స్పీడ్ బోటు ప్రమాదంలో 13 మంది మృతి
ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీని ఢీకొన్న నేవీ బోటు
ముంబై సముద్రతీరంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ‘గేట్‌వే ఆఫ్ ఇండియా’ నుంచి ప్రసిద్ది చెందిన ఎలిఫెంటా దీవులకు ప్రయాణికులతో వెళ్తున్న నీల్‌కమల్ అనే పడవను నేవీకి చెందిన సీడ్ బోటు ఢీకొట్టడం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 101 మందిని కాపాడినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
ప్రయాణికులతో నీల్‌కమల్ ఫెర్రీ వెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చిన నేవీ స్పీడ్ బోటు ఢీకొట్టింది. దీంతో ఆ ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. నేవీ బోటుకు ఇటీవలే కొత్త ఇంజన్‌ను బిగించారు. దాన్ని పరీక్షిస్తున్న సమయంలో అది నియంత్రణ కోల్పోయి నీల్‌కమల్ ఫెర్రీని ఢీకొట్టింది. నేవీ బోటులో ఆరుగురున్నారని, వీరిలో ఇద్దరు నేవీ సిబ్బంది, నలుగురు ఇంజన్ సరఫరా చేసిన కంపెనీకి చెందిన వారున్నారని తెలుస్తోంది.