిసలాట ఘటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాబా వేదిక నుంచి వెళ్లిపోతున్న సమయంలో పవిత్రంగా భావించే ఆయన పాద ధూళి కోసం..బాబా కారు టైర్ల ముద్రల నుంచి కొంత మట్టిని తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారని, అదే తొక్కిసలాటను దారితీసిందని కొందరు చెబుతున్నారు. బాబాను సమీపం నుంచి దర్శించుకునే క్రమంలో బాబా సెక్యూరిటీ గార్డులు, ఆయన అనుచరులు భక్తులను వెనక్కి నెట్టడంతో ఒకరిపై ఒకరు పడిపోయారన్నది మరో కోణం.

అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి హేమంత్ రావు నేతృత్వంలోని ప్రత్యేక న్యాయ కమిషన్ కూడా హత్రాస్ తొక్కిసలాటపై విచారణ జరుపుతోంది.

Tags:    

Similar News